బాల భూమి

లంకెబిందెల రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవాపురంలో సోమరితనానికి మారుపేరైన వేణు అను కుర్రవాడు వుండేవాడు. ఏకైక సంతానమైన అతనికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుణ్ణి చేయాలన్నది తండ్రి సుందరయ్య ఆశ. కానీ వేణు ఎప్పుడూ ఆటలతో, ఊరి వాళ్లతో పేచీలు పెట్టుకుంటూ తిరగటం, పంతుళ్లను లెక్కచేయకుండా బడికి వెళ్లక మారాం చేస్తూ, తండ్రి ఆశల్ని అడియాసలు చేయసాగాడు. అయితే మనవడి మీదున్న ఇష్టంతో కొడుకు, కోడలు వేణును గద్దించిన ప్రతిసారీ వేణు తాత వెనకేసుకొచ్చేవాడు. సుందరయ్య తండ్రిని విసుక్కుంటూ ‘నీ గారాబమే వాడ్నిలా మార్చింది నాన్నా’ అని నిష్ఠూరమాడేవాడు.
ఒకరోజు వేణు తాతగారి ఆరోగ్యం క్షీణించి ఆయన కొనప్రాణంతో ఉండగా, మనవడితో ఏకాంతంగా మాట్లాడాలని అన్నాడు. అందరూ బయటకు వెళ్లాక ‘చూడు మనవడా.. మీ నాన్న నిన్ను ఏమన్నా ఇన్నాళ్లూ ఎందుకు వెనకేసుకొచ్చానో తెలుసా? నీకు చదువు రాకున్నా ఫర్వాలేదు. మన అటక మీద తాళపత్రాల్లో మన పూర్వీకులు ఇంటిలోనో, మరి పొలంలోనో దాచిన లంకెబిందెల రహస్యం రాయబడి ఉంది. అది నీకు చెంది నువ్వు సుఖశాంతులతో హాయిగా వుంటావని. కానీ, ఒక్క మాట ఈ సంగతి మరెవరికీ చెప్పకూడదు. చెబితే అవి విషసర్పాలుగా మారిపోతాయి. అందులో రాసినది కేవలం ఎవరికీ చూపకుండా నువ్వే చదివి తెలుసుకోవాలి’ అని చెప్పి కన్నుమూశాడు.
ఆ రోజు నుంచీ వేణుకి కలలో ఇలలో లంకెబిందెలే కనపడసాగాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అటకెక్కి చూస్తే, ట్రంకుపెట్టె నిండా తాళపత్రాలు కనిపించాయి. కానీ, చదువు రాక చదవలేకపోయాడు. మర్నాటి నుంచీ బడికి వెళ్లి చదువుకోవటం మొదలుపెట్టాడు. అది చూసి తండ్రి సుందరయ్యతోబాటూ తల్లి అన్నపూర్ణమ్మ కూడా ఆశ్చర్యపోయి సంతోషించింది.
అత్యంత శ్రద్ధతో పాఠాలు నేర్చి, తక్కువ సమయంలోనే వేణు తాళపత్రాలన్నీ తిరగేసేశాడు. అతనికి ఏ లంకెబిందెల రహస్యం తెలియలేదు. అయినా విద్య వల్ల వచ్చిన వినయంతో తాతగారిని నిందించకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయగానే అతనికి ఊరి జమీందారుగారి దివాణంలో మంచి ఉద్యోగం లభించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద భవనం కట్టుకుని కుటుంబాన్ని అక్కడికి తరలిస్తున్న సమయంలో తాతగారు భద్రంగా దాచుకునే చిన్న చెక్కపెట్టె కనిపించగా మూత తీసి చూశాడు. అందులో తెల్లని రుమాలు మీద ఇలా రాసుంది. ‘క్షమించు మనవడా.. నీకు నా మీద పీకలమొయ్యా కోపం ఉందేమో లంకెబిందెలు లేవని తెలిసి. కానీ, అల్లరిచిల్లరిగా తిరిగే నీకు చదువు నేర్పాలని అలా చెప్పారు. మనిషికి ‘విద్య-వినయం’ అన్నవే నిజమైన లంకెబిందెలు. నీవు వాటిని సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తూ ప్రేమతో నీ తాతయ్య’ అని రాసుంది.
బుద్ధి కుశలతతో తనను మంచి మార్గంలోకి నడిపిన తాతగారిని మనస్ఫూర్తిగా తలచుకుని, ప్రతి సంవత్సరం తన తాతగారి సంవత్సరీకానికి కొందరు పేద విద్యార్థులకు కొత్త పుస్తకాలు కొనిపెడ్తూ హాయిగా జీవించాడు వేణు.

-డేగల అనితాసూరి