బిజినెస్

నయా ఐఫోన్ యూజర్లకు ‘జియో నజరానా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ డిసెంబర్ 31 వరకు ఉచిత 4జి సేవలతో ఇప్పటికే దేశీయ టెలికామ్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన జియో.. ఇప్పుడు ఐఫోన్ నూతన వినియోగదారులకు ఏకంగా 15 నెలలపాటు ఉచిత సేవలను అందిస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ మొబైల్ ఫోన్లు శుక్రవారం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ రిటైల్ స్టోర్లతోపాటు యాపిల్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, టాటా క్లిక్‌లలో ఈ ఫోన్ల విక్రయాలు జరుగుతున్నాయి.
దీంతో ఈ ఫోన్ల వినియోగదారులకు వాయిస్ కాల్స్‌తోపాటు 20జిబి డేటా, అపరిమిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితమని స్పష్టం చేసింది. 18,000 రూపాయల విలువైన ఈ ఆఫర్ కొత్త ఐఫోన్ వినియోగదారులందరికీ తమ జియో నెట్‌వర్క్‌పై వర్తిస్తుందని శుక్రవారం వివరించింది. ఈ నెల 31 వరకు ఎలాగూ ‘వెల్‌కమ్ ప్లాన్’లో 4జి సేవలను తమ వినియోగదారులందరికీ జియో ఇస్తోంది. అయితే ప్రత్యేకంగా ఈ ఉచిత సేవలను జనవరి 1 నుంచి ఏడాదిపాటు ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే జియో కొనసాగించనుంది. దీంతో ఈ మూడు నెలలు, ఆ పనె్నండు నెలలు కలిపి మొత్తం 15 నెలలు ఐఫోన్ వినియోగదారులకు ఉచిత జియో సేవలు అందుతాయన్నమాట. కాగా, కొత్తగా విడుదలైన ఐఫోన్ 7, 7 ప్లస్‌లకే కాకుండా ఐఫోన్ 6, 6 ప్లస్, ఎస్‌ఇలకు కూడా తమ ఉచిత ఆఫర్ వర్తిస్తుందని జియో తెలియజేసింది. అపరిమిత లోకల్, ఎస్‌టిడి వాయిస్ కాలింగ్, నేషనల్ రోమింగ్, 20 జిబి వరకు 4జి డేటా, రాత్రిళ్లు అపరిమితంగా 4జి డేటా, 40 జిబి వరకు వైఫై డేటా, అపరిమిత ఎస్‌ఎమ్‌ఎస్, అపరిమిత జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ఆఫర్ ఉచితమని చెప్పింది.
సాధారణంగా ఈ సేవలను 1,499 రూపాయల ప్లాన్‌లో జియో అందిస్తుండగా, ఈ సేవల విలువ 18,000 రూపాయలకు సమానం. ఐఫోన్ 7, 7 ప్లస్ 32 జిబి, 128 జిబి, 256 జిబి మోడల్స్ మార్కెట్‌లో ఉన్నాయి. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లలో లభిస్తున్నాయి. 32 జిబి ఫోన్ ధర 60,000 రూపాయలుగా ఉంది. ఐఫోన్ 7లో 3డి టచ్‌తో 4.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటే, 7 ప్లస్‌లో 3డి టచ్‌తో 5.5 అంగుళాల రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే ఉంది. గత మోడల్స్‌తో పోల్చితే 40 శాతం అధికంగా వీటి పనితనం ఉంటుంది. ఐఒఎస్ 10 ఆధారిత ఐఫోన్ 7 స్పోర్ట్స్‌లో 12 మెగాపిక్సల్ ఐసెట్ కెమెరా, 4కె వీడియో రికార్డింగ్ ఉండగా, 7 ప్లస్‌లో డ్యూయల్ 12 మెగాపిక్సల్ రేర్ కెమెరాలున్నాయి.

శుక్రవారం ముంబయలో ఐఫోన్ 7 కోసం బారులుతీరిన జనం,
చేతిలో జియో సిమ్‌తో తొలి ఐఫోన్ 7ను కొనుగోలు చేసిన శివాని సింగ్