బాల భూమి
ఎందుకు నవ్వాడు? (కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇంద్రసేన మహారాజు సభలో న్యాయ విచారణ చేస్తున్నాడు. నేరస్తులను విచారించి, మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ శిక్షలు విధిస్తున్నాడు.
‘మహారాజా! ఇతని పేరు భూమయ్య. నారాయణ కొట్లో బియ్యం మూట దొంగిలించాడు’ అన్నాడు కొత్వాలు.
‘్భమయ్యా! ఏమంటావ్? నేరం చేశావా?’ అని రాజు ప్రశ్నించాడు.
‘మహారాజా! నాది బేతవరం అనే ఊరు. మూడేళ్లుగా వానలు కురవడం లేదు. పంటలు లేవు. ఏదైనా పనీపాటా చేసుకుందామని ఈ నగరానికి వచ్చాను. నారాయణ కొట్టు దగ్గరికి పది బండ్లు బియ్యంతో వచ్చాయి. అవన్నీ దించి లోపల వేస్తే ఒక బస్తా బియ్యం ఇస్తానన్నాడు. నేను ఆ పని చేశాను. బియ్యం మూట ఇవ్వమని అడిగాను. కాని నారాయణ పేచీ పెట్టాడు. కొట్లో చోటు చాలలేదనీ, పక్కనే వున్న గిడ్డంగిలోకి కొన్ని బస్తాలు మోయమన్నాడు. మొదట ఆ పనికి నేను ఒప్పుకోలేదు గనుక చెయ్యనన్నాను. నారాయణ బియ్యం ఇవ్వనన్నాడు. నేను న్యాయంగా రావాల్సిన బియ్యం మూట తీసుకుపోతుంటే నారాయణ గొడవ చేసి రక్షక భటులను పిలిపించి దొంగతనం చేస్తున్నానని అబద్ధం చెప్పాడు’ అని వివరించాడు భూమయ్య.
‘్భమయ్యా! నీకు అన్యాయం జరిగితే కొత్వాలు ఠాణాకు పోయి నారాయణ మీద ఫిర్యాదు చేయాలి. అంతేగాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యంగా బియ్యం మూట తీసుకెళ్లడం తప్పు. కాబట్టి నీకు వారం రోజులు కారాగార శిక్ష విధిస్తున్నాను’ అన్నాడు రాజు.
భూమయ్యకు శిక్ష అమలుపరచవలసిందిగా కొత్వాలుతో చెప్పాడు రాజు.
అప్పుడు సభలో వున్న గోపయ్య పకపకా నవ్వుతూ సభ నుంచి నిష్క్రమించాడు. గోపయ్యకి మతిస్థిమితం లేదు. అందరూ పిచ్చివాడంటారు అతన్ని.
రాజు అవాక్కయ్యాడు.
‘సభికులారా! ఆ గోపయ్య భూమయ్య శిక్ష అమలు చేయమని చెప్తే, ఎందుకు పకపకా నవ్వాడు? రేపు సభలో సరైన జవాబు చెప్పిన వారికి వంద బంగారు నాణెలు బహుమతిగా ఇస్తాను’ అని ప్రకటించాడు రాజు.
* * *
మర్నాడు సభలో చాలామంది రకరకాల కారణాలలు చెప్పారు. కాని రాజుకి సంతృప్తి కలగలేదు. మంత్రులను అడిగాడు ‘గోపయ్య ఎందుకు నవ్వాడు?’ అని. వాళ్లు ఏవేవో చెప్పారు. ‘పిచ్చివాడి నవ్వుకి కారణం కూడా ఉంటుందా?’ అని కొందరు అన్నారు.
చివరగా ఆస్థానకవి నీలకంఠంని అడిగాడు రాజు.
‘మహారాజా! మీరు శిక్ష అమలు చేయమని కొత్వాలుతో అన్నందుకు గోపయ్య నవ్వాడు’ అన్నాడు కవి.
‘అందులో నవ్వడానికి ఏముంది?’ అని ప్రశ్నించాడు రాజు.
‘కారణం ఉంది ప్రభూ! కొత్వాలు పెద్ద దొంగ. వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నా, వాళ్లని బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తాడు. దొంగతనం చేసిన దొంగల దగ్గర తన వాటా పుచ్చుకుని వదిలేస్తాడు. అటువంటి అవినీతి పరుడైన కొత్తావలు కూడా దొంగే కదా? అటువంటి దొంగ మరొకర్ని దొంగ అంటూ శిక్షించడానికి అర్హత ఉంటుందా? అని గోపయ్య నవ్వాడు’ అని నీలకంఠ కవి చెప్పాడు.
రాజు సంతోషించి కవిగారికి బహుమతి ఇచ్చి కొత్వాలుని శిక్షించాడు.