ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వారసత్వం అనే అంశాన్ని నేను పెద్దగా నమ్మను. అది కేవలం మన పరిచయం వరకే ఉపయోగపడుతుంది తప్ప.. మన సక్సెస్‌కు కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ నిలబడగలం’ అని అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల అవుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌తో ఇంటర్వ్యూ...

చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు?
ఇది ఒకటని చెప్పలేం. టెన్షన్, భయం, బాధ ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ను మిక్సీలో వేసి రుబ్బినట్టుంది. ఎందుకంటే ఆరునెలలు కష్టపడి చేసిన సినిమా ఫలితం ఎలా ఉంటుంది. మనం చేసింది జనాలకు నచ్చుతుందా నచ్చదా అనే టెన్షన్ ప్రతి సినిమాకు ఉంటుంది.
హిట్స్, ప్లాప్‌లను ఎలా తీసుకుంటారు?
హిట్స్ వస్తే అలా లేదంటే మరోలా తీసుకుంటానని నేను చెప్పను. ఏదైనా మనం కష్టపడి చేసిందానిపై ఎన్నో నమ్మకాలూ పెట్టుకుంటాం. రిజల్ట్ బాగుంటే ఓకే. లేదంటే.. ఫీల్ అవ్వాల్సి వస్తుంది.
‘జనతాగ్యారేజ్’ ఎలా సెట్ అయింది?
ఈ కథను నేను రెండేళ్లక్రితం విన్నాను. అప్పుడు ‘టెంపర్’ సినిమా మొదలుకాలేదు. ‘టెంపర్’ తరువాతే చేయాలనీ అనుకున్నాను కానీ అప్పటికే దర్శకుడు శివ ‘శ్రీమంతుడు’ సినిమా కమిట్ అవడంతో నాన్నకు ప్రేమతో సినిమా తరువాత చేయాల్సి వచ్చింది.
జనతా గ్యారేజ్ కథ ఏమిటీ?
కథ గురించి చెప్పాలంటే.. ట్రైలర్‌లో చెప్పినట్టు చెట్లు, గాలి, ఆకాశం లాంటి నేచర్ అంటే ఇష్టపడే ఓ వ్యక్తికి.. ఈ భూమిమీదున్న మనుషులంటే ఇష్టపడే వ్యక్తుల మధ్య కథ ఇది. వారిద్దరూ ఎలా కలుస్తారు. కలిసిన తరువాత ఏంచేస్తారనేది సినిమా. చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో నా పాత్ర పేరు... ఆనంద్.
ఇంతకీ ఎవరిని రిపేర్ చేస్తారు?
ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును. మిక్సీనుండి.. మనిషి వరకు, జనతా గ్యారేజ్ ముఖ్యంగా మనుషులకు సంబంధించింది. సినిమా చూస్తే మీకే తెలుస్తుందిగా.
మోహన్‌లాల్‌తో పనిచేయడం ఎలా ఉంది?
ఈ కథ చెప్పినప్పుడే శివ ఇందులో మీతోపాటు మరో పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.. ఆ పాత్రకు మోహన్‌లాల్ అయితే బాగుంటుందని అన్నారు. నాకు కూడా బెస్ట్ ఛాయిస్ అనిపించింది. నిజంగా ఆయన గొప్ప నటుడు. అంతకుమించి మంచి హ్యూమన్ బీయింగ్.
నటనలో ఆయనతో పోటీపడ్డారా?
ఇక్కడ ఎవరితో పోటీపడి నటించే అవకాశమేలేదు. ఎందుకంటే.. ఒక పాత్రకు చాలా స్కోప్ ఉంది. ఓ పాత్రకు తక్కువ స్పేస్ ఉందనే అవకాశమే లేదు. ఆయా పాత్రలు ఉన్నంతలో.. అద్భుతంగా ఉంటాయి. ఎవరి పాత్రలు వారివే. ఆ పాత్రలను తగ్గ న్యాయంచేస్తే సరిపోతుంది. అయినా మోహన్‌లాల్ గారితో పోటీపడి నటించాలని ఎవరు అనుకుంటారు.. ఆయన గొప్ప నటుడు.
నేచర్‌తోపాటు ఇద్దరు హీరోయిన్స్‌ని ప్రేమించినట్టున్నారు?
ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు కానీ. ఇద్దరితో ప్రేమ ఉండదు. ఇద్దరూ మంచి టాలెంటెడ్ నటీమణులు. నిత్యామీనన్ టాలెంట్ గురించి అందరికీ తెలుసు. ఇక సమంత వరుస సినిమాలతో ఇప్పటికే మంచి ఇమేజ్ తెచ్చుకుంది.
ఈమధ్య మీలో చాలా మార్పు వచ్చింది, కారణం?
మార్పు అనేది సహజం, మార్పు జరిగితేనే మంచిది. ఈ మార్పు ఎందువల్ల వచ్చిందో తెలియదు. నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు ‘స్టూడెంట్ నెంబర్ 1’ విజయం వచ్చింది. ఆ తరువాత 20 ఏళ్లకు ‘సింహాద్రి’ పెద్ద విజయం.. ఆ టీన్‌ఏజ్‌లో అంతటి విజయం వస్తే ఎలా ఉంటుంది. మనలో మార్పురావాలని. ఇక మా అబ్బాయి వచ్చిన తరువాత నాలో చాలా మార్పు కనిపిస్తుందేమో అనుకుంటా.
వారసత్వం నమ్మనని ఇటీవలే అన్నారు.. ఎందుకు?
ఎవరికైనా వారసత్వం అనేది.. ఎంట్రీగానే ఉపయోగపడుతుంది తప్ప మన విజయానికి కాదు. వారసత్వం అనేది ఎంట్రీకార్డు లాంటిది.. ఆ తరువాత మనల్నిమనం ప్రూవ్ చేసుకుంటేనే లైఫ్ ఉంటుంది.
నటుడుగా భిన్నమైన పాత్రలు చేయడానికి సిద్ధమేనా?
తప్పకుండా, నేను ఇప్పుడు చేస్తున్నవి కూడా భిన్నమైన పాత్రలే.. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్’, భిన్నమైన పాత్రలు చేయాలనీ నాకు ఉంటుంది. అలాంటి అవకాశంవస్తే తప్పకుండా చేస్తా. చాలామంది స్టార్స్ ఓ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారు. నువ్వు ఈ స్టార్, ఆయన ఫలానా స్టార్ అంటూ ఇమేజ్‌ని ఇరికించారు. నావరకైతే అలాంటివి పక్కనపెట్టి మనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లడమే.
వేరే హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా?
ఏ హీరోతో అయినా నేను మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నా, తప్పకుండా మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తా.
నెక్స్ట్ వక్కంతం వంశీ సినిమా ఉంటుందా?
వంశీతో సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది. జనతాగ్యారేజ్ తరువాత కాస్త రిలాక్స్ అవుతా. ఆ తరువాత వంశీ సినిమా ఉండొచ్చు.

కుటుంబమే ముఖ్యం
ఈమధ్య ఫాన్స్‌లో జరిగిన గొడవ,
ఆ పరిణామాల గురించి మీ కామెంట్?
అభిమానులెవరు హద్దులు దాటుతారని భావించడం లేదు. అభిమానం అంటే ముందు దేశం.. ఆ తరువాత కన్నవాళ్లు, భార్య పిల్లలు, ఆ తరువాత శ్రేయోభిలాషులు.. ఆ తరువాత అభిమాన నటుడి గురించి ఆలోచించాలి. హీరోలపై మితిమీరిన అభిమానం వద్దు. హీరోలం అందరం ఐక్యంగానే ఉంటాం.. మామధ్య ఎలాంటి గొడవలు లేవు.. మరి ఈ గొడవలు అభిమానుల మధ్య ఎందుకు? మితిమీరి ఇలా ప్రవర్తిస్తారని అనుకోను. అభిమానం ఉంచండి అంతే కానీ ఇలా దాడులు వద్దు, నా అభిమానులు ఎవరు ఇలా మితిమీరి ప్రవర్తిస్తారని అనుకోను.. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే.. అలాంటివారు నా అభిమానులుగా ఉండొద్దు.

బయోపిక్ అంటే భయం
బయోపిక్‌లలో నటిస్తారా?
నటించాల్సి వస్తే ఎవరిది చేస్తారు?
నాకు బయోపిక్ సినిమాలంటే కాస్త భయమే. అలాంటివి నేను చేయాలనుకోను. బయోపిక్ అనగానే తాతగారిది చెయ్యొచ్చు. అది మేమైనా, వేరే ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన తెలుగువారి ఆస్థి కాబట్టి, కానీ ఆయన బయోపిక్‌లో మాత్రం నేను నటించను. ఇప్పుడు కాదు మరో పదేళ్లకు తీసినా కూడా ఆయన పాత్ర చేయను. ఎందుకంటే నేను ఆయన పాత్ర చేయాలంటే నాకు భయమే.

- శ్రీ