క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 28: ఆత్మకూరు మా డాబా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో వడ్డే మహేంద్ర (19) గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. మాల రాజేష్ తీవ్ర గాయాల పాలై ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వడ్డే మహేంద్ర, మాల రాజేష్‌లు ఆదివారం పంపనూరు ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆత్మకూరు మా డాబా సమీపంలో కళ్యాణదుర్గం వైపు నుంచి వస్తున్న పాల వ్యాను ఎద్దుల బండిని తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దాంతో ద్విచక్ర వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు కిందపడి గాయాల పాలయ్యారు. వారిని 108 వాహనంలో అనంతపురంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అందులో వడ్డే మహేంద్ర మృత్యువాత పడగా రాజేష్ గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. ఎస్సై సాగర్ మృతుడి శవానికి పోస్టుమార్టం జరిపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చోరీ కేసులో నిందితుల అరెస్టు
ధర్మవరం, అక్టోబర్ 28: ధర్మవరం పట్టణ పోలీసులు కావడి శ్రీనివాసులు, బండి గంగరాజు అనే ఇద్దరు ముద్దాయిలను ఆదివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 1900 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ అస్రార్‌బాషా తెలిపిన వివరాల మేరకు కల్యాణదుర్గం మండలం కోడిపల్లి గ్రామానికి చెందిన కావడి శ్రీనివాసులు వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతూ సులభంగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలను మొదలుపెట్టాడన్నారు. అయితే ఇతనితోపాటు ఇతని సమీప బంధువు మహేంద్ర, వీరేష్‌లతో కలసి దొంగతనాలు చేస్తూ దొంగలించిన ఆభరణాలను గంగరాజు అనే వ్యక్తికి ఇచ్చి దాచిపెట్టించేవాడు. ధర్మవరం అర్బన్ ఎస్‌ఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో అందిన సమాచారం మేరకు గంగరాజును, శ్రీనివాసులును అరెస్టు చేసి వీరి వద్ద నుండి వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీహర్ష, పోలీసులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య
యాడికి, అక్టోబర్ 28 : మండల పరిధిలోని పెద్దపేట గ్రామానికి చెందిన గంగన్న (46) ఆదివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు లారీ డ్రైవర్‌గా పని చేసే పెద్దపేట గ్రామానికి చెందిన గంగన్నకు ఇద్దరు భార్యలు. దీంతో ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమణించిన బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య
పెద్దవడుగూరు, అక్టోబర్ 28 : మండల పరిధిలోని మల్లెనిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ (21) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారాన్ని ప్రత్యేకాధికారిణి, డిప్యూటీ తహశీల్దార్ సౌజన్య లక్ష్మి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతికి కారణాలు తెలియలేదని ప్రత్యేకాధికారిణి తెలిపారు. తండ్రి ప్రతాప్‌రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.