బిజినెస్

ఐడిఎస్ చెల్లింపుల గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: స్వచ్చంధ నల్లధన వివరాల వెల్లడి పథకంలో భాగంగా పన్నులు, జరిమానాల చెల్లింపుల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మూడు విడతల్లో ఈ చెల్లింపులను చేసుకోవచ్చని గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. మొత్తం పన్ను, సర్‌చార్జీ, జరిమానాల్లో 25 శాతం ఈ ఏడాది నవంబర్ 30లోగా చెల్లించాలని, మరో 25 శాతం వచ్చే ఏడాది మార్చి 31లోగా ఇవ్వాలని చెల్లించాలన్న ఆర్థిక శాఖ.. మిగతా 50 శాతం 2017 సెప్టెంబర్ 30లోగా ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. అక్రమ సంపాదనను సక్రమమైనదిగా మార్చుకునేందుకు ఆదాయ ప్రకటన పథకాన్ని (ఐడిఎస్) మోదీ సర్కారు ప్రవేశపెట్టినది తెలిసిందే. దేశంలోని నల్లధనాన్ని వెలికితీయడంలో భాగంగా స్వచ్చంధంగా తమ ఆదాయ పనే్నతర సొమ్మును ప్రకటిస్తే, అందులో 45 శాతం సొమ్మును పన్ను, సర్‌చార్జీ, జరిమానా రూపంలో చెల్లించడం ద్వారా దాన్ని సక్రమ సంపాదనగా మార్చుకునే అవకాశాన్ని ఈ పథకం కల్పించింది. ఉదాహరణకు కోటి రూపాయల నల్లధనం తన వద్ద ఉందని ప్రకటించిన వ్యక్తి వద్ద నుంచి 30 లక్షల రూపాయలను పన్నుగా, 7.5 లక్షల రూపాయలను సర్‌చార్జీగా, మరో 7.5 లక్షల రూపాయలను జరిమానాగా మొత్తం 45 లక్షల రూపాయలను సర్కారు వసూలు చేస్తుందన్నమాట. దీంతో మిగతా 55 లక్షల రూపాయల సొమ్ము నీతివంతమైన సంపాదనగానే పరిగణించబడుతుంది. తద్వారా విచారణలు, జైలుశిక్షలు తప్పించుకోవచ్చని అక్రమార్జనపరులకు హితవు పలికింది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, తమ అక్రమ సంపాదనను ప్రకటించకపోతే తర్వాత తీవ్ర ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించింది. జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం నాలుగు నెలలపాటు (ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు) ఉంటుందని తొలుత ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు పన్ను, సర్‌చార్జీ, జరిమానా చెల్లింపులను మూడు విడతలుగా చెల్లించే అవకాశాన్ని ఇచ్చింది. అదికూడా గడువు పెంచడం గమనార్హం. ఇంతకుముందు సెప్టెంబర్ 30 వరకు ప్రకటించిన నల్లధనం వివరాలకు సంబంధించి పన్ను, సర్‌చార్జీ, జరిమానాలను ఈ ఏడాది నవంబర్ 30 వరకే చెల్లించాల్సి ఉండేది. అయితే రెండు నెలల సమయం నుంచి ఏడాది వరకు పొడిగించారు.
ఇదిలావుంటే నల్లధనం వివరాలను ప్రకటించినవారు తమ అప్రకటిత ఆదాయం నుంచి పన్ను, జరిమానాలను చెల్లించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఐడిఎస్‌పై నెలకొన్న అనుమానాల నివృత్తిలో భాగంగా నాలుగో దశలో వివిధ సందేహాలకు ఆదాయ పన్ను శాఖ బదులిచ్చింది.

చిత్రం.. గురువారం ఢిల్లీలో ఐడిఎస్, పసిడి నగదీకరణ పథకంపై ఫిక్కీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో జైట్లీ