దెయ్యం ఉంది.. కానీ కనిపించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అభినేత్రి’ చిత్రం హారర్ కామెడీ జోనర్. కానీ హారర్ అంతగా వుండదు. పూర్తి హాస్యం వుంటుంది. అలాగని ఫ్యామిలీ జోనర్ కాదు అనుకోవద్దు. పూర్తిగా కుటుంబ ప్రేక్షకులు చూసేలా వుంటుంది. హారర్ అంటే సహజంగా దెయ్యాన్ని చూపిస్తారు. ఈ చిత్రంలో మాత్రం దెయ్యం వుంటుంది కానీ ఎక్కడా కనపడదు. అదే ఈ సినిమా ప్రత్యేకత అని నటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవ తెలిపారు. తమన్నా, ప్రభుదేవ, సోనూసూద్ కాంబినేషన్‌లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘అభినేత్రి’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 7న విడుదలకు సిద్ధంచేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుదేవ చిత్ర విశేషాలను తెలిపారు.
అందుకే కథ నచ్చింది
ఇలాంటి హారర్ జోనర్ ప్లస్ కామెడీ టైపు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు గతంలో పరిచయమైనవే. కానీ నేను మాత్రం ఇలాంటి చిత్రాల్లో నటించడం ఇదే మొదటిది. అంతేకాకుండా కథానాయిక ప్రాధాన్యత వున్న పాత్ర. ఇలాంటి సినిమాను నా దర్శకత్వంలో చేయాలనే ఆశ ఎప్పటినుండో వుంది. పూర్తి స్థాయి కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో ఓ సందేశం కూడా వుంది. అందుకే హిందీలో నేనే దర్శకత్వం వహించాను.
పూర్తి సంతృప్తి
ఈ చిత్రంలో నటించడంతో నేను పూర్తి సంతృప్తి చెందాను. ఓ నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ఆనందిస్తూ నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. అయితే ఈ మూడింట్లో కొరియోగ్రాఫర్‌గానే ఎక్కువగా ఆనందించాను. ఈ సినిమాకు నిర్మాతగా కూడా మారాను.
దర్శకుణ్ని నమ్ముతా
ఒక సినిమా ఒప్పుకోవాలి అంటే కథతోపాటు దర్శకుడ్ని నమ్మి పనిచేస్తాను. వేరే దర్శకులతో పనిచేయాలనుకున్నపుడు నా ఆలోచనలను ఆ చిత్రంలో చొప్పించాలని ఎప్పుడూ ప్రయత్నించను. ఎందుకంటే, ఇప్పటికే అనేక చిత్రాలు చేసిన అనుభవం వుంది కనుక. ఓ నిర్మాతగా అభినేత్రిలో వున్న కథేంటో తెలుసు. దర్శకుడు ఏం చెబితే ఎలా నటించమంటే అలా నటిస్తూ వెళ్లాను. నాక్కూడా సినిమా చూస్తేనే కథ మొత్తం అర్థమవుతుంది అనుకుంటా.
అభినేత్రి అంటే..
మహానగరంలో నివసించే ఓ యువకుడు నవనాగరిక యువతిని పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. కానీ అతను తండ్రికిచ్చిన మాటతో ఓ గ్రామీణ యువతిని చేసుకోవాల్సి వస్తుంది. ఆమె అంటే అతనికి ఇష్టం లేదు. కానీ చివరికి ఆమెనే భారీగా కావాలనుకుంటాడు. ఆ కథ ఏంటి అనేదే పలు ఎమోషన్స్‌తో ఈ చిత్రంలో వుంటుంది. కథే డాన్స్‌ను డిమాండ్ చేసింది. అందుకే ఈ చిత్రాన్ని పూర్తి నృత్యభరితంగా చేశాం.
ఆయనే ఫేవరెట్
డాన్స్ పరంగా నాకెప్పుడూ చిరంజీవే ఫావరేట్. ఇప్పుడున్న యువ నటులలో ఒకరిద్దరు కాకుండా అందరూ నృత్యాలు బాగా చేస్తున్నారు. టాప్ లేచిపోద్ది, మెగా మెగా, ఐ వాంట్ టు ఫాలో యు పాటలు ఈమధ్య చాలా బాగా నచ్చాయి.
మూడు భాషలు కష్టం
మూడు భాషల్లో సినిమా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ చిత్రానికి దర్శకుడైన విజయ్, యూనిట్ మొత్తం చాలా కష్టపడి అభినేత్రిని తీర్చిదిద్దారు. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో మూడు భాషల్లో షూటింగ్ చేయడం మరీ కష్టం. ఇంకెప్పుడూ మూడు భాషల్లో సినిమా చేయనని దర్శకుడు చెప్పడంతో అసలైన కష్టమేంటో అర్థమైంది.
హీరో నేను కాదు
ఈ సినిమాను తీద్దామనుకున్నప్పుడు దర్శకుడు వేరే హీరోను కలిసి ఈ కథ చెప్పారు. అయితే ఆ హీరో ఎందుకనో ఈ చిత్రాన్ని చేయలేదు. అప్పుడు విజయ్ ననే్న హీరోగా చేయమని అడగడంతో ముందుకు వచ్చాను. కథ నాకు నచ్చడం, టైమ్ కూడా కలిసిరావడంతో ఈ సినిమా చేశాను.
ముందు ప్లాన్ ఏమీ లేదు
నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసి చేయను. అప్పుడప్పుడు స్పెషల్ పాటలు చేస్తుంటాను. వర్షం సినిమా కోసం ‘ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వానా..’ చేసేప్పుడు నిర్మాత రాజు నా తరువాత చిత్రాన్ని డైరెక్టు చేస్తావా అని అడిగారు. అప్పుడు ఒప్పుకున్నాను. ముందుగా ఏదీ నేను ప్లాన్ చేసుకోను.
మంచివాడిగా ఉండాలి
నేను ఓ పెద్ద సెలబ్రిటిని అని ఎప్పుడూ అనుకోను. అది సాధించాలి ఇది సాధించాలి అని ఆశించను. అందరి దగ్గరా మంచివాడిగా అనిపించుకుంటే చాలు. ఇదే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నావాళ్ళకు కూడా ఇదే చెబుతాను.
డాన్స్ అకాడమి
ఓ మంచి డాన్స్ అకాడమి పెట్టాలన్న కోరిక అయితే వుంది. అదొక సరికొత్త లోకం. ఆ లోకంలో ఆలోచనలన్నీ వేరే ఉంటాయి. అది ఎలా చేయాలో త్వరలో ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి అనుకుంటా. బాలీవుడ్‌లో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాను. డిసెంబర్‌నుండి ఆ సినిమా ప్రారంభం కావచ్చు.

-యు