బాల భూమి

ముందు చూపు( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ భారతంలో ఒక అందమైన రాజ్యం పద్మపురి. ఈ రాజ్యంలో సుఖశాంతులకు పాడి పంటలకు విద్యా వ్యాపారాలకు కళలకు కళాకారులకు వీరులకు కొదువలేదు. ఆ రాజ్యానికి రాజు జ్ఞానవర్మ. మంత్రి కేశవనాథుడు మరియు సేనాపతి ధీరనాయకుడు. రాజు సునిశిత రాజకీయ వ్యూహం మరియు మంత్రి యొక్క దూరదృష్టి, పరిపాలనా దక్షత, న్యాయ నిర్ణయం, ఇక సేనాపతి యొక్క అనితర స్వామిభక్తి, సుశిక్షితులైన సైన్యం, వెరసి పద్మపురి ఒక బలమైన రాజ్యంగా గుర్తించబడ్డది. పద్మపురి రాజ్య సంపన్నత పొరుగు రాజులకు ఈర్ష్య కలిగిస్తూ వుండేది.
ఇలా ఉండగా.. కొంత కాలం నుంచీ పద్మపురి రాజు జ్ఞానవర్మ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ నిర్లిప్తతగా ఉండడం పరివారాన్ని, ప్రజలని కలవరపెట్టసాగింది. ముఖ్యంగా రాణీగారు రాజులో ఈ మార్పుని ముందు గమనించింది.
రాణిగారి ఆదేశాల మేరకు ఒక రోజు మంత్రి కేశవనాథుడు ఏకాంతంగా రాజుగార్ని కలిసి ‘రాజా! గత కొంతకాలంగా మీరు అన్యమనస్కంగా ఉంటున్నారు. మీరేదో క్షోభకు గురవుతున్నట్టు తోస్తున్నది. మీ ఆంతరంగిక సమస్యలు మాకు తెలియవు కానీ, రాజ్యపాలన పరంగా నాకు తెలిసీ ఎటువంటి సమస్యలు లేవు. పొరుగు రాజ్యాల వలన ఏనాడూ మనకు భయం లేదు. ఇకపోతే పాడిపంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. రాజ్యంలో ఎక్కడా నేరాలు జరగడం లేదు. విద్యా వైద్య రంగాలు బాగానే వున్నాయి. మరి తమరి చింతకి కారణమేమిటి? దయచేసి తెలుపండి’ అని అన్నాడు.
దానికి రాజు దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘మహామంత్రీ.. మీరన్నట్లు ప్రస్తుతం మన రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు ఆనందంగా ఉన్నారు. మాకు కూడా ఆంతరంగిక సమస్యలు ఏమీ లేవు. కానీ రాబోయే కాలంలో మన రాజ్యంలో ఏర్పడబోయే కొన్ని ప్రతికూల పరిస్థితుల గురించి ఊహిస్తుంటే, మనసు కొంచెం కలత పడుతున్నది’ అని జవాబిచ్చాడు.
‘ఏ ప్రతికూల పరిస్థితులు మీరూహిస్తున్నారు రాజన్?’ అని మంత్రి ప్రశ్నించాడు.
ఒక లిప్తపాటు ఆలోచించి ‘అమాత్య శేఖరా! గత మాసంలో మీరు, నేను మారువేషాలతో రాత్రి నగర సంచారానికి బయలుదేరాం. ఆ రాత్రి మీరు గమనించే ఉంటారు. నాలుగైదు ప్రదేశాలలో యువకులు జూదమాడుతూ, అనవసరమైన చర్చలతో కాలక్షేపం చేస్తూ కనిపించారు. అలాగే చాలా ఇళ్లల్లో అరుగుల మీద నిదురపట్టక నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ ఉన్న వయోవృద్ధులు కూడా కనిపించారు. ఈ రెండు సంఘటనలూ విశే్లషించి చూస్తే..’ సాలోచనగా మంత్రి వైపు చూసి ఆగాడు జ్ఞానవర్మ.
‘సెలవీయండి ప్రభూ’ అన్నాడు మంత్రి.
‘నాకు స్ఫురించినదేమిటంటే.. మన రాజ్యంలో వృద్ధులకు తగిన వసతి, పోషణ ఉన్నప్పటికీ వారి వయసుకు తగిన ఆదరణ, ప్రాముఖ్యత పొందలేక పోవడం వారి ఉదాసీనతకి కారణం కావచ్చు. అలాగే యువతకి చేతినిండా పని, మస్తిష్కం నిండా ఆలోచనలు లేక జీవితం పట్ల ఒక తేలిక భావంతో బతికేస్తున్నారు’ రాజు తెలిపాడు.
‘నిజమే ప్రభూ! కానీ జరా మరణాలను మనం నియంత్రించలేము కదా! ఇకపోతే, యువకుల మాటకొస్తే, వారికి ఉపాధి అవకాశాలను కల్పించి సమస్యను కొంతవరకు పరిష్కరిద్దాం’ అని తన అభిప్రాయం వెలిబుచ్చాడు మంత్రి.
‘మంత్రిగారూ.. నిజానికి మీరు సూచించిన పరిష్కార మార్గాలు తాత్కాలిక ఫలితాలు ఇవ్వగలవు. కానీ.. నేను ఆలోచిస్తున్నది ముందు తరాల గురించి. ఒక ఎనభై ఏండ్ల వృద్ధుడిని తీసుకుందాం. అతడు తన జీవిత కాలంలో మొత్తం అనుభవాన్నంతా రంగరించి ఎంత జ్ఞాననిధిని సంపాదించి ఉంటాడు? అదేదయినా కావచ్చును.. వేద విజ్ఞానం, వైద్యం, సంగీతం, నాట్యం, తర్కం, శిల్పకళ, చిత్రకళ, సాంకేతిక పరిజ్ఞానం. ఆ జ్ఞానం, నైపుణ్యత ఆ వృద్ధునితోపాటు అంతమై పోవలసిందేనా? ఈ జ్ఞానమంతా ముందు తరాలకు చేరాలి కదా! ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది జ్ఞానం. ఇక యువత ఏ కళా సాధన చేయక, ఏ పాటవమూ లేక వారి సమయం వృథా చేసుకుంటూ పోతే ఇక భవిష్యత్తరాలకు మిగిలింది ఏమిటి? శుష్క జీవనం తప్ప!’ అని తన ఆవేదన వెలిబుచ్చాడు రాజు.
విషయం అర్థమైన మంత్రి రాజుగారితో సంప్రదించి తన ప్రణాళికను ఈ విధంగా అమలుచేశాడు. మరునాడు నగరంలో చాటింపు వేయించి యువకులందరినీ సమీకరించి, సమావేశపరచి జీవిత విలువలు, సంస్కృతీ సంప్రదాయాలను, కళలను ఏ విధంగా పదిలపరచుకుని ముందు తరాలకు అందజేయాలి అన్న విషయంపై నిష్ణాతులైన వ్యక్తుల ద్వారా ఉపన్యాసాలిప్పించాడు. యువతని కర్తవ్యోన్ముఖులుగా చేశాడు. అలాగే వయసుడిగిన పాండిత్య ప్రకర్షలు గల విద్వాంసులు, కళాకారుల నందరినీ ఆహ్వానించి వారికి అన్ని సదుపాయాలతో వసతులేర్పరచాడు.రాజుగారు ఆ వృద్ధులను వారి యొక్క జీవనానుభూతులు, అనుభవాలు కలిపి యువతకు శిక్షణ ఇవ్వవలసినదిగా కోరారు. రాజుగారు ఇచ్చిన ఈ ప్రోత్సాహం, గౌరవ మర్యాదలకు వృద్ధులు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్సాహంతో జీవిత చరమాంకంలో దొరికిన ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించి వృద్ధులందరూ వారివారి విద్యలను రాజ్యంలో యువకులందరికీ నేర్పి భావి తరాలకు జ్ఞానగంగను అందించారు. అంతేకాక వారికి తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని గ్రంథాల రూపంలో లిఖించి పదిలపరిచారు. ఆ రాజ్యంలో యువకులు కూడా వారివారి అభిరుచులకు తగ్గట్టుగా విద్యల నభ్యసించి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ విధంగా జ్ఞానవర్మ యొక్క ముందు చూపుతో పద్మపురి రాజ్యం అన్ని రంగాలలో సుభిక్షంగా ఉండడమే కాకుండా రానున్న తరాలకు కూడా కళలను, సంప్రదాయ సిద్ధాంతాలను అందించింది. అంతేకాక వృద్ధులను గౌరవించడం, వారి ద్వారా జ్ఞానసేకరణ అనే వొరవడికి శ్రీకారం చుట్టింది.

-నేరళ్ల వెంకటరావు 81068 00884