బిజినెస్

రింగింగ్ బెల్స్‌పై ఎక్సైజ్, ఐటి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎక్సైజ్, ఆదాయ పన్ను (ఐటి) శాఖల దృష్టి ఇప్పుడు రింగింగ్ బెల్స్‌పై పడింది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ను రింగింగ్ బెల్స్ ఇటీవల పరిచయం చేసినది తెలిసిందే. దీని ధర కేవలం 251 రూపాయలు. ఈ నేపథ్యంలో ఈ నోయిడాకు చెందిన సంస్థ ఆర్థికపరమైన అంశాలను ఎక్సైజ్, ఐటి శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి ఇతరత్రా అన్ని వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎక్సైజ్, ఐటి అధికారులు తమ సంస్థకు వచ్చినట్లు రింగింగ్ బెల్స్ అధ్యక్షుడు అశోక్ చద్దా పిటిఐకి పంపిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియాకు అనుగుణంగా వెళ్తున్న తమకు సహకారంగా, మద్దతుగా వారు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చినట్లు తెలిపారు.
మరోవైపు టెలికామ్ మంత్రిత్వశాఖకు రింగింగ్ బెల్స్‌పై మొబైల్ పరిశ్రమ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) లేకుండా ఫ్రీడమ్ 251ను ఎలా మార్కెటింగ్ చేస్తున్నారో చెప్పాలని సదరు మంత్రిత్వ శాఖ సంస్థను కోరింది. అంతేగాక కేవలం 251 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను రింగింగ్ బెల్స్ అందిస్తున్న అంశాన్ని పరిశీలించాలని ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ కార్యదర్శి అరుణ శర్మను టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. అలాగే సంస్థ విశ్వసనీయతను కూడా తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి టెలికామ్ మంత్రిత్వ శాఖ సూచించింది. బిజెపి ఎంపీ కిరిట్ సోమయ్య నుంచి వచ్చిన లేఖ నేపథ్యంలో టెలికామ్ మంత్రిత్వ శాఖ పైవిధంగా స్పందించినట్లు సంబంధిత అధికారి ఒకరు పిటిఐకి శనివారం తెలియజేశారు.
ఈ స్మార్ట్ఫోన్ రాకతో మార్కెట్‌లో మిగతా సంస్థల ఉనికి ప్రమాదంలో పడుతుందని ఇప్పటికే భారత సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) ఆందోళన వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ మేరకు టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖను కూడా ఐసిఎ రాసింది. రాయితీ ధరలోనైనా 3,500 రూపాయల కంటే తక్కువకు స్మార్ట్ఫోన్‌ను విక్రయించడం సాధ్యం కాదని ఐసిఎ తెలిపింది. అలాంటిది 251 రూపాయలకు ఎలా ఇస్తున్నారని, దాని పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందని లేఖలో పేర్కొంది. అయతే దీనిపై రింగింగ్ బెల్స్ అధ్యక్షుడు అశోక్ చద్దా వివరణ కూడా ఇచ్చారు. దీన్ని తయారు చేయడానికి తమకు 2,500 రూపాయలు ఖర్చవుతోందని, అయితే ఎకనామీస్ ఆఫ్ స్కేల్, నూతన మార్కెటింగ్ విధానాలు, పన్నుల తగ్గింపు, కొత్త ఈ-మార్కెట్ సృష్టితో 251 రూపాయలకే అందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతోందన్న ఊహాగానాలనూ ఆయన కొట్టిపారేశారు. అయనప్పటికీ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ఫోన్‌పై భారీ స్థాయిలో అనుమానాలు తలెత్తుతున్నాయ.
ఈ స్మార్ట్ఫోన్ యాడ్‌కామ్ అనే సంస్థ రూపొందించిన ఐకాన్ 4ను పోలీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఐకాన్ 4.. 3,999 రూపాయలకు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా, ఈ ఆరోపణలపై యాడ్‌కామ్ వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియా స్పందిస్తూ కొన్ని డివైజ్‌లను తమ నుంచి రింగింగ్ బెల్స్ తీసుకుందని అనడం ఆసక్తికరంగా మారింది. అంతేగాక ఫ్రీడమ్ 251లో ఉన్న యాప్స్‌లో చాలావరకు యాపిల్ ఐఫోన్‌లో ఉన్నవే కనిపిస్తుండటం గమనార్హం. అయతే ఫోన్ ప్రారంభోత్సవంలో శాంపిల్ మోడల్స్‌ను చూపించామని, మార్కెట్‌లో విక్రయించేటప్పుడు అసలు బ్రాండ్ ఉంటుందని సంస్థ చెబుతోంది. అమితి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన మోహిత్ కుమార్ గోయెల్ రింగింగ్ బెల్స్ సంస్థను ఐదు నెలల క్రితం నెలకొల్పగా, ఇంతకుముందు ప్రపంచంలోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను 2,999 రూపాయలకే రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇక్కడ ‘ఫ్రీడమ్ 251’ పేరుతో 3జి స్మార్ట్ఫోన్‌ను 251 రూపాయలకే అందుబాటులోకి తీసుకురాగా, దీన్ని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆవిష్కరించారు. నిజానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ విడుదల చేయాల్సి ఉండగా, కేబినెట్ సమావేశం కారణంగా ఆయన హాజరు కాలేకపోయారని సంస్థ వర్గాలు పేర్కొన్నది తెలిసిందే.

ముగిసిన
‘ఫ్రీడమ్ 251’ బుకింగ్స్!
సంచలనాత్మక స్మార్ట్ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు శనివారం రింగింగ్ బెల్స్ ప్రకటించింది. తొలి దశలో భాగంగా గురువారం ఆరంభించిన ఈ బుకింగ్స్‌లో ఊహించినదానికంటే ఎన్నోరెట్లు అధికంగా స్పందన లభించిందని, దీనికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు సంస్థ వెబ్‌సైట్‌లో తెలిపింది. తప్పకుండా మరో దశలో మళ్లీ ఈ స్మార్ట్ఫోన్‌ను మరికొందరు అందుకోవచ్చని చెప్పింది. కాగా, బుకింగ్స్ మొదలైన తొలి రోజే విపరీతమైన డిమాండ్‌తో సర్వర్లు డౌనై 24 గంటలపాటు ఆర్డర్లను నిలిపివేసిన రింగింగ్ బెల్స్.. మొదటి రోజు 3.70 కోట్ల బుకింగ్స్‌ను అందుకున్నట్లు చెప్పింది. తర్వాతి రోజు మరో 2.47 కోట్ల ఆర్డర్లు నమోదైయ్యాయి. ప్రారంభంలో సెకనుకు 6 లక్షల బుకింగ్స్ రిజిస్టరైనట్లు రింగింగ్ బెల్స్ ప్రకటించినది తెలిసిందే. 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి.

రింగింగ్ బెల్స్ రూపొందించిన ప్రపంచంలోనే
అత్యంత చౌక స్మార్ట్ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ను న్యూఢిల్లీలో బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి మార్కెట్‌కు పరిచయం చేస్తున్న దృశ్యం (ఫైల్‌ఫోటో)