బాల భూమి
ప్రకృతి ఒడిలో.(. కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అదో విశాలమైన అడవి.
అందులో ఎన్నో జంతువులతోపాటు అనేక పక్షులూ నివసించేవి. ఒక కొలనుకు సమీపంలో ఉన్న చెట్టుపై కొన్ని పావురాలు స్థావరం ఏర్పరచుకున్నాయి.
అందులో ఓ తెల్ల పావురాల జంట కూడా ఉండేది. వాటికి ఓ పిల్ల పావురం. పేరు గోవిందు. పూర్తిగా నలుపు రంగు. అది అంటే, తల్లికి ఎంతో ముద్దు.
మగ పావురం ఆహార సముపార్జనలో ఉంటే, గోవిందుకు రెక్కలు వచ్చింది మొదలు తల్లి పావురం దాన్ని వెన్నంటే ఉండేది. రెక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఆ చెట్టు మీదే.. ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదికి ఎగిరి దుమికేది. అది పట్టుదప్పి ఎక్కడ క్రింద పడిపోతుందోనని తల్లి.. దాని వెనకాలే కొమ్మకొమ్మకి పిల్లతోపాటు వెళ్లేది.
ముందు నల్లటి పిల్ల పావురం అయితే, వెనకాలే తెల్లటి తల్లి పావురం. గోవిందు రెండడుగులు ముందుకు వేస్తే, తల్లి కూడా రెండడుగులు వేసేది. గోవిందు ఎందుకైనా ఆగిపోతే, తల్లి పావురం కూడా ఆగిపోయేది. మిగిలిన పక్షులకూ, జంతువులకూ ఆ దృశ్యం ఎంతో అపురూపంగా ఉండేది.
‘మరీ ఇంత గారాబమా’ అన్నట్లు నవ్వుకునేవి.
ఇంకాస్త రెక్కలు సాగడంతో ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు ఎగిరేది. అయినా, తల్లి కంటికి రెప్పలా కాపలా కాసేది.. వెనుకే ఉండి. ‘ఏం చెయ్యను. మా గోవిందుకు అల్లరి ఎక్కువ’ అని తోటివాళ్ల దగ్గర కొడుకు గొప్పలు చెప్పుకుని మురిసిపోయేది.
ఈ నేపథ్యంలో పిల్ల పావురానికి స్నేహితులూ ఏర్పడ్డారు. రంగ, జ్యోతి, సూరి, గోపి. అందులో వయసులో కాస్త పెద్దది అయిన ‘సూరి’ బోలెడు సంగతులు చెప్పేది.
గోవిందు తను ఆహారం తను సంపాదించుకునే స్థితికి వచ్చింది. క్రిమికీటకాల్ని తిని.. స్వేచ్ఛగా విహరించే వయసుకి వచ్చేసరికి.. దానికి ఓ ఆలోచన వచ్చింది.
పక్షులనేవి అడవిలోనే కాదు మనుషులు తిరిగే జనావాసాలైన పట్టణాల్లో కూడా ఉంటాయని.. పట్టణాల్లో చెట్లన్నీ ఇళ్లూ, వంతెనలూ, ప్రాజెక్టులూ కట్టే నెపంతో కొట్టేస్తున్నారనీ, చెట్లు లేనప్పుడు పక్షులు ఎక్కడ గూళ్లు కట్టుకుంటాయి? ఎలా నివసిస్తాయి? అన్న సందేహం కలిగి.. విషయం తెలుసుకోవాలన్న కుతూహలమూ కలిగింది.
ఆలోచన వచ్చిందే తడవుగా స్నేహితులకు ఈ విషయం చెప్పింది. అంతే, వాటికీ పట్నం చూడాలని అనిపించింది. అంతా కలిస్తే పది మంది ఉన్నారు.
గోవిందు తల్లీ ‘వద్దు నాయనా! అంత దూరం మీరు ఎగరలేరు’ అంటూ అభ్యంతరం చెప్పింది. మిగిలినవి అన్నీ కూడా అభ్యంతరాలు చెప్పాయి.
అయినా అన్నీ కలసికట్టుగా అలిగి మంకుపట్టు పట్టాయి. దాంతో వొప్పుకోక తప్పింది కాదు పెద్ద పక్షులకు. ‘పోనీలే లోకం పోకడ తెలుస్తుంది’ అనుకుంటూ పంపాయి.
‘రెండు రోజుల్లో తిరిగి వచ్చేయ్యాలి’ అంటూ నియమం పెట్టాయి.
* * *
మరునాడు సూర్యోదయానే్న అవి అన్నీ ఉత్సాహంగా బయలుదేరాయి.
వాళ్లందరికీ గోవిందే నాయకుడు. ముందు అది ఎగిరితే, తరువాత మిగిలినవి వయసుల వారీ వరుస క్రమంలో అనుసరించాయి.
వాళ్లుండే పచ్చని అడవిని దాటుకుని, కొండ కోనల్నీ, వాగులూ వంకల్నీ దాటుకుని.. ఎక్కడో గాని చెట్లు కనపడని, పట్నం అనబడే జనావాసాలకు చేరుకున్నాయి. అక్కడ కార్లూ, వాహనాలూ లెక్కకు మిక్కిలిగా తిరుగుతున్నాయి. వాటి నుంచి దుమ్మూ ధూళి ఎక్కువగా వెలువడి ఊపిరి ఆడనట్లు అయ్యింది.
అన్నీ ఆకాశాన్నంటే కట్టడాలు, ఎతె్తైన అపార్ట్మెంట్లే. చెట్లకన్నా ఎత్తుగా ఉండటంతో చిలుకలూ, పావురాలూ, కాకులూ, అన్నీ ఆ ఇళ్ల పైభాగానే్న విశ్రాంతిగా కూర్చుని సేదతీరుతున్నాయి.
అంత పై భాగాన మనుషులు ఉండకపోవడంతో వాటికి ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు, అక్కడంతా కలియ తిరుగుతున్నాయి.
ఇంతలో అంతే ఎత్తున్న.. పక్కింటి మేడ పైకి ఎవరో వచ్చి కాసిన్ని నూకలూ, సజ్జలు చల్లి వెళ్లారు. అంతే, ఇవి అన్నీ వాటి కోసమే ఎదురుచూస్తున్న వాటిలా గోలగోలగా అరుస్తూ.. ఒక్కసారిగా ఎగిరి వెళ్లి, ఆ ఇంటి మీద వాలిపోయాయి. అంతే హడావుడిగా వాటిపైబడి తినసాగాయి.
ఆ గింజల్ని చూడగానే, గోవిందు బృందానికీ ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది.
అంత దూరం ప్రయాణం చేసి వచ్చాయేమో! దప్పిక తీర్చుకోవడానికి ఎక్కడా ఓ నీటి చెలమ కూడా కనిపించలేదు.
‘మనమూ వెళదాం’ అనుకుంటూ...
ఎగిరి వెళ్లి వాటితో పాటు కలిసి తినబోతుండగా గుర్రుగా అడ్డుకుంది ఓ పట్నం చిలుక. కొత్తగా వచ్చిన వాటిని ముక్కుతో పొడిచి, గుంపు నుంచి చెదరగొట్టింది.
చిలకలు ‘క్రీంచ్.. క్రీంచ్’ మంటూ గోలగోలగా నూకల పైన ఎగరసాగాయి. ఎర్రని ముక్కు కలిగిన ఆకుపచ్చని చిలుకలు అందానికే అందం అయితే, వాటి అరుపు మాత్రం భయంకరం. ఆ అరుపే భయపెట్టింది వాటిని. ముందుకు వెళ్లే సాహసం చెయ్యలేదు.
నూకలు జల్లిన వాళ్లు.. అక్కడే ఓ మట్టి పాత్రతో నీళ్లు పెట్టడం కొంత ఉపశమనం కలిగించింది. అలా ఆ పూట గడిచినా ఎండ వేడికి ఉక్కబోతను తట్టుకోలేక పోయాయి. పట్నంలో పచ్చదనం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తుంది.
అయినా కనపడిన వేప చెట్టుని ఆశ్రయించాయి. వాహనాల రొద ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అక్కడికి దగ్గరలో ఓ ఎతె్తైన సెల్ టవర్ వాటిని ఆకర్షించింది. అంత పొడుగైన నిర్మాణాన్ని ఎప్పుడూ చూసి ఉండలేదు. ‘దగ్గరగా వెళ్లి చూద్దాం.. రండి! దాని పైకి ఎక్కామంటే, ఊరంతా కనిపిస్తుంది’ అంటూ చెప్పింది సూరి.
అనుకున్నట్లుగానే, అవి అన్నీ టవర్ పైకి ఎక్కి ఊరిని చూస్తూ ఆనందంతో గంతులు వేశాయి. అంత పైకి ఎక్కితే పట్టణం అంతా కనిపించడమే కాదు. అలాంటివి ఇంకా చాలా టవర్లే కనిపించాయి. వాటికి ప్రపంచాన్ని జయించినంత సంతోషం అనిపించింది.
అయితే, కొంతసేపటికి వళ్లంతా మంట పుట్టినట్లు అయి, ఎంతోసేపు అక్కడ ఉండలేక పోయాయి. అక్కడి పక్షులు ఆ టవర్లకు దూరంగా ఉండడం కూడా గమనించాయి.
* * *
ఆ రాత్రి వాన పడింది.
అన్నీ తడిసి ముద్దయ్యాయి. గూటిలో వెచ్చదనం లేదు. తెల్లవారేంత వరకూ అభద్రత వెన్నాడింది. స్వచ్ఛమైన ప్రకృతిని వదిలి రావడంలో ఉన్న కష్టం తెలుసుకున్నాయి.
సెల్ టవర్లు ప్రసరించే రేడియేషన్‌కు పిచ్చుకలూ, కొన్ని కీటకాల జాతులు అంతరించిపోయాయని.. మనుషులు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం ప్రకృతికీ, పర్యావరణానికీ హానికరం అయిన కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడని అర్థమయ్యింది.
పట్నంలో.. పక్షి ప్రేమికులు ఉన్నంత వరకూ.. తమలా వాటికి ఆహారం వెతుకులాట లేదనీ, కష్టపడకుండా ఆహారం దొరకడంతో అవి తమకన్నా బాగా బలంగా, లావుగా ఉండి.. సోమరితనం పెరిగి.. ఎక్కువ దూరం కూడా ఎగరలేక పోవడం గమనించాయి.
పగలంతా.. ఎతె్తైన కట్టడాల రెయిలింగుల క్రింద, కిటికీ గూళ్లలోనూ ఎండకీ, వానకీ తట్టుకుంటూ జీవనం సాగించడం చూశాయి.
కన్న తల్లీ, ఉన్న ఊరు ఎప్పటికీ మరువలేవని గ్రహించి.. గడువు కన్నా ముందే తిరుగు ముకం పట్టాయి తమ చల్లని ప్రకృతి ఒడిలోనికి.