బిజినెస్

జిఎంఆర్ గ్రూపు చైర్మన్ జిఎం రావుకు ఏబిఎల్‌ఎఫ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: జిఎంఆర్ గ్రూపు చైర్మన్ జిఎం రావుకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో ఏబిఎల్‌ఎఫ్ జీవిత సాఫల్య అవార్డును ఆసియా బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం ప్రకటించింది. వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య నాయకత్వ వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన జిఎంఆర్ గ్రూపు చైర్మన్ జిఎం రావుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు మంగళవారం తెలిపింది. ఈ సందర్భంగా జిఎం రావు మాట్లాడుతూ తాను ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యున్నతమైన ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి వౌలిక సదుపాయాలతో నిర్మించామన్నారు. హైదరాబాద్‌లో తొలిసారిగా పిపిపి మోడ్‌లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించామన్నారు. ప్రపంచంలోని విమానాశ్రయాల్లో ఈ రెండు విమానాశ్రయాలు ఉన్నత స్ధానంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఒక చిన్న జ్యూట్ మిల్లుతో జీవన యానాన్ని ప్రారంభించిన జిఎం రావు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు నిరంతర శ్రమ, దార్శనికత, టెక్నాలజీ అనుసంధానం, కార్యదీక్ష కారణమని ఆసియాన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం కొనియాడింది.

వినోదం పన్ను వసూళ్ళ విధానంలో
మార్పుల దిశగా తెలంగాణ వాణిజ్య శాఖ

హైదరాబాద్, డిసెంబర్ 1: సినిమా టిక్కెట్ల విక్రయం ద్వారా వినోదపు పన్నును వసూలు చేసే విధానంలో మార్పులు తేవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వాణిజ్య శాఖ, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థను, ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయంతో కంప్యూటీకరణ ద్వారా అనుసంధానం చేసి నేరుగా వినోదపు పన్నును ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యే విధంగా చేయాలనే ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తోంది. తగిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, సినిమా పరిశ్రమల పెద్దలు, ఎగ్జిబిటర్లతో మాట్లాడి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల విక్రయంతో వాణిజ్య శాఖను సాఫ్ట్‌వేర్ ద్వారా అనుసంధానం చేసే ప్రక్రియ తుది దశకు కూడా చేరుకుంది. ప్రస్తుతం తమకు వచ్చే మొత్తం రెవెన్యూ వివరాలను వెల్లడించి పన్నును సినిమా థియేటర్ల యాజమాన్యం చెల్లిస్తోంది. అయతే పన్నును ఎగ్గొట్టేందుకు ఏ మేరకు రెవెన్యూ వచ్చిందో ధియేటర్ల యజమానులు వెల్లడించరని వాణిజ్య శాఖ చెబుతోంది. కొత్త పద్ధతి ప్రకారం అమ్ముడైన టిక్కెట్లు లేదా నెలకు ఆక్యుపెన్షీ రేటులో ఒక అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వినోదపు పన్ను విధానాన్ని రూపొందించేందుకు వాణిజ్య శాఖ కసరత్తును ప్రారంభించింది. కాగా, ఇటీవల సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు వినోదపు పన్ను విధింపులో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చిన పన్ను సొమ్ములో రెండు శాతం మొత్తాన్ని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు వదిలిపెట్టేసి, సినిమా రంగం అభివృద్ధికి వెచ్చించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం చేయనుంది. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో మొదటి పది నెలల కాలానికి వినోదపు పన్ను దాదాపు 74 కోట్ల రూపాయలు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 550 థియేటర్లున్నాయ. రాష్ట్ర జిఎస్‌డిపిలో తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ వాటా ఒక శాతం పైగా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల విక్రయం ద్వారా వినోదపు పన్నును రాబట్టుకునే విధానంపై సినిమా పరిశ్రమతో చర్చించి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేయనుంది.

మేక్ ఇన్ తెలంగాణ తొలి ట్యాబ్లెట్‌ను
విడుదల చేసిన కెటిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 1: సెల్‌కాన్ సంస్థ తయారు చేసిన తొలి మేక్ ఇన్ తెలంగాణ ట్యాబ్లెట్‌ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో సెల్‌కాన్ సంస్థ పది లక్షల ఫోన్లు తయారు చేయడం అభినందనీయమని కెటిఆర్ అన్నారు. మొబైల్ ఫోన్ల పరిశ్రమకు హైదరాబాద్‌లో మంచి అవకాశాలున్నాయని, ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. సెల్‌కాన్ హైదరాబాద్‌లో మొబైల్ రిసెర్చ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కాగా, తెలంగాణలో మొబైల్ ఫోన్ల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు మొబైల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. పలు ప్రముఖ మొబైల్ తయారీ దారులు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించారన్నారు. సెల్‌కాన్‌తో పాటు మైక్రోమాక్స్ సంస్థల ప్లాంట్లలో కార్యకలాపాలు ప్రారంభమైనట్టు చెప్పారు. అనేక రకాల పరిశ్రమలు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతున్నందున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూడా పెరుగుతాయన్న కెటిఆర్ ఇటీవల 28 కోట్ల రూపాయలకు ఎకరం ధర పలికినది గుర్తుచేశారు.

స్వల్ప లాభాల్లో
దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబయి, డిసెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 23.74 పాయింట్లు పెరిగి 26,169.41 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.65 పాయింట్లు కోలుకుని 7,954.90 వద్ద స్థిరపడింది. సోమవారం సెనె్సక్స్ స్వల్పంగా లాభపడితే, నిఫ్టీ అదే స్థాయిలో నష్టపోయినది తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్‌లోనూ మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ళ మధ్య ఊగిసలాడారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండటంతో మదుపరులు పెట్టుబడులపట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు. కాగా, ఆయా రంగాలవారీగా మెటల్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి, పిఎస్‌యు షేర్లు 3.18 శాతం నుంచి 0.97 శాతం మేర లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చిందని నిపుణులు విశే్లషిస్తున్నారు. కాగా, బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.78 శాతం, స్మాల్ క్యాప్ 0.46 శాతం చొప్పున లాభపడ్డాయ.

‘ప్రజలకు రూ. 2,772 కోట్ల ప్రయోజనం’

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఔషధాల ధరలను తగ్గించడం వల్ల వాటిని వాడుతున్న ప్రజానీకానికి 2,772 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగిందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. క్యాన్సర్, కార్డియోవ్యాస్కులర్ వ్యాధులతోపాటు ఎయిడ్స్/హెచ్‌ఐవి, డయాబెటిస్ తదితర వ్యాధులకు సంబంధించిన ఔషధాల ధరలను తగ్గించామని పేర్కొంది. అయితే ప్రజలు లబ్ధి పొందారంటున్న ఆ 2,772 కోట్ల రూపాయల ప్రయోజనం ఎంత వ్యవధిలో చేకూరిందన్న వివరాలను మాత్రం ప్రభుత్వం తెలియపరచలేదు. నిత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న 680 రకాల మందుల్లో 530 రకాల మందుల ధరలను ఇప్పటికే నియంత్రించామని కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఓ లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.

‘ముద్రా రుణాలు రూ. 42,520 కోట్లు’
ప్రధాన మంత్రి మోదీ ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ముద్రా యోజన పథకంలో భాగంగా 42,520 కోట్ల రూపాయలకుపైగా సాయాన్ని 66 లక్షలకుపైగా ఉన్న రుణగ్రహీతలకు అందించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. చిన్నతరహా సంస్థలకు 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రధాన మంత్రి ముద్రా యోజన క్రింద కేంద్రంలోని మోదీ సర్కారు రుణాలను ఇస్తున్నది తెలిసిందే.