బాల భూమి

తెలివైన కొంగ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అడవిలోని నదీ తీరంలో ఒక కొంగల కుటుంబం ఉండేది. పక్కనే అడవి లోపల ఒక నక్క కుటుంబం కూడా ఉండేది. ఆ నక్కలన్నీ నీరు త్రాగేందుకు ఆ నదికి వచ్చేవి. అలా నక్కలకూ, కొంగలకూ స్నేహం కుదిరింది.
కొంగల కుటుంబంలోని అవ్వ ‘తన జాతి’ పిల్లలకు నీతులు బోధించేది. ఎవ్వరికీ ఏ అపకారమూ చేయక వీలైనంత వరకూ సాయం చేయమనీ, ఎవ్వరితోనూ విరోధం పెట్టుకోరాదనీ, అపాయాన్నీ, అవమానాన్నీ ఉపాయంతో జయించాలనీ చెప్పేది.
పిల్ల ‘బకాల’న్నీ అవ్వ చెప్పిన పాఠాన్ని బాగా విని మనసులో పెట్టుకుని ఆచరించేవి. ఒక రోజున పైవాలున వానలు పడి నీటి ప్రవాహానికి చాలా చేపలు కొట్టుకొచ్చాయి. కొంగలన్నీ చాలా చేపలను పట్టుకుని తిని హాయిగా విందు చేసుకున్నాయి. అప్పుడే అక్కడికి ఆకలితో వచ్చిన నక్కల కుటుంబం సంతోషంగా చేపలను పట్టుకు తింటున్న కొంగల కుటుంబాన్ని చూసి ఈర్ష్యపడ్డాయి.
వాటికి ఆ రోజున తినేందుకేమీ దొరకలేదు. అవ్వ కొంగ, నక్కల ఆకలి చూపులు గమనించి పిల్ల కొంగలకు ‘బిడ్డల్లారా! మన నక్క మిత్రులు ఏమీ తినక ఆకలితో ఉన్నట్లున్నాయి. తలా కొన్ని చేపలు పట్టి గట్టు మీదకు విసిరేయండి. పాపం వాటి ఆకలి తీర్చడం మన ధర్మం’ అంది.
వెంటనే కొంగ పిల్లలన్నీ తలా కొన్ని చేపలను పట్టి గట్టు మీదకు విసిరేశాయి. నక్కలన్నీ వాటిని తృప్తిగా ఆకలితీరా తిన్నాయి.
‘్ధన్యవాదాలు ప్రియ మిత్రులారా! మా కుటుంబానికి ఆకలి తీర్చి, విందు చేసినందుకు. మీరేమో నీళ్లలో ఉన్న చేపలను సులువుగా పట్టుకుని తినగలరు. మేమేమో నీటిలోకి దిగలేమాయె. నేల మీద దొరికిన వాటిని మాత్రమే పట్టుకు తినగలం. మీరెంతో అదృష్టవంతులు సుమా!’ అని తండ్రి నక్క చెప్పింది. అన్నీ నీరు తాగి వెళ్లాయి.
ఐతే ఆ నక్క మనసు, దాని ముఖ కవళికల ద్వారా కనుక్కున్న అవ్వ కొంగ ‘బిడ్డల్లారా! మనం చేతనైన సాయం చేయడం తప్ప ఎవ్వరినీ నమ్మకూడదు. అందరి మాటలూ నిజమేననుకోకండి. ఎక్కడికెళ్లినా మన ఆహారం, నీరు మనం తీసుకెళ్లడం ఉత్తమం అని మరువకండి’ అని చెప్పింది.
ఒకరోజున నక్కలన్నీ మంచినీళ్లకు వచ్చినప్పుడు తండ్రి నక్క ‘కొక్కెర కుటుంబమా! రేపు మా బిడ్డ పుట్టినరోజు. మీరంతా విందుకు రండి. పాయసం వండుకుంటున్నాం’ అని పిలిచింది.
అవ్వ ‘బకం’ -అందరం రాలేములే జంబూకమా! మా పెద్ద మనవడు వస్తాడు విందుకు. వాడికి పాయసమంటే చాలా ఇష్టం’ అని చెప్పింది.
మరునాడు యువ ‘కొక్కెర’ అడవికి విందుకు బయల్దేరింది - ఒక సంచీ మెడకు తగిలించుకుని.
ఇంటి పెద్దైన ‘నక్క’ ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకెళ్లింది. అంతా విందుకు కూర్చున్నారు. అందరికీ వెడల్పైన పళ్లాల్లో పాయసం వడ్డించింది తల్లి నక్క.
అంతా వేడివేడి పాయసం నాలుకతో నాకి, జుర్రి చప్పరించసాగాయి. కొంగపిల్ల కేసి చూసి తండ్రి నక్క ‘విందారగించు చిన్నారి మిత్రుడా! పాయసం చేయడంలో మా ఆవిడ అందెవేసిన చేయి’ అంది పాయసం నాకుతూ.
వెంటనే యువ ‘బకం’ తన సంచీ తెరిచి తాను కానుకగా ఒక కూజాలో తెచ్చిన ఎండు చేపల సరం అక్కడ ఉంచి, కూజాలో పాయసం పోసుకుని పొడవాటి ముక్కుతో సర్రున జుర్రుకుని ‘మేము పాతకాలం కొంగలం కాదు. మాకూ ఉపాయాలు తెలుసు. ధన్యవాదాలు మీ పాయసం విందుకు’ అని చెప్పి చటుక్కున ఎగిరిపోయింది.
విందుకు పిల్చి అవమానించి, సంతోషించాలని చూసిన ‘నక్కల నాయకుడు’ సిగ్గుతో తలవంచుకుంది.
నీతి: ఉపకారం చేసిన వారిని అవమానించడం పాపం. అపకారికి కూడా ఉపకారం చేయడమే ధర్మం. ఎల్లప్పుడూ జాగ్రత్తలో ఉండి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే స్థితిలో ఉండాలి.

-ఆదూరి హైమావతి