బాల భూమి
వ్యవసాయ రహస్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మిర్తివలస అనే గ్రామంలో కోటయ్య అనే రైతు ఐదెకరాల మాగాణికి యజమాని. అతనికి సీతమ్మ అనే భార్య, రాజయ్య అనే ఐదేళ్ల కొడుకు ఉండేవారు. కోటయ్య తన కొడుకు రాజయ్యను బాగా చదివించాలనే కోరికతో ఆ ఊరులో గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. రాజయ్యను బడికి పంపుతూ బడిలో అల్లరి చేయకూడదని, తోటి పిల్లలతో మంచిగా ఉండాలని, ఉపాధ్యాయుల ఎడల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని పదే పదే చెప్పి పంపేవాడు. కోటయ్యకు, అతని భార్యకు చదువు లేని కారణంగా ఆ ఊరు పురోహితుని సలహా ప్రకారం భార్యాభర్తలు నడుచుకొనేవారు.
కోటయ్య తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలనే కోరికతో ఉండేవాడు. ఆ కారణంగా తనకున్న భూమిలోనే వ్యవసాయం నిరంతరం చేసి కొంత పొదుపు చేసేవాడు. తనకు పండే మొదటి పంట ఫలసాయంలో ఎంతో కొంత ముందుగా తీసి ఆ ఊరు పురోహితుడు రామశాస్ర్తీకి ఇచ్చేవాడు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లేసరికి రైతుల్లో రైతులకు పోటీ తగిలేది. ఒక్కోసారి తను వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేవి కాదు. కొన్ని సందర్భాలలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంట చేతికి సరిగ్గా అందేది కాదు. కొన్నాళ్లకు ఎకరా పొలంపై అప్పుచేశాడు. మరికొన్నాళ్లకు కోటయ్య అప్పులు చేసిన సొమ్ముకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి వచ్చాడు.
ఉభాలు సీజన్ వచ్చింది. రమారమి రెండు నెలల కాలంలో తోటి రైతులందరూ ఎవరికి నచ్చిన పంటలు వారి విత్తనాలు, నారులు నాటడం పూర్తి చేశారు. ఉభాలు సీజన్ వచ్చిన మొదటి రోజుల్లో నారులు నాటిన కొందరి పొలాల్లో చేలు పచ్చదనంతో కళకళలాడుతూ మెరిసిపోతున్నాయి. ఆ పంట పొలాలను చూసి కోటయ్య మనసులో బాధపడ్డాడు. కోటయ్య చేతిన పైసా లేదు. కానీ పొలం పనులకు పెట్టుబడులు పెట్టే కాలం అయినందున ఎవరూ సొమ్ము ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆ ఊరులో ఒకతను డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చినా మా పొలం మీద కాకుండా ఇంటి మీదైతే అప్పు ఇస్తామన్నాడు. ఉభాలు కాలం ముగిసిపోయింది. కోటయ్య చేతిన డబ్బు లేని కారణంగా వ్యవసాయానికి సంబంధించి తన భూమిని సాగుచేయలేకపోయాడు.
వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడం ప్రారంభించాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి ప్రవహిస్తూ గట్టులు కొట్టుకుపోయాయి. నీరు ఉప్పొంగి ప్రవహించి పొలాలలో పంటలన్నీ కొట్టుకుపోయాయి. రైతులు తమకు ఏర్పడే నష్టానికి కన్నీరు మున్నీరయ్యారు. తను ఇంటి మీద సొమ్మును అప్పుగా తెచ్చి వ్యవసాయానికి మదుపులు పెట్టకపోవడమే మంచిదయింది అనుకున్నాడు కోటయ్య. పంటలు పోవడంతో నిత్యావసర వస్తువులను ఇతర ప్రాంతాల నుండి అధిక ధరలకు కొనుక్కోవలసి వచ్చేది. ధరలు పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కోటయ్య ఈ పరిస్థితులను తట్టుకోలేక పోయాడు.
కొంతకాలానికి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రైతులు ఎప్పటిలా వ్యవసాయ పనులు మరలా ప్రారంభించారు. నెల రోజుల్లో ఎప్పటికైనా పంట పొలాలను ఆకుపచ్చదనం ఉట్టిపడేటట్టు కళకళలాడాయి. కోటయ్య పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి లేక వ్యవసాయాన్ని చేయలేకపోయాడు. పురోహితుడు రామశాస్ర్తీ ఇంటికి పోయి కోటయ్య తన పరిస్థితిని విన్నవించుకున్నాడు.
అందుకు రామశాస్ర్తీ ‘‘కోటయ్యా! నీవు నేను చెప్పిన మాట వింటానంటే ఒక విషయం చెబుతాను. రానున్న రెండు మూడు నెలల్లో ఉల్లిపాయలకు మంచి డిమాండు ఏర్పడి దేశం మొత్తంపై ధరలు విపరీతంగా పెరిగి ఉల్లిధర ఇంకా ఆకాశాన్నంటే సూచనలు కనిపిస్తున్నాయి. దొంగలు రాత్రివేళల్లో ఉల్లిపాయల గోదాములో చొరబడి దొంగతనాలు చేస్తున్నట్టు నిన్ననే పేపర్లో చదివాను. మన చుట్టుపక్క గ్రామాల్లో ఒక మూడు నాలుగు రోజులు తిరిగి ఎవరెవరు ఏయే పంటలు వేశారో పరిశీలించు. రైతులు ఉల్లి పంట ఎక్కువగా వెయ్యకపోతే నీ అదృష్టం పండిందనుకో! ఆ పంటను నీవు వేసుకుంటే లాభాలే లాభాలు. నీకో ‘వ్యవసాయ రహస్యం’ చెబుతా విను. అందరూ వేసే పంట ఎప్పుడూ వెయ్యొద్దు. అలా వేస్తే పంట అమ్మకానికి వెళ్లేసరికి మీ రైతుల్లో రైతులు పోటీపడి చవకగా అమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీస గిట్టుబాటు ధర రాక నష్టాలపాలై అప్పులపాలవుతావు. నేను చెప్పినట్టు చెయ్యి.’’ అని రామశాస్ర్తీ సలహా ఇచ్చాడు.
రామశాస్ర్తీ సలహా ప్రకారం కోటయ్య ఆ చుట్టుపక్క గ్రామాలు తిరిగాడు. ఎక్కడ చూసినా వరి, ప్రత్తి, చెరకు, జనుములాంటి దీర్ఘకాలిక పంటలనే అధికంగా చూశాడు. పురోహితుడు రామశాస్ర్తీ అప్పుగా కొంత సొమ్మునిచ్చాడు. పొలంపై గతంలో చేసిన అప్పును తీర్చాడు. కోటయ్య నివశిస్తున్న ఇంటిని అమ్మేసి ఆ సొమ్ముతో తనకు గల ఐదెకరాల పొలంలో ఒక్క ఉల్లి పంటనే పండించాడు. రెండు మూడు నెలల వ్యవధిలోనే కొన్ని టన్నుల ఉల్లి పంట పండి కొన్ని లక్షల రూపాయలు చేతికొచ్చింది. కోటయ్య ఉన్నట్టుండి లక్షాధికారై పోయాడు. తనకు గల అప్పులన్నీ తీర్చేశాడు. కొడుకుని ఉన్నత చదువులు చదివించాడు. మంచి ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశ సందర్భంగా రామశాస్ర్తీ దంపతులను సాదరపూర్వకంగా ఆహ్వానించి నూతన వస్త్రాలతో సత్కరించాడు.