బాల భూమి

సలహా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రయ్య ఒక రిటైర్డ్ టీచర్. అతని కూతురు జమున, అల్లుడు రాంబాబు, మనుమడు వంశీ పట్నంలో నివాసం ఉంటున్నారు. రాంబాబు ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ హోదాలో పని చేస్తున్నాడు. జమున ఇంటిపట్టునే ఉంటుంది. వంశీ ఏడవ తరగతి చదువుతున్నాడు.
ఒకరోజు రామచంద్రయ్య పట్నంలోనే ఉంటున్న కూతుర్ని, అల్లుణ్ణి, మనుమడిని చూడడానికని వారి ఇంటికి వెళ్లాడు. ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లేసరికి, తన అల్లుడు రాంబాబు ఏదో కారణం చేత వంశీని గట్టిగా మందలించడం గమనించాడు.
గుమ్మం దగ్గర అలికిడి వినిపించేసరికి రామచంద్రయ్యను చూశారు రాంబాబు, జమున.
కుశల ప్రశ్నలు పూర్తయ్యాక రాంబాబు ఆఫీసుకు వెళ్లాడు. వంశీ స్కూల్‌కి వెళ్లిపోయాడు.
రామచంద్రయ్య స్నానం చేసి వచ్చాడు. జమున టిఫిన్ వడ్డించింది.
‘ఏంటమ్మా! అల్లుడుగారు వంశీని మందలిస్తున్నట్టు వినిపించింది. ఏంటీ విషయం?’ అంటూ ఆరా తీశాడు రామచంద్రయ్య.
‘అవును నాన్నా! ఈ మధ్య వాడికి చదువు మీద శ్రద్ధ తగ్గింది. మార్కులు అంతకంతకూ తగ్గిపోతూ ఉన్నాయి’ చెప్పింది జమున.
‘అదేంటమ్మా! వంశీ బాగా చదువుతాడని, క్లాస్‌లో ర్యాంక్ వస్తుందని చెప్పేదానివి కదా!’ ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్రయ్య.
‘అదంతా ఒకప్పటి మాట నాన్నా. ఈ మధ్య వాడి చదువు కొండెక్కుతోంది’ విచారాన్ని వ్యక్తం చేసింది జమున.
నాలుగు రోజులు అక్కడే ఉండి, వంశీకి మార్కులు తగ్గడానికి గల కారణాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రామచంద్రయ్య. వంశీ ప్రవర్తనను, రాంబాబు, జమున ప్రవర్తనను గమనించాడు. రాంబాబు ఇంట్లో ఉండటం లేదు. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చి కాఫీ తాగి, క్లబ్‌కు వెళ్లి, పొద్దుపోయాక వస్తున్నాడు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచి, హడావిడిగా ఆఫీసుకు వెళ్తున్నాడు. వంశీతో సమయం గడపటం లేదు. జమున ఇంటి పని పూర్తయ్యాక, టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటుంది. ఆమె కూడా వంశీపైనా, వాడి చదువుపైనా దృష్టి పెట్టడం లేదు. కొంతకాలం క్రిందట రాంబాబుకు తన స్నేహితుడెవరో ఒక ఖరీదైన మొబైల్‌ను బహుమతిగా ఇచ్చాడు. అప్పటివరకూ రాంబాబు వాడుతున్న టచ్ స్క్రీన్ మొబైల్‌ను జమునకు ఇచ్చాడు. జమునకు మొబైల్‌తో పెద్దగా అవసరం లేదు గనుక, దాని గురించి పట్టించుకునేది కాదు. తల్లిదండ్రులిద్దరూ వంశీ గురించి పట్టించుకోక పోయేసరికి అతడు మొబైల్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. సెల్ఫీలు తీసుకోవడం, వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులతో చాటింగ్ చెయ్యడం, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని యూ ట్యూబ్‌లో వీడియోలు చూడడం ద్వారా సమయాన్ని వృథా చేస్తున్నాడు. రాత్రుల్లో ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నాడు. రోజంతా బద్దకంగా గడుపుతున్నాడు. ముభావంగా ఉంటున్నాడు. స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు బుర్రకెక్కించుకోవడం లేదు.
* * *
నాలుగు రోజులు గడిచిపోయాయి. ఆ రోజు ఆదివారం. రామచంద్రయ్య, రాంబాబు, జమున ముగ్గురూ వరండాలో కూర్చున్నారు. వంశీకి మార్కులు తగ్గడానికి గల కారణాలను విశే్లషించాడు రామచంద్రయ్య. క్లబ్ కారణంగా రాంబాబు, టీవీ సీరియల్స్ కారణంగా జమున సమయాన్ని వృథా చేస్తున్నారని, వంశీ గురించి పట్టించుకోవడం లేదని, అందువల్ల వంశీ మొబైల్‌తో కాలక్షేపం చేస్తున్నాడని, వంశీకి మార్కులు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పాడు. రామచంద్రయ్య చెప్పింది నిజమేనని తోచింది వారిద్దరికీ.
* * *
మర్నాడు సాయంత్రం వంశీ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కుక్కపిల్ల అరుస్తున్న చప్పుడు వినిపించింది. పరిగెత్తుకొంటూ వచ్చి చూశాడు వంశీ. ఒక చిన్న కుక్కపిల్ల. ఒంటి నిండా తెల్లని బొచ్చుతో, చిన్నచిన్న కళ్లతో చాలా అందంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. వంశీకి దాన్ని చూడగానే చాలా సంతోషం వేసింది.
‘వంశీ! ఈ కుక్కపిల్లను నీకు బహుమతిగా తీసుకొని వచ్చాను’ చెప్పాడు రాంబాబు.
‘చాలా థాంక్స్ నాన్నా!’ అంటూ కుక్కపిల్లతో ఆడుకోవడం మొదలుపెట్టాడు వంశీ. దానికి స్మయిలీ అని పేరు కూడా పెట్టాడు. కొద్దిసేపు దాంతో ఆడుకొన్న తర్వాత వంశీకి మొబైల్ గుర్తుకు వచ్చింది.
‘అమ్మా! స్మయిలీతో సెల్ఫీ తీసుకొని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చెయ్యాలి. నీ ఫోన్ ఇలా ఇవ్వు’ అంటూ తల్లిని అడిగాడు.
‘ఇందాక కుక్కపిల్లను కొనడానికి బజారుకు వెళ్లినప్పుడు మొబైల్ ఎక్కడో పోగొట్టుకున్నాను’ అంటూ బాధను వ్యక్తం చేసింది జమున.
* * *
మరో మూడు నెలలు గడిచిపోయాయి. జమున టీవీ సీరియల్స్ చూడడం మానేసింది. రాంబాబు క్లబ్‌కు వెళ్లడం మానేశాడు. ఇద్దరూ వంశీతో సమయం గడుపుతున్నారు. బద్దకం లేకుండా వంశీ పొద్దునే్న నిద్ర లేచి స్మయిలీని బయటకు తీసుకొని వెళ్తున్నాడు. దాంతో ఆడుకుంటూ ఉత్సాహంగా ఉంటున్నాడు. పొద్దునే్న నిద్ర లేవడం వల్ల చదువుకోవడానికి సమయం కేటాయిస్తూ ఉన్నాడు వంశీ. క్రమంగా అతని ర్యాంక్ మెరుగుపడింది.
రామచంద్రయ్య సలహాతో మొబైల్ ఫోన్ అమ్మేసి, కుక్కపిల్లను కొన్న సంగతి వంశీ దగ్గర దాచిపెట్టారు జమున, రాంబాబు.

-పేట యుగంధర్ 9492571731