బాల భూమి

పాపం పండిన పాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో చిన్న కుగ్రామం. రైతులు పూరిగుడిసెల్లో నివాసముంటూ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు సైతం పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రతి రైతు ఇంటిలో గినె్న కోళ్లు వున్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టేవి. రైతులు వాటిని సేకరించి ఆరగించేవారు. అయితే కొంతకాలంగా గినె్నకోళ్లు పెట్టిన గుడ్లు మాయవౌతున్నట్లు భీమయ్య అనే రైతు కనిపెట్టాడు. దీనికి కారణం ఏమిటని దర్యాప్తు మొదలుపెట్టాడు. ఒక విష సర్పం ఎక్కడి నుంచో వచ్చి గినె్నకోళ్లు ఆరుబయట పెడుతున్న గుడ్లను మింగేసి వెళ్లిపోతోంది. ఈ విషయాన్ని తన తోటివారితో భీమయ్య చెప్పాడు.
‘పోనీలే భీమయ్యా. ఆ పాము మనకు ఎటువంటి హానీ చేయడం లేదు కదా? నాలుగు గుడ్లు తిన్నంత మాత్రాన మనకొచ్చిన నష్టమేముంది’ అన్నారు తోటి రైతులు.
ఈ విషయాన్ని భీమయ్య అంతటితో మరచిపోయాడు. కాలం గడుస్తోంది. ఒకరోజు ఆ కుగ్రామానికి చెందిన చిన్నారి ఒకడు పాము కాటుకు మరణించాడు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు అంత తీవ్రంగా పరిగణించలేదు. కానీ వారానికి ఒక చిన్నారి పాముకాటుకు గురై మరణించడం మొదలైంది. భీమయ్య ఈ విషయాన్ని తీవ్రంగా భావించి తనదైన శైలిలో విషయాన్ని కనిపెట్టాడు. గ్రామస్తులందరినీ ఒకచోట చేర్చాడు.
‘ఒక పాము గినె్నకోడి గుడ్లను దొంగచాటుగా తింటుందని నేను చెప్పినప్పుడు మనకు ఎటువంటి హాని చేయడం లేదు కదా అని మీరంతా పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు అదే పాము గుడ్లను తినేయడమే కాక ప్రతి వారం ఒక చిన్నారిని పొట్టన పెట్టుకుంటోంది’ అని వాపోయాడు భీమయ్య.
ఇక చేసేది లేక గ్రామస్తులంతా పాము వేటలో బయలుదేరారు. పాము కనిపించింది. కాని అది తప్పించుకు పోతోంది. ఒకసారి రాళ్ల గుట్టల్లోకి వెళ్లిపోతే మరోసారి పచ్చగడ్డిలో జరజరా పాకుతూ కంటికి కనిపించకుండా మాయమై పోతోంది. పాము ఎక్కడెక్కడ తిరుగుతుందో కనిపెట్టారు కానీ పామును ఎలా పట్టుకోవాలా అని భీమయ్య ఆలోచించగా అతడికి ఒక ఉపాయం తట్టింది. మరుసటిరోజు భీమయ్య చాలా గుడ్లను ఉడకబెట్టి పాము సంచరించే మార్గంలో వేశాడు. అనుకున్న విధంగా పాము వచ్చి ఆ గుడ్లను మింగేసింది. ఉడకబెట్టిన గుడ్లను మింగడంతో పాము లావు పెరిగింది. రాళ్ల సందుల్లోకి వెళ్లబోయింది. లావుగా ఉన్న కారణంగా ఆ సందుల్లో పట్టలేదు. అది భీమయ్య చేతికి చిక్కింది. భీమయ్య దాన్ని జంతు సంరక్షణ కేంద్రం వారికి అప్పజెప్పాడు. అక్కడి అధికారులు పామును చిన్న అద్దాల గదిలో బంధించారు. ఇప్పుడు పాము ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేదు. అధికారులు పెట్టింది తినాలి. పైగా అధికారులు దాని విష గ్రంథుల నుండి విషాన్ని సేకరించి వైద్యానికి పనికి వచ్చే మందుల తయారీ కర్మాగారాల వారికి అమ్మడం ప్రారంభించారు. మనుషుల్ని ప్రాణాపాయం నుంచి కాపాడే కొన్ని మందుల్లో పాము విషాన్ని తగు మోతాదులో కలుపుతారు. ఇన్నాళ్లకు ఆ పాము పాపం పండినందుకు గ్రామస్థులంతా సంతోషించారు. తన తెలివితేటలతో పామును బంధించి జంతు సంరక్షణా కేంద్రం వారికి అందించి, గ్రామస్థుల పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించిన భీమయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.

-షేక్ అబ్దుల్ హకీం జానీ 99494 29827