బిజినెస్

ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: కృష్ణా, నాగార్జునసాగర్, ఇతర ఆయకట్టులకు రానురాను సాగునీటి సమస్య జటిలంగా మారుతుండటంతో బోర్లపై ఆధారపడ్డ రైతాంగం క్రమేణా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారిస్తున్నది. నేడు ఎక్కువగా వినియోగిస్తున్న వంట నూనెల్లో పామాయిల్ ఒకటి. పేదల ఆయిల్‌గా కూడా పామాయిల్‌కు పేరుంది. దీన్ని పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుండడంతో పామాయిల్‌కు ఆ పేరు వచ్చింది. నిజానికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 20 ఏళ్ల కిందటే దేశంలో ఆయిల్‌పామ్ పెంపకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం దేశ జనాభా 120 కోట్ల పైమాటే. ఏడాదికి ఒక మనిషి 18 కేజీలు వినియోగిస్తే, 200 లక్షల టన్నులకు పైబడి వంట నూనె అవసరమవుతుంది. ప్రస్తుతానికి దేశంలో ఉత్పత్తవుతున్న వంటనూనె చాలకపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మలేసియా, ఇండోనేషియాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్‌ను రిఫైండ్ ఆయిల్‌గా తయారుచేసే రిఫైనరీలు కాకినాడ, కృష్ణపట్నం వద్ద ఉన్నాయి. ఆయిల్‌పామ్ చెట్టు కొబ్బరి చెట్టును పోలి ఉంటుంది. దేశీయ రకం చెట్టు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సంకరజాతి చెట్టు 4 నుంచి 5 మీటర్ల ఎత్తుకే ఎదుగుతుంది. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పండిన పళ్లను కోయడం సులభంగా ఉంటుంది. ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి ఏడాదికి 1,800- 2,000 మి.మీ. వర్షపాతం ఉండే ప్రాంతాలు అనుకూలం. సంవత్సరం మొత్తం అడపాదడపా వర్షం పడుతుంటే చాలా మంచిది. నీటిని పీల్చుకుని, నిల్వ ఉంచుకునే స్వభావం ఉన్న తేలికపాటి వ్యవసాయ భూము లు సాగుకు అనుకూలం. నీటి సదుపాయం గల గరప, ఎర్రమట్టి, నల్లరేగడి భూములు కూడా సాగుకు అనుకూలమే. మొక్కపాదులో నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు. నేల సమతులంగా ఉండాలి. మొక్కపాదులో 3 అడుగుల లోతు వరకు గ్రావెల్, రాళ్లు ఉండకుండా చూసుకోవాలి. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నీటి సదుపాయం ద్వారా తోటల పెంపకం చేపట్టవచ్చు. బిందు సేద్యంతో 20 శాతం నీటిని ఆదా చేయవచ్చు. మిగతా పంటలతో పోల్చిచూస్తే ఆయిల్‌పామ్‌కు చీడ, పీడల దాడి తక్కువే. మొక్క ఏడాదికి అడుగు నుంచి రెండడుగులు పెరుగుతుంది. కోతకు సిద్ధమైన పండ్లను గుర్తించి, దెబ్బ తగలకుండా కొయ్యాలి. ఆయిల్‌పామ్ చెట్ల నుంచి పండిన గెలలను అనుభవమున్న వారితోనే కోయించాలి. ప్రత్యేక పనిముట్లను వినియోగించాలి. కోసిన తాజా పండ్ల గెలలను వీలైనంత త్వరగా ఆయిల్ మిల్లుకు చేర్చాలి.
ఏటా రూ. 40 వేల కోట్ల పామాయిల్ కొనుగోలు
దేశ వంటనూనెల అవసరాల్లో ప్రధానంగా పామాయిల్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ఏటా దేశ అవసరాలకు సరిపడా కోటి మెట్రిక్ టన్నుల పామాయిల్ కొనుగోలు చేసేందుకు మనం రూ. 40 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి వాడుతున్న పామాయిల్ మొత్తం గమనిస్తే దేశంలో అతి తక్కువగా 14.10 కేజీలే వాడుతున్నారు. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌లో 22 కిలోలు, చైనాలో 22.10 కిలోలు వాడుతున్నట్టు సాల్వెంట్ ఎక్స్‌టార్షన్ అసోసియేషన్ సర్వేలో వెల్లడైంది. దేశ అవసరాలకు సరిపడా పామాయిల్ ఇక్కడే ఉత్పత్తి చేయాలంటే దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాల్సి ఉంటుందని ఆయిల్ ఫెడ్ అధికారులు తెలిపారు. మిగతా ఆయిల్ గింజల దిగుబడితో పోల్చితే పామాయిల్ దిగుబడి అధికం. హెక్టారుకు 3.5 టన్నుల పామాయిల్ గెలలు దిగుబడి రాగా, మిగిలిన నూనె గింజలు హెక్టారుకు 0.8-2 టన్నులు దిగుబడి మాత్రమే వస్తాయ. సోయాబీన్ మాత్రం హెక్టారుకు 2 నుంచి 2.25 టన్నులు దిగుబడి వస్తుంది. పామాయిల్ ఎకరానికి 10 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. మిగిలిన నూనె గింజలు ఏక వార్షిక కాలమైతే, పామాయిల్ బహు వార్షికం. కనీసం 25 నుంచి 30 ఏళ్ల వరకూ దిగుబడి వస్తూనే ఉంటుంది.
అంతర పంటలతోనూ అధిక లాభాలు
ఆయిల్‌పామ్ దీర్ఘకాలపు పంట. మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి దిగుబడి వస్తుంది. గెలలు రావడం ప్రారంభమైతే దాదాపు 25-30 నెలల వరకు పంట తీసుకోవచ్చు. ఆయిల్‌పామ్ సాగులో మొదటి మూడేళ్లు అంతర పంటలుగా పొగాకు, మొక్కజొన్న, అరటి, వేరుశనగ వంటివి వేసుకోవచ్చు. నాలుగో ఏడాది నుంచి పామాయిల్ గెలల ఉత్పత్తి మొదలై ఆదాయం సమకూరుతుంది. మొక్కలు ఎదిగిన తర్వాత ఏడేళ్ల నుంచి మొక్కల మధ్యలో కోకో పంటను, అలాగే మిరియం లాంటి సుగంధ ద్రవ్యాలు, పిప్పళ్లు వంటి ఔషధ పంటలతోనూ ఆదాయం పొందవచ్చు.
సాగు విస్తీర్ణం పెంపునకు ఐసిఎఆర్ కృషి
భారతదేశంలో పామాయిల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్ (ఐసిఎఆర్) కృషి చేస్తోంది. ఈ రిసెర్చ్ సెంటర్‌లో ఆయిల్‌పామ్ సాగుపై పరిశోధనలు చేస్తుంటారు. ఐసిఎఆర్-ఐఐఓపిఆర్ వార్షిక శిక్షణ ప్రణాళిక 2016-17 ప్రకారం ఆయిల్‌పామ్ సాగు మరింత పెంచే లక్ష్యంగా ఇక్కడి శాస్తవ్రేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. దేశంలో ఆయిల్‌పామ్ పరిశోధనకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ప్రజావసరాలకు తగిన విధంగా వంటనూనె ఉత్పత్తులు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకోసం ఎంఎం-1, ఎంఎం-2 ఆయిల్‌పామ్ పథకం, ఎన్‌ఓఓపి పథకాలను ప్రారంభించాయి. ఎంఎం-2 కింద రాష్ట్రంలో పామాయిల్ దిగుబడులు పెంచడానికి ఉద్యానవన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. రైతుల్లో పామాయిల్ తోటల పెంపకంపై అవగాహన పెంచుతూ, బీడు భూములను సైతం సాగులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం 2016-17 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ మినీ మిషన్ కోసం రూ. 55 కోట్లు, సాగులో ప్రోత్సాహకాల కోసం రూ. 51 కోట్లు కేటాయించింది.