బాల భూమి

ప్రాణదాతలు(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహామల్లపురమనే ఒక చిన్న గ్రామంలో చలమయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా న్యాయంగా వ్యాపారం చేసేవాడు. తనకు రావలసిన లాభానికంటే ఒక్క రూక ఎక్కువ తీసుకునేవాడు కాదు.
అందుకని అందరూ చలమయ్య దగ్గరే వస్తువులన్నీ కొనేవారు. మహా మల్లపురం నుంచీ పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి వస్తువులు కొనాలంటే ఒక చిట్టడవి దాటాలి. ఆ అడవిలో కొందరు దారి దోపిడీ దొంగలు ఉండేవారు.
చీకటి పడిందంటే ఆ దారిన వెళ్ళేవారిని దోచుకోడమేకాక ప్రాణహాని కూడా కలిగించేవారు. అందుకని ఐదారుమంది కలిసి ఒకే మారు పట్టణానికి వెళ్ళి, పనులన్నీ చక్కబెట్టుకుని సూర్యాస్తమయంలోగా ఇళ్ళుచేరేవారు.
ఒకమారు మహామల్లపురంలో ఒక వేసవిలో ఒకే నెలలో ఐదు వివాహాలు వచ్చాయి. అంతా చలమయ్య న్యాయంగా ఇస్తాడని, తమకు కావల్సిన వస్తువులన్నీ పట్టణంనుంచీ తెచ్చిపెట్టమని పట్టికలు ఇచ్చారు. చలమయ్య తన పెద్ద రెండెడ్లబండి కట్టుకుని తనకుతోడుగా రాను ఎవ్వరూ లేనందున తెల్లవారుఝామునే బయల్దేరాడు.
వేసవి కావటాన ఎద్దులకు నీరు అవసరమవుతుందని రెండు పెద్ద బుంగల నిండా నీరు నింపి బండికి క్రింద గడ్డి ఉంచుకునే జోలెలో ఆ బుంగలను జాగ్రత్తగా కట్టుకుని బయల్దేరాడు. అడవి దాటుతుండగా బండి ఆపుకుని పెరుగన్నం తిని, వెంట తెచ్చుకున్న కూజాలోని చల్లని నీరు త్రాగి, బయల్దేరబోయాడు.
అప్పుడే దూరంగా కూర్చుని తనకేసి, తన దగ్గరున్న కూజాకేసీ చూస్తున్న ఒక కోతిని గమనించాడు. ఆ కోతి చూపులు, ముఖ కవళికలూ గమనించిన చలమయ్యకు దానికి దాహమవుతున్నదని అర్థమైంది.
ఆ చిట్టడవిలో ఎలాంటి నీటి సౌకర్యం లేనందున అక్కడి జంతువులన్నీ దాహం తీర్చుకోను చాలా ఇబ్బందిపడేవి. చలమయ్య వెంటనే తాను పెరుగన్నం తెచ్చుకున్న ముంత చిక్కంలోంచీ బయటికి తీసి దానిలో తన కూజాలోని నీరు పోశాడు. ఆ కోతి నిర్భయంగా దగ్గరకొచ్చి కడుపునిండా నీరు త్రాగింది. దానికళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వెనుక కాళ్లమీద నిల్చి ముందు చేతులు జోడించి తల వంచి నిల్చున్నది. తన కృతజ్ఞత అలా చెప్పుకుంది ఆ మూగజీవి.
చలమయ్యకు కళ్ళనీరు తిరిగాయి. మనస్సు కరిగిపోయింది. కేవలం నోరులేని ఒక జీవి, గ్లాసెడు నీరిచ్చినందుకు ఇలా కృతజ్ఞత చెప్పుకోడం ఎంత చిత్రం! మానవులు దీనిముందు ఎందుకు పనికొస్తారు అనుకున్నాడు.
వెంటనే చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. బండి దిగి తాను ఎద్దులకు నీరు పట్టను తెచ్చిన మట్టితొట్టెను బండి క్రింది జోలెలోంచీ తీసి, చెట్టు క్రింది పెట్టి, ఎద్దులకోసం తెచ్చిన తన బండిలోని రెండు బుంగల నీరూ దానిలో పోసేశాడు. ఆ తర్వాత బండి తోలుకుని బయల్దేరాడు.
ఎక్కువగా వస్తువుకు కొనవలసి రావటాన పట్టణంలో పని పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది. తాను వంటరిగా చిట్టడవి దాటాలని భయపడుతూనే, భగవన్నామం స్మరిస్తూ ఎడ్లను వేగంగా తోలుతూ ఇంటికి బయల్దేరాడు.
అడవిలో ప్రవేశించిన చలమయ్య ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాడు. తాను నీరుపోసి వచ్చిన మట్టితొట్టె చుట్టూ చాలా కోతులు చేరి నీరు త్రాగి గెంతుతున్నాయి. చలమయ్య తాను చేసిన చిన్న పని ఆ కోతుల దాహం తీరుస్తున్నందుకు సంతోషిస్తూ బండి కదిలించాడు. అడవి మధ్యకు వచ్చేసరికి సూర్యస్తమయం కానే ఐంది.
చీకట్లు ముసురుకున్నాయి. చలమయ్య బండిముందు హటాత్తుగా ఐదుమంది దొంగలు పెద్ద కర్రలతో, కత్తులతో చెట్టుమీదనుంచీ దూకి దాడి చేయబోయారు.
‘‘బండి వదిలేసి వెనక్కు చూడకుండా వెళ్ళు, లేదా ప్రాణాలు తీసేస్తాం జాగ్రత్త!’’అని అరిచారు. చలమయ్య చేసేదేమీలేనందున ‘బ్రతికుంటే బలుసాకు తినవచ్చని’ భావించి, బండిమీద నుంచీ క్రిందకు దూకాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది.
వెనుకనుంచీ పెద్ద కోతుల గుంపువచ్చి ఆ దొంగల మీదకు దూకి వారి జుట్టు, ముఖమూ పీకుతూ తలల పైకెత్తి చేతులతో కొట్టసాగాయి. దొంగలు బ్రతుకు జీవుడాని అడవిలోకి పరుగందుకున్నారు. వారు కనుచూపుమేర దాటి వెళ్ళాక, కోతులన్నీ వచ్చి బండి చుట్టూ రక్షణగా నిల్చున్నాయి.
చలమయ్య వాటి చర్యకు అచ్చెరువందాడు. ఒక పెద్దకోతి వచ్చి బండెక్కి పగ్గాలు చలమయ్యేకేసి చూపింది. అంటే బండి కదలించమని అర్ధం అనుకున్నాడు చలమయ్య.
ఈ మూగజీవులకెంత కృతజ్ఞత. మళ్ళా బండెక్కి కూర్చుని ఎద్దులను తోలుతుండగా, కోతులన్నీ బండిచుట్టూ రక్షణ వలయంచేస్తూ నడిచాయి. అడవి దారిన తర్వాత అన్నీ వరుసగా వచ్చి, బారులుతీరి ఎదురుగా నిల్చుని చేతులెత్తి మొక్కాయి చలమయ్యకు. చలమయ్య నేత్రాలు చెమర్చిపోయాయి. మనస్సు ద్రవించింది. తాను చేసిన చిన్న పనికి ఈరోజున తనను కాచిన ఈ ప్రాణదాతల ఋణం ఎలాగా తీర్చుకోవాలో ఆలోచిస్తూ చలమయ్య ఇల్లుచేరాడు.
ఆ తర్వాత ఊరి వారితో మాట్లాడి అడవి మధ్యగా, అంతాచేరి ఒక దిగుడు బావి త్రవ్వారు. మూగజీవుల దాహార్తి శాశ్వతంగా తీర్చారు.
చూశారా బాలలూ! ఎవరికి కాస్త సాయంచేసినా, ఒక విత్తునాటితే ఎన్నో కాయలు ఇచ్చేలాగా, మనకు అవసరానికి ప్రతిఫలం తప్పక అందుతుంది మరి.

-ఆదూరి హైమావతి