బిజినెస్

ఆదాయాన్ని వెల్లడిస్తే సమస్యలుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 26: సకాలంలో ఆదాయ పన్నును చెల్లిస్తే ఎటువంటి సమస్యలు ఎదురుకావని, విధిగా ఆదాయ పన్ను చెల్లించాలని విశాఖ ఆదాయ పన్ను కమిషనరేట్-2 ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్ చిదార సూచించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ ద్వారా ఆదాయ వెల్లడి పథకం-2016ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం వైద్యులు, ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఆదాయ వెల్లడి పథకం-2016పై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఓంకారేశ్వర్ చిదార మాట్లాడుతూ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, వైద్య పరీక్షా కేంద్రాలు నిర్వహించే వైద్యులు విధిగా పన్నులు చెల్లించి, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 2016 జూన్ 1నుండి సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ పథకం కింద ఆదాయ వెల్లడికి అవకాశం కల్పించారని, వెల్లడించే ఆదాయంలో 45 శాతం పన్ను చెల్లిస్తే వారిపై ఏ విధమైన విచారణలు, దర్యాప్తులు, తనిఖీలు ఉండవని స్పష్టం చేశారు. విశాఖ జోన్-2 పరిధిలో గత నెల రోజుల్లో ఈ పథకం కింద రూ. 6 కోట్ల ఆదాయం సమకూరిందని, గడువులోగా మరో రూ. 6 కోట్లు లభించే అవకాశం ఉందన్నారు. అలాగే విశాఖ కమీషనరేట్ పరిధిలో నెల రోజుల్లో రూ. 16 కోట్లు వసూలయ్యాయని, మరో రూ. 4 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందన్నారు. పథకం ద్వారా ఏ వ్యక్తి అయినా 2015-16 ఆర్ధిక సంవత్సరం వరకు వెల్లడించని ఆదాయాన్ని ప్రకటించవచ్చని చెప్పారు. అయతే ఏ విధమైన ఖర్చులు, తగ్గింపు, రాయితీలను పథకం కింద కోరే అవకాశం లేదని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులు ఫారం-1ను డిజిటల్ సంతకం కింద ఎలక్ట్రానిక్ రూపంలోగాని, ముద్రణ రూపంలోగాని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని, ఫారం-2లో సదరు కార్యాలయం నుండి రశీదు పొందాలని, ఫారం-3లో పన్ను సర్‌ఛార్జి, పెనాల్టీ చెల్లింపు వివరాలను పొందుపరచాలని సూచించారు. చెల్లింపు వివరాలను తెలియజేసిన 15 రోజుల్లోగా ప్రిన్సిపల్ కమీషనర్ ఫారం-4 ద్వారా స్కీమ్ సర్ట్ఫికెట్ ధ్రువీకరణను అందజేస్తారన్నారు. అసత్య సమాచారం ఇచ్చినా, నిజాలను గోప్యంగా ఉంచినా ఈ స్కీమ్ వర్తించదని గుర్తుచేశారు. ఆదాయ వెల్లడి పథకం-2016 ద్వారా వెల్లడిచేయని ఆదాయాన్ని ప్రకటించని పక్షంలో సంబంధిత ఆస్తి, ప్రకటించని ఆదాయాన్ని ఆయా అసెస్‌మెంట్ సంవత్సరాల్లో వారి ఆదాయంగా పరిగణించి, అసెస్‌మెంట్, పెనాల్టీలను విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన ప్రతి ఆస్తి, ఆదాయ వివరాలు నెలనెలా తమ కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్లు, బ్యాంకుల ద్వారా వెల్లడవుతాయన్నారు. పన్నులు చెల్లించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులపై దాడులు, సోదాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా, విదేశాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి ఇక్కడ పన్ను వసూలు చేసే అవకాశం ఉండదని, స్వదేశంలో ఉన్న ఆస్తులు, ఆదాయానికి సంబంధించి మాత్రమే వసూళ్లు చేస్తామన్నారు. క్రిమినల్ చరిత్ర, అవినీతి సొమ్ము కలిగిన వారు, మాదకద్రవ్యాల సరఫరాలో కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుండి ఈ పథకంలో పన్ను కట్టించుకునే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ‘పన్ను చెల్లించండి.. ఆనందంగా వెళ్ళండి’ నినాదంతో పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఓంకారేశ్వర్ చిదార పేర్కొన్నారు. సమావేశంలో ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ ఎస్ రవిశంకర్ నారాయణ్, సహాయ కమిషనర్ సివిఎ రామారావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రామ్‌స్వరూప్ జవహర్ తదితరులు పాల్గొన్నారు.