బాల భూమి
మిత్రధర్మం (కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అడవి రాజు సింహానికి సహాయకునిగా చాలాకాలం నుండి ఒక నక్క ఉండేది. అయితే ఇటీవల నక్క మీద నమ్మకం పోయింది రాజుకి. దాంతో దానిని తొలగించి ఒక తోడేలుని తనకి సహాయకునిగా నియమించుకుంది.
ఒకరోజు సింహమూ, తోడేలూ రెండు కలిసి ఆహారం వెదకటానికై అడవిలో తిరగసాగాయి.
వీరిద్దరినీ చూసి జంతువులన్నీ దూరంగా పారిపోవటంతో ఎంత వెదికినా ఆహారం దొరకలేదు వాళ్లకు. అలా వెదుకుతూ వెదుకుతూ అడవి చివరి వరకూ వచ్చేశాయి.
చాలాసేపటికి దూరంగా గడ్డి మేస్తూ ఒక మేక వాటి కంటబడింది.
హమ్మయ్య అనుకుంది సింహం. కానీ తోడేలుకు మాత్రం ఆ మేకను చూడగానే సింహం దానిని ఎక్కడ తినివేస్తుందోనని భయం వేసింది. ఎందుకంటే ఇదివరకు రైతు చేలో పంటను నాశనం చేస్తుందని రైతు మాటుగానే తోడేలుని పట్టుకుని చావగొట్టాడు. అలా కొట్టీకొట్టీ కొన ఊపిరితో ఉన్న తోడేలుని చూసి చచ్చిపోయిందనుకుని దాన్ని దూరంగా విసిరేసి తన మేకల్ని తోలుకుంటూ ఇంటికేసి బయలుదేరాడు.
అలా వెళుతూ వెళుతూ మందలో ఆఖర్న ఉన్న ఒక మేక తోడేలుని చూసి జాలిపడి కొన్ని పాలు ఇచ్చింది. అవి తాగిన తోడేలుకి ఆకలి తీరి కుంటుతూ కుంటుతూ అడవిలోకి పారిపోయింది. అలా ఆనాడు తన ప్రాణాలు కాపాడిన మేకను ఎలాగైనా రక్షించాలని అనుకుంది తోడేలు.
దాంతో.. వేగంగా మేకవైపు కదలబోతున్న సింహాన్ని ‘ఆగండి మహారాజా!’ అని గట్టిగా అరిచింది. ఆగిపోయిన సింహం ఏంటన్నట్టు చూసింది తోడేలు వైపు.
‘మహారాజా...! ఆ మేకను పరిశీలనగా చూశారా?’ అంది మేకనే చూస్తూ.
‘ఏమైంది దానికి? బాగానే ఉంది కదా!’ అని తిరిగి ప్రశ్నించింది సింహరాజు.
‘బాగా లేదు మహారాజా! దాని మెడ కింద ఏవో పొడుగ్గా రెండు వేలాడుతున్నాయి. గమనించండి’ అంది.
మరింత పరిశీలనగా చూసిన సింహరాజు.. ‘అవును. ఉన్నాయి. అయితే ఏమిటి?’ అంది ఆశ్చర్యంగా.
‘కొన్నింటికే అలా ఉంటాయి. అలా ఉన్న మేకలను తినకూడదు మహారాజా! అవి తిన్న వారికి మరణం సంభవిస్తుంది. మా అమ్మ అవి ఉన్న మేకను తినే చనిపోయింది..’ అంది దొంగ ఏడుపు నటిస్తూ.
ఆకలి వేసినప్పుడు దూకుడుగా వెళ్లి వేటాడి చంపి తినటమే తెలుసుగానీ అంత తీరికగా మేకలను పరిశీలించి చూడని సింహరాజు అవి అన్ని మేకలకూ ఉంటాయని తెలియక తోడేలు మాటలు నమ్మి వెనుదిరిగింది.
‘హమ్మయ్య.. అమ్మ గురించి చెప్పిన అబద్ధం ఒక మిత్రుణ్ణి కాపాడగలిగింది’ అని మనసులో ఎంతో సంతోషపడ్డ తోడేలు సింహరాజుని అనుసరించింది.