బిజినెస్

బీపీసీఎల్ ప్రైవేటీకరణకు కేంద్రం శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో తనకు ఉన్న 52.98 శాతం వాటాలను అమ్మకానికి పెట్టింది. బిడ్స్‌ను శనివారం ఆహ్వానించడం ద్వారా మోదీ సర్కారు భారీ అంకానికి తెరతీసింది. గతంలో ప్రభుత్వ రంగ సంస్తల నుంచి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణగానీ, ప్రైవేటీకరణగానీ జరగలేదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) సిద్ధం చేసిన నియమనిబంధన పత్రాల ఆధారంగా, ఆసక్తిగల పార్టీ బిడ్స్‌ను మే 2వ తేదీలోగా దాఖలు చేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బీపీసీఎల్‌లో కేంద్రానికి 52.98 శాతం (1,14,91,000) ఈక్విటీ వాటాలు ఉన్నాయి. బిడ్స్‌ను పరిశీలించిన తర్వాత, అర్హత పొందిన పార్టీలకు ఈ వాటాలను అమ్మడం ద్వారా నిర్వాహణ, అధికార బాధ్యతలను అప్పచెప్పనున్నట్టు ఆ ప్రకటనలో వివరించింది. అయితే, నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఎల్)లో బీపీసీఎల్‌కు ఉన్న 61.65 శాతం వాటాలను అమ్మకానికి ఉంచలేదని కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ వాటాలను ప్రభుత్వ రంగానికి చెందిన ఏదైనా చమురు, సహజవాయు కంపెనీకి అమ్మనున్నట్టు తెలిపింది. ఇలావుంటే, బీపీసీఎల్ బిడ్డింగ్ వ్యవహారం రెండు దశల్లో జరుగుతుంది. మొదట అర్హత పొందిన బిడ్డర్ల ఆసక్తికి సంబంధించిన ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఎల్) తీసుకుంటారు. అనంతరం, రెండో దశలో బిడ్ మొత్తాలను కోట్ చేయాల్సిందిగా ఆయా వ్యక్తులు లేదా సంస్థలను ఆహ్వానిస్తారు. ఈ ప్రైవేటీకరణలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ)లు ఏవీ బిడ్స్ వేయడానికి వీల్లేదు. కనీసం 10 బిలియన్ డాలర్ల విలువ గల ఏదైనా కంపెనీ బిడ్స్ వేయడానికి అర్హత కలిగి ఉంటుంది. అదే విధంగా, కొన్ని కంపెనీలు కలిపి కన్సార్టియంగా ఏర్పడితే, అందులో నాలుగు కంటే ఎక్కువ కంపెనీలు ఉండడానికి వీల్లేదు. ఇంధన పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నది. దేశీయ మార్కెట్‌లో బీపీసీఎల్‌కు 14 శాతం వాటా ఉంది. బిడ్ గెల్చుకున్న కంపెనీ లేదా కన్సార్టియానికి ఈ మార్కెట్ దక్కుతుంది. అంతేగాక, భారత్ చమురు రిఫైనరీ రంగంలో బీపీసీఎల్‌కు ఉన్న 25 శాతం వాటా కూడా హస్తగతం అవుతుంది. ప్రస్తుతం బీపీసీఎల్ మార్కెట్ విలువను 87,388 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా సుమారు 46,000 కోట్ల రూపాయలు. ఆసక్తిగల పార్టీలు బిడ్‌లో పేర్కొన్న ధరకే, మరో 26 శాతం వాటాలను తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సుమారు 2.1 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అతిపెద్ద స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణను బీపీసీఎల్‌లో వాటాల అమ్మకానికి బిడ్స్‌ను ఆహ్వానించడం ద్వారా మొదలు పెట్టింది. ఈ కంపెనీకి మొత్తం నాలుగు, ముంబయి (మహారాష్ట్ర), కొచ్చి (కేరళ), బినా (మధ్యప్రదేశ్), నుమాలీగఢ్ (అస్సాం)లో రిఫైనరీలు ఉన్నాయి. ఈ నాలుగు యూనిట్లలో సంవత్సరానికి 38.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుంది. దేశ మొత్తంలో రిఫైనరీల ఉత్పత్తి ఏటా 249.40 మిలియన్ టన్నులుకాగా, అందులో 15 శాతం వాటాను బీపీసీఎల్ దక్కించుకోవడం విశేషం. ఈ నాలుగు రిఫైనరీల్లో నుమాలీగఢ్‌ను మినహాయించి, మిగతా మూడింటిని సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌కు అప్పగిస్తారు. అంటే, కొత్త కొనుగోలుదారులు 35.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే రిఫైనరీలకు యజమానులవుతారు. కాగా, బీపీసీఎల్‌కు దేశ వ్యాప్తంగా 15,177 పెట్రోలు పంపులు, 6,011 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలు ఉన్నాయి. అంతేగాక, 51 ఎల్‌పీజీ (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో బీపీసీఎల్ 21 శాతం వాటాను సంపాదించింది. దేశ వ్యాప్తంగా 250 ఏవియేషన్ ఫ్యుయల్ స్టేషన్లు బీపీసీఎల్ ఆధీనంలో ఉన్నాయి.