భాస్కర వాణి

ఇప్పుడూ హిందువులు ‘రాజీ’ అవ్వాలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ రజనీకాంత్ ఢిల్లీ అల్లర్లు జరిగిన వెంటనే స్పందిస్తూ ‘‘ఇలా జరగడం సరైంది కాదు. అవసరమైతే ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తాం’’ అన్నాడు. దీన్ని దేశంలోని మీడియా ఆయన మాటలు సీఏఏకు వ్యతిరేకం అన్నట్లుగా కలర్ ఇచ్చాయి. నిజానికి సిఏఏకు రాజనీకాంత్ మద్దతుగా నిల్చినపుడు ఇదే మీడియా పట్టించుకోలేదు. వెంటనే కొన్ని ముస్లిం సంఘాల గుంపులు రజనీకాంత్ ఇంటికి వెళ్లి తమకు మద్దతుగా నిలవమని కోరాయి. దీన్ని మీడియా గొప్ప చారిత్ర విజయంగా చూపిస్తున్నది. ఈ దేశంలో మైనారిటీలకు మద్దతుగా నిలవడమే నిజమైన ‘ప్రజాస్వామ్యం’ అన్నట్లుగా కలర్ ఇస్తున్న ప్రచార ప్రసార మాధ్యమాలకు షాహీన్‌బాగ్‌లో తీవ్ర వ్యాఖ్యలు పట్టవు. సోనియా గాంధీ సాక్షాత్తుగా సభ పెట్టి విభజన వాదం ప్రవచిస్తే, ఆమెకు చాలా సన్నిహితుడైన హర్షమందర్ మాట్లాడిన మాటలు ఇటీవల బయటకు వచ్చాయి. ‘‘కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, రామమందిరంపై తీర్పు ద్వారా ప్రభుత్వ సంస్థలు, కోర్టులు ముస్లింలకు అన్యాయం చేసాయి. కాబట్టి ఇపుడు చట్టసభల్లో, న్యాయస్థానాల్లో న్యాయం జరగదు కాబట్టి వీధుల్లోనే తేల్చుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించడం, దానికి అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టడం ఏరకమైన సంకేతం ఇస్తున్నది. ఇదంతా ఢిల్లీలో మత ఘర్షణలు జరిగిందుకు కారణం అయ్యింది. ముందునుండీ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేది ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు. పార్లమెంట్ చట్టాలు చేసే కేంద్రం, ప్రభుత్వం పూర్తి మెజారిటీగల పక్షం. పార్లమెంట్ చేసిన చట్టాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యమా! తిరస్కరించడం రాజ్యాంగ పరిరక్షణా! ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కంకణబద్దులంతా చెప్పాలి. అసలు ఈ దేశంలో మొదటినుండి నియమాలకు, ఆదేశాలకు కట్టుబడింది హిందువులే. దానికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. ముస్లిం రాజకీయ నాయకత్వం ఏనాడూ ప్రధాన భారత స్రవంతిలో కలవలేదు. అదే ఈ దేశ విభజనకు కారణమైంది. ఇపుడూ అదే ధోరణిని కొందరు అవలంభిస్తున్నారు.
భారత ఉపఖండంపై దాడిచేసిన మొదటి ఆక్రమణదారు మహ్మమద్ బిన్ కాశీం. క్రీ.శ. 712లో భారత్‌లోని సింధు ప్రాంతం ద్వారానే ప్రవేశించి రాజా దాహిర్ సేన్‌ను చంపి హిందూ సమాజాన్ని విధ్వంసం చేస్తే అది గొప్ప విషయంగా వర్ణించిన మతవాదులు, చరిత్రకారులు ఈ దేశంలో ఉన్నారు. అలాగే ఘజనీ ఈ దేశంపై 17సార్లు భయంకరమైన దాడులు చేస్తే అది ‘అలుపెరుగని పోరా టం’గా చెప్పే మనోవిజ్ఞావేత్తలు ఈ దేశంలో పుట్టారు. అక్బర్ ఇస్లాంను శాంతిగా చెప్పాడని అతని భావాలను తిరస్కరించి ఔరంగజేబు ‘అసలు సిసలైన విశ్వాసుల మతం’ నెలకొల్పాడని చెప్పేవాళ్ళూ ఉన్నారు. ఈ చరిత్రలోని రక్తసిక్తమైన మరకలు హిందూ సమాజం తీవ్రంగా ఏనాడూ స్వీకరించలేదు. ఎప్పుడూ వాళ్ల మహిమలను స్తుతించే పాఠ్యంశాలు చదివి ‘రాజీ’ ధోరణిలో బ్రతికింది. ఆఖరుకు నెహ్రూ లాంటి వ్యక్తే ‘అరబ్బులు గొప్ప ఉత్సాహంతో, చైతన్యంతో విస్తరణ చెందారు; స్పెయిన్ మొదలుకొని మంగోలియా వరకు ఒక మహత్తర సంస్కృతిని వారు తీసుకొని వచ్చారు’ అంటూ చెప్పిన ఆణిముత్యాలు ఇక్కడి రొమిల్లా థాపర్ మొదలుకొని రామచంద్ర గుహ వరకు అందరూ శిలాశాసనంగా, సుగ్రీవాజ్ఞగా భావించి మన చరిత్రను అష్టవంకర్లుగా మార్చి మనల్ని నపుంసకుల్ని చేశారు. బ్రిటీష్ వాళ్ల కుట్రతో 1905లో బెంగాల్ విభజన జరుగగా బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ ఆనాటి బ్రిటీషు వ్యతిరేకోద్యమానికి తారకమంత్రం అయ్యింది. కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో మొదటిసారి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపిస్తే, తర్వాత కాంగ్రెస్ జాతీయ గీతంగా స్వీకరించింది. 1927 నాటికే దాని ప్రభావం స్వాతంత్రోద్యమంపై పడింది. ‘‘వేలాది ఉపన్యాసాలు, వ్యాసాలు సాధించలేని అద్భుతాన్ని ఆ రెండు పలుకులు సాధించాయి’’ అంటూ గాంధీజీ స్వయంగా పేర్కొన్నాడు. మరాఠా దేశభక్తుడైన విష్ణు దిగంబర్ పతాస్కర్ గంభీరమైన తన గొంతుతో ఆలపిస్తే అందరూ నిశే్చష్టులయ్యేవారు. అయితే 1923 కాకినాడ కాంగ్రెస్ సభల్లో వౌలానా మహమ్మదాలీ దాన్ని అడ్డుకొన్నాడు. సభలోని పెద్ద పెద్ద నాయకులు చేష్టలుడిగి చూస్తున్నారు. కానీ విష్ణు దిగంబర్ మాత్రం ‘వందేమాతరం’ పాడొద్దని ఆపే అధికారం నీకు లేదన్నాడు. వెంటనే సంతుష్టీకరణ కోసం 1922లోనే మహమ్మద్ ఇక్బాల్ రాసిన ‘సారే జహాసే అచ్చా’ను సహగీతంగా స్వీకరించారు. 1937 అక్టోబర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు ముందే ముస్లిం లీగ్ ‘హిందూ రాష్ట్రాలు’ అంటూ వందేమాతరం ఆలాపనను సాకుగా చూపి నిందించింది.
అలాగే 1921 నుండే భారత పతాక విషయంలో ఆనాటి ముస్లిం లీగ్ ఇలాగే వ్యవహరించింది. అలాగే స్వామి దయానంద సరస్వతి మొదలుకొని అందరూ దేశ ప్రజలందరినీ కలిపే భాషగా హిందీని ముందుకు తెచ్చినా ముస్లిం లీగ్ హిందీని వ్యతిరేకించి అది హిందువుల భాషగా చిత్రీకరించింది. హిందీ స్థానంలో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించాలని లేదంటే సహకరించడం సాధ్యంకాదని బెదిరించింది. అది సాధ్యం కాకపోవడంతో ముస్లిం లీగ్ ‘యహ్ ఉర్దూకా జనా జాహై జరా శాన్‌సే నికలే’ అంటూ తమ మొఘల్ వారసత్వం గుర్తుచేశారు. జాతీయ గీతం, పతాకం విషయంలో రాజీపడినట్లే కాంగ్రెస్ ఇక్కడ కూడా రాజీపడి హిందీని హిందుస్తానీగా మార్చి ‘బాద్షారాముడు’, షహజాదా లక్ష్మణ్‌గా మార్చివేశారు. అలాగే గోవధ విషయంలో రచ్చ రచ్చ చేశారు. ఈ విషయాలను సరిగ్గా పసిగట్టిన వాళ్లలో డా బాబాసాహెబ్ ప్రథమ స్థానంలో నిలుస్తారు. ‘‘ఆరాధనలో భాగంగా గోవధ చేసి బలి ఇవ్వాలని ఇస్లామిక్ న్యాయశాసనం శాసించలేదు.. కానీ భారతదేశంలో మాత్రం వారు మరే ఇతర జంతువును బలి చేయడంలో తృప్తి చెందరు. అన్ని ముస్లిం దేశాల్లో నిరభ్యంతరంగా మసీదుల ఎదుట మేళతాళాలు వాయించుకోవచ్చు. సెక్యులర్ దేశం కానటువంటి ఆప్ఘనిస్తాన్‌లో సైతం మసీదుల ఎదుట మేళతాళాలు ఎవరూ వ్యతిరేకించరు. కానీ భారత్‌లోని ముస్లింలు మాత్రం వాటిని ఆపి తీరాలి అంటారు. హిందువులు దానిని హక్కుగా భావిస్తారన్న అక్కసు తప్ప వారికి వేరే కారణం లేదు’’ అంటూ పాకిస్తాన్‌పై రాసిన పుస్తకంలో పు.259, 260 బాబాసాహెబ్ పేర్కొన్నారు.
ఐలా ప్రతి విషయంలో హిందువుల మనోభావాలు గౌరవించని నేపథ్యం స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాట సమయం నుండి ముస్లిం నాయకత్వానికి ఉంది. వాళ్లకు పూర్తి రక్షణ కవచంగా పనిచేసిన కమ్యూనిస్టులు, స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ నాయకత్వం, చరిత్ర తెలియని అజ్ఞానులు వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వచ్చారు. ఇపుడూ సీఏఏ విషయంలో ఇలాంటి ధోరణే ప్రస్తుతం చాలా పార్టీలు వహిస్తున్నాయి. అందరూ ఒక వర్గానికి కొమ్ముగాసేందుకు పోటీపడుతున్నారు. మొదటినుండి రాజీపడుతూ హిందూ వర్గ రాజకీయ నాయకులు ఇపుడు వెనక్కి తగ్గడంలేదని వాళ్ల అక్కసు. అయినా హిందువులు తమ సర్వస్వం కోల్పోయి వందల ఏళ్లు బానిసలుగా బ్రతికి ఇంకెన్నాళ్లు రాజీపడాలి?

bhaskarayogi.p@gmail.com