బిజినెస్

ఆంధ్రా లక్ష్యం.. 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ముగింపు నాటికి రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది కూడా.
సాగు విస్తీర్ణం పెంచడం, సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆధునిక యంత్ర పరికరాలు రైతులకు అందజేయడం, మేలైన యాజమాన్య పద్ధతులు అనుసరించేలా శిక్షణ ఇవ్వడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దిగుబడి గణనీయంగా పెంచవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ మేరకు అవసరమైన నిధులు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 80 లక్షల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో పంటల సాగు జరుగుతోంది. ఈ విస్తీర్ణాన్ని ఇప్పుడు కోటి హెక్టార్లకు పెంచేలా చర్యలు తీసుకుంటోంది వ్యవసాయ శాఖ. ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 28 రకాల పంటలు సాగు చేస్తారు మన రైతులు. ఈ ఏడాది 22 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా, దాదాపు 15 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు, వేరుశనగ ఎనిమిది లక్షల హెక్టార్లు, పత్తి ఏడు లక్షల హెక్టార్లు, మొక్కజొన్న రెండున్నర లక్షల హెక్టార్లు, చెరకు ఒకటిన్నర లక్షల హెక్టార్లు, పొగాకు లక్ష హెక్టార్లలోనూ సాగు చేస్తున్నారు. వీటిలో 62 శాతం ఖరీఫ్ పంటలవగా, 38 శాతం రబీ పంటలుగా ఉండబోతున్నాయి.
మరోవైపు వచ్చే ఏడాది నాటికి వరితోపాటు, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల మేరకు వచ్చే ఏడాది నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 32 శాతం పెరుగుదల సాధించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో వరి ఉత్పత్తి లక్ష్యం 28 శాతం అవగా, మొక్కజొన్నలో 48 శాతం, అపరాలలో 37 శాతం, నూనె గింజల ఉత్పత్తిలో 29 శాతం వృద్ధి సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.
సంప్రదాయ పద్ధతులతోపాటు, మిశ్రమ పంటల విధానం ద్వారా కూడా దిగుబడి పెంచుకునేలా రైతుల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిర్ణీత విస్తీర్ణంలోనే రెండు లేదా అంతకు మించి పంటలను ఒకే కాలంలో పండించే విధానమే మిశ్రమ పంటల విధానం. వర్షాభావ పరిస్థితులు కావొచ్చు.. లేదా మరే సమస్య వల్లనైనా... ఒక పంట పోతే.. మరో పంటనైనా పొందేలా.. ఈ మిశ్రమ పంటల విధానం రైతులకు ప్రయోజనకారిగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన. తృణధాన్యాలు, పప్పు దినుసుల పంటలు ఈ మిశ్రమ వ్యవసాయ విధానానికి అనుకూలంగా ఉంటాయి.
గోరుచిక్కుడు, బెండ, గోంగూర తదితర పంటలతో మిశ్రమ వ్యవసాయ విధానంలో రైతులు లాభాలు పొందొచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలని కూడా నిర్ణయించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో దాదాపు లక్ష ఎకరాల్లో మిశ్రమ పంటలు వేయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటి ఫలితాలు బాగుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న అధికారులు.. రాబోయే సంవత్సరాల్లో రైతులు మరింతగా మిశ్రమ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తారన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు.