బిజినెస్

అగ్నిగుండంలో ఉత్తరాంధ్ర పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 2: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వివిధ పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయా పరిశ్రమల్లో విపత్తు నివారణా ప్రణాళిక, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కనీస ఏర్పాట్లు లేకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రమాదాలు వాటిల్లినప్పుడు బెంబేలెత్తుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సంసిద్ధతపై పెద్దగా దృష్టి సారించిడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల విశాఖలోని దువ్వాడ ఎస్‌ఇజెడ్‌లోని బయోమాక్స్ ఫ్యూయల్ కంపెనీలో కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తెలిసిందే. కనీస స్థాయిలో భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో అక్కడ మంటలు చెలరేగి దాదాపు నాలుగు రోజుల పాటు ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రాణ నష్టం లేకపోయినా దాదాపు 120 కోట్ల రూపాయల మేరకు నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. విశాఖ జిల్లా సరిహద్దులోని రాజవరంలో ఉన్న రసాయనిక పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ పరిశ్రమకు ఆనుకుని ఉన్న రాజావరం, గజపతినగరం, రాజానగరం, వెంకటనగరం గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయంటూ ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భీమునిపట్నంలోని దివిస్ లేబోరేటరీస్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అలాగే పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రు ఫార్మా సిటీలోనూ గత సెప్టెంబర్‌లో సైనార్ లైఫ్ సైన్సస్ కంపెనీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు గ్లోకెమ్ ఇండ్రస్టీస్, అలివెరా, రాంకీ సంస్థల్లోనూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయ. విశాఖ స్టీల్‌లోనూ మంటలు చేలరేగగా, ఈ ప్రమాదాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అయనా పారిశ్రామిక, అధికార యంత్రాంగాలు చేష్టలుడిగి చూస్తున్నాయ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 1,000 మంది కన్నా ఎక్కువ మంది కార్మికులను కలిగి ఉన్న పరిశ్రమలు 42 ఉన్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల్లో చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే.. 2014, 2015 సంవత్సరాల్లో 50 పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 33 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఔషధ, రసాయనిక పరిశ్రమల్లో 5 ఘోర ప్రమాదాలు కాగా, 10 ఇతర ప్రమాదాలు కావడం గమనార్హం. పరిశ్రమల నిర్వహణలో పారిశ్రామిక భద్రత కూడా కీలకం. ఇక్కడ ఉన్న చాలా ఔషధ కంపెనీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించడం జరుగుతోంది. ఫలితంగా విపత్తు నిర్వహణకు ప్రణాళిక దాదాపు లేదని అర్థమవుతోంది. దువ్వాడలో చోటు చేసుకున్న ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ. బయోడీజల్ మండుతుంటే మంటలను నియంత్రించే పరిస్థితి లేని దుస్థితి నెలకొంది. దాదాపు 100 ఫార్మా యూనిట్లు ఉండగా, కేవలం 10 మాత్రమే సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ఆందోళన చేసినా, రాజకీయ జోక్యంతో ఆ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయడం మినహా ఆయా పరిశ్రమల అలసత్వంపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండటం లేదు. సేఫ్టీ ఆడిట్‌పై ఆదేశాలు జారీ చేసినా రాజకీయ నేతల జోక్యం వల్ల తాము హెచ్చరికలు చేయడం తప్ప చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందని ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయతే స్మార్ట్ సిటీగా, ఐటి హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఈ ప్రమాదాలపై దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించడంతో అక్రమ వ్యవహారాలు వెలుగుచూసే అవకాశం ఉంది. మొత్తానికి ఉత్పత్తి చేస్తున్న వివిధ రసాయనాల వివరాలు, అగ్ని ప్రమాదం జరిగితే దానిని నియంత్రించేందుకు ఎటువంటి రసాయనాలు వాడాల్సి ఉంటుంది, అవి అందుబాటులో ఉన్నా యా? లేదా? వంటి అంశాలపై పారిశ్రామిక, అధికార యంత్రాంగాలు దృష్టి సారించాల్సి ఉంది.

చిత్రం దువ్వాడ ఎస్‌ఇజెడ్‌లోని బయోమాక్స్ ఇంధన సంస్థలో అగ్నికి ఆహుతవుతున్న ట్యాంకర్లు