బిజినెస్

వెరిజోన్ సొంతమైన యాహూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 25: యాహూ ఆపరేటింగ్ వ్యాపారాన్ని వెరిజోన్ కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. సుమారు 4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం ఇక్కడ కుదిరింది. నిన్నటి తరం వెబ్ యూజర్ల ఇంటర్నెట్ ప్రవేశానికి ప్రధాన ద్వారంగా వెలిగిన యాహూ.. గూగుల్, ఫేస్‌బుక్ తదితర నేటి తరం ఇంటర్నెట్ దిగ్గజాల ముందు చతికిలపడింది. ఈ క్రమంలోనే ఇక ఇంటర్నెట్ రంగంలో కొనసాగలేమన్న నిర్ణయానికి వచ్చిన యాహూ అమ్మకానికి సిద్ధపడగా, అమెరికా టెలికామ్ దిగ్గజమైన వెరిజోన్ చేజిక్కించుకుంది. అయితే యాహూ క్యాష్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌లోని దాని షేర్లు, యాహూ జపాన్‌లోని దాని షేర్లు, యాహూ కన్వర్టబుల్ నోట్స్, కొన్ని మైనారిటీ పెట్టుబడులు, యాహూ నాన్-కోర్ పేటెంట్స్ ఈ కొనుగోలు ఒప్పందం పరిధిలోకి రావు. ఇవన్నీ కూడా ఇకపైనా యాహూ నిర్వహణలోనే ఉంటాయి. ఈ మేరకు ఓ ప్రకటన స్పష్టం చేసింది.
కాగా, వెరిజోన్‌తో జరిగిన ఒప్పందానికి యాహూ భాగస్వాముల నుంచి రెగ్యులేటరీ, ఇతరత్రా అధికార విభాగాల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికల్లా (2017 మార్చి నాటికి) ఈ వ్యవహారం పూర్తవుతుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. అప్పటిదాకా యాహూ స్వతంత్రంగానే నిర్వహించబడుతుంది. యూజర్లకు, ప్రకటనకర్తలకు, భాగస్వాములకు, డెవలపర్లకు సేవలను యాహూ అందిస్తుంది. ‘ఏడాది క్రితం అడ్వర్టైజర్లు, క్రియేటర్లు, కన్జ్యూమర్లకు క్రాస్ స్క్రీన్ కనెక్షన్ అందించడం కోసం ఎఒఎల్‌ను కొనుగోలు చేశాం. ఇప్పుడు యాహూ కొనుగోలుతో ఎఒఎల్‌కు కలిసిరానుంది. అంతేగాక ప్రపంచంలోనే ఓ అత్యున్నత మొబైల్ మీడియా సంస్థగా ఎదగడానికి అవకాశముంది. డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో మా ఆదాయం కూడా గణనీయంగా పుంజుకుంటుందని భావిస్తున్నాం.’ అని వెరిజోన్ చైర్మన్, సిఇఒ లోవెల్ మెక్‌ఆడమ్ అన్నారు. 1994లో స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు జెర్రి యాంగ్, డేవిడ్ ఫిలో కలిసి యాహూను స్థాపించారు. చివరిదాకా స్వతంత్రంగా నడిచిన వెబ్ సంస్థల్లో యాహూ కూడా ఒకటి. ఈ-మెయిల్, షాపింగ్, న్యూస్ ఇలా అన్ని రకాల సేవలను నెటిజన్లను యాహూ అలరించింది. అయితే గూగుల్, ఫేస్‌బుక్ రాకతో యాహూ ప్రాభవం తగ్గింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం యాహూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మరిస్సా మేయర్ కూడా సంస్థకు పూర్వ వైభవాన్ని తేలేకపోయారు.
యాహూతోనే ఉంటా: మరిస్సా మేయర్
యాహూను వెరిజోన్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో యాహూ సిఇఒ మరిస్సా మేయర్ తాను ఇకపై కూడా యాహూలోనే కొనసాగుతానని అన్నారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో తన భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, తాను మాత్రం యాహూతోనే ఉంటానని తన మనసులో మాట బయటపెట్టారు మేయర్. ‘వ్యక్తిగతంగానైతే నేను యాహూతోనే ఉండాలనుకుంటున్నాను. యాహూలో పనిచేయడాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను.’ అని ఉద్యోగులకు రాసిన ఓ లేఖలో ఆమె పేర్కొన్నారు.