లోకాభిరామం
దొంగను పట్టండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొండ కొమ్మున ఒక ఇల్లు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. అందులో ఒకతను దొంగ. ఇప్పుడు దొంగతనాలు మానుకుని హాయిగా బతుకుతున్నాడు. బయట ఎక్కడో అచ్చం అతని తరహాలోనే దొంగతనం జరిగిందని పోలీసులు అతని కోసం వస్తారు. ఇంట్లోని ఇద్దరు కనిపించి, కనిపించకుండా పోతారు. పోలీసులు వేచి ఉంటారు. అంతలో ఇంటి నుంచి కారు ఒకటి వేగంగా బయలుదేరిపోతుంది. పోలీసులు అందరూ, ఉండేది ముగ్గురే అనుకుంటా, వెంటపడి తరుముతారు. దొరికిన తరువాత చూస్తే కారు నడుపుతున్నది ఒక ముసలి ఆడమనిషి. ఆమే ఇంట్లో ఉండే రెండవ మనిషి. వంట మనిషి, పనిమనిషి, ఎన్నయినా ఆవిడే. ఈలోగా మన దొంగ మెల్లగా జారుకుని ఒక బస్ ఎక్కుతాడు. పోలీసులు బస్ పక్కనుంచి పోతారు. కానీ అనుమానించరు.
ఇంతకూ ఏమిటిదంతా? ఒకానొక సినేమాలోని ఓపనింగ్ సీక్వెన్స్. నేను ఆ సిన్మా చాలాసార్లు చూచాను. హాల్లో కాదు. నా పడక గది కం ఆఫీసులోని కంప్యూటర్‌లో. నా మానిటర్ చాలా పెద్దది. చిన్న టీవీ కంటే పెద్దది. ఈ మధ్యన ‘టు కాచ్ ఎ తీఫ్’ అనే ఈ సినిమా చూచి చాలా నాళ్లయింది. అప్పుడు నాకు దీని గురించి అందరికీ చెపితే బాగుండును కదా అనిపించింది. సీన్మా గురించి ఆశలు రేపి ఊరుకుంటే సరిపోతుందా? నాలాగే అందరూ దాన్ని చూచే అవకాశము ఉండవలె గదా? కనుక యూట్యూబ్‌లో వెతికితే దొరికింది. కానీ సినిమా పూర్తిగా లేదన్నారు. చివరలో కొంత కట్ అయిందట. కనుక లాభం లేదు. అయినా ఆ కొంచెం ముక్క లేకుంటే సంగతి అర్థం కాకపోతుందా? అనిపించి ప్రస్తుతం ఈ ముక్క రాయడం!
ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ అనే పేరు వినే ఉంటారు. వినకుంటే, ఇప్పుడు వినండి. అనండి. అతను సినుమాలు తీయడంలో అందెవేసిన చెయ్యి! (అంటే ఏమిటో? అందె అంటే గజ్జె, మువ్వ, గలగలమంటుంది. గొప్ప పని చేసిన వారి చేతికి అందె వేసేవారన్న మాట!) అయితే, ఆయన శీన్మలు, మూగ వాటితోబాటు, కొంచెం భయంకరంగా ఉంటయి. ఆయన అపరాధ పరిశోధన చిత్రాలు తీస్తడని వేరుగ చెప్పనవసరం లేదు. ఈ ‘దొంగను పట్టడానికి’ అనే పిక్చర్స్‌కు చేరేసరికి రంగులు వచ్చేసినయి. ఏమనిపించిందో తెలియదు గానీ, బొమ్మ తీయడానికి హిచ్‌కాక్ ఏకంగా ఫ్రెంచ్ రివియేరా అనే అందాల ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఇక సముద్రం, కొండలు, తోటలు మొత్తమంతా కన్నుల పండుగే!
అసలు అందరమూ మూవీలు ఎందుకు చూస్తాము. సరదాగా కాలక్షేపం చేసేటందుకు గదా! అటువంటి చోట మళ్లీ బాధలు, బంధనాల బదులు సరదా సంగతులు ఉంటే బాగుంటుంది కదా! అపరాధ పరిశోధనను కూడా సరదాగా చూపించవచ్చు గదా! ఆ ప్రయత్నం చేసి హిచ్‌కాక్ హిట్ కొట్టాడు. సినిమా పిచ్చిపిచ్చిగా ఆడింది! అందరూ భలే అన్నారు. కొందరు మాత్రం ఇదేమిటి అన్నారు. కాలమిస్టుగా పేరు పొందిన ఆర్ట్ బుక్ వాల్డ్ ఏకంగా కథా సంగ్రహం రాశాడు. అది నెట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే చదవండి.
అసలు విషయానికి వస్తే కథానాయకుడుగా, నటించినది కారీ గ్రాంట్ అనే అందాల నటుడు. కొంచెం పెద్ద వయసే అయినా చలాకీగా ఉంటాడు. ఒకప్పటి దొంగ అంటే అవును అనిపించేలాగ ఉంటాడు. కథానాయిక గ్రేస్ కెల్లీ. ఆమె అందాల నటి. నగలు, దొంగతనాలు అంటే వ్యవహారం మొత్తం ధనవంతుల మధ్యన నడుస్తుంది. అంతా చూడముచ్చటగా ఉంటుంది. కనుక సరదాగా ఫిల్మ్‌ను చూడవచ్చు.
ఎందుకోగానీ, కథ చెప్పాలని అనిపించడం లేదు. దొంగను పట్టుకోవాలంటే మరో దొంగవల్లే అవుతుంది. అది అందులో సూత్రం. గ్రాంట్ దొంగ కాదు. ఆ మాట చెప్పినా సస్పెన్స్ పాడుగాదు. ఆ సంగతి నిజానికి ముందే అర్థం అవుతుంది కూడా! మరి దొంగ ఎవరు? వీరోయిన్ అనే హీరోయిన్ అనే ఈరోయిన్‌గారా? ఏమోఁ! చెపితే ఏం బాగుంటుంది? కథానాయకుడే అయి ఉండవచ్చు.
హిచ్‌కాక్ మనలను అడుగడుగునా ప్రశ్నలలో ముంచెత్త గలుగుతాడు. ఆ పనే చేశాడు కూడా! గ్రాంట్‌ను మొత్తం క్యాట్ అంటూ ఉంటారు. ఇంగ్లీష్‌లో పిల్లి దొంగ అని ఒక మాట ఉంది. అంటే చడీ, చప్పుడు లేకుండా వచ్చి దోచుకుపోయే రకం అని అర్థం. ఈ చిత్రంలో అప్పుడప్పుడు ఒక మియావ్ (మై ఆవూ?) పిల్లిని కూడా చూపుతారు. అనుమానంగా అది తిరుగుతుంటే, మనమూ అనుమానంలో పడిపోతాము.
కంప్యూటర్‌లో ఉన్న సినిమాను చాలాసార్లు చూచానని చెప్పాను గదా! నాకు ప్రతిసారీ, చూచిన వ్యవహారం అన్న భావం రాకుండా, మళ్లీ చూడాలి అనిపించింది. అది రచన గానీ, కళాఖండం గానీ, ఫిల్మ్‌గానీ, అట్లా అనిపించేట్టు సృష్టించ గలిగితే గొప్ప! నిజానికి రంగుల ఫిల్మ్ పద్ధతి ఆ మధ్యనే వచ్చినట్టుంది. విస్టావిజన్ అనే పద్ధతిలో తీశారట. కెమెరా వ్యక్తికి ఆ కళ యింకా పూర్తిగా పట్టుబడలేదు, అని ఒక సమీక్షలో రాశారు. అక్కడక్కడ కథను సాగదీసినట్టు ఉంది, అని కూడా రాశారు. నాకు మాత్రం అట్లా తోచలేదు. హిచ్‌కాక్ ప్రమాణాలు ఏర్పడి ఉన్నాయి. వాటి ప్రకారం ఈసారి, అనుకున్నట్టు రాలేదేమో?
నేర పరిశోధన గురించి కానీ, కుటుంబ గాథా చిత్రం గానీ హోలు మొత్తం మీద బాగుంది అనడం వేరు. కొంచెం లోతుగా చూడడం వేరు. నాకు ఈ దొంగ సినిమాలో డయలాగులు బాగున్నయి అనిపించింది. హీరోయిన్ తల్లి, హీరోను పట్టుకుని ‘ఏంటి, నీవు మా అమ్మాయికి ఇంకా లైన్ వేయనే లేదు!’ అంటుంది. ‘మా అమ్మాయి మెతక, అందుకు నేనే కారణం’ అని అర్థం వచ్చే మాటలు ఏవో అంటుంది. ‘మొగుడిని కంటే నగలను కౌగిలించుకుని పడుకుంటే బాగుంటుంది’ అంటుంది ఆమె మరో సందర్భంలో!
అన్నట్టు నాకు ఈ మధ్యన సినిమాలు, టీవీ సీరియల్స్ చూడడానికి రెండు కొత్త మార్గాలు దొరికాయి. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. (ఏం గొప్ప కాదు!) ఆయన కూడా నేను మెచ్చే రకం సినిమాలే ఇష్టపడతాడు. (గొప్ప కాదు!) అయితే వాటిని సేకరించి తన కంప్యూటర్‌లో పెడతాడు. (సరే!) ఆ కంప్యూటర్‌లోని సినిమాలను నేను ఇక్కడి నుంచే చూడగలిగే ఆప్ (ఆను వంకరగా పలకాలి) దొరికింది. (ఇది గొప్ప!) మావాని నెట్ ఫ్లిక్స్ అకౌంటును నేను కూడా వాడుకునే వీలు దొరికింది. (గొప్పన్నర!) కనుక టైం దొరికి ఛస్తే కాస్త సరదాగా ఏదో చూస్తున్నాను.
నెట్‌ఫ్లిక్స్‌లో నేను మార్కోపోలో అనే ఒక సీరియల్ మొదటి ఎపిసోడ్స్ కొన్ని చూచాను. కుబ్లయ్‌ఖాన్, యుద్ధం, గుర్రాలు ఎంత ఖర్చు చేసి, ఎంత కష్టపడి తీస్తారో! కానీ కొన్ని అంశాలు మాత్రం నాకు కూడా నిరాశ కలిగించాయి. గుర్రాల దండు వస్తున్నది అనడానికి ప్రళయం అనిపించేంత దుమ్ము చూపించారు. మొత్తం మీద సీరియల్ ఆసక్తికరంగానే ఉంది. మార్కోపోలో గురించి ఇప్పటివరకు ఏమీ చదివి ఉండకపోవడం అందుకు కొంత కారణం అనుకుంటాను. సీరియల్ మూడవ సీజన్ నడుస్తున్నదట. ‘అయినా ఇదేమంత గొప్పది కాదు’ అని సమీక్షలు కనిపించాయి. ఇంకేం చేస్తే బాగుంది, అంటారో? ప్రపంచం మునుపటిలాగ లేదు!
*