క్రైమ్/లీగల్

రహదారి రక్తసిక్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఆగస్టు 24 : రహదారి రక్తసిక్తంగా మారింది. పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొడంతో 8 మందికి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 11 మందికి గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి వెళ్లే వారి వాహనాన్ని అరటి గెలలతో ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొనడంతో సుమారు 50 మీటర్ల దూరం వరకు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి బోల్తా పడింది. దీంతో మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. మృతుల అవయవాలు రోడ్డుపై తెగిపడటంతో రక్త ప్రవాహం జరగడంతో రహదారి రక్తసిక్తమయింది. ఆరు మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. క్షతగాత్రులు కూడా అక్కడక్కడ పడిపోయారు. కాగా డ్రైవర్ మద్యం తాగడంతోపాటు అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ప్రధాన కారణమైన బొలేరో వాహనం డ్రైవర్ రాజేష్ మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ఢీకొనడంతోనే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తిమ్మాపురం నుంచి వాహనాన్ని అతివేగంతో నడుపుకుంటూ వస్తుండటంతో తాము రొప్పాల వద్ద వాహనం దిగిపోయామని తిమ్మాపురానికి చెందిన ప్రయాణికుడు గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు మరో ఐదుగురు వాహనం నుంచి దిగిపోయామన్నారు. అలాగే సుద్ధ్భట్టపల్లి వద్ద బస్సు కోసం వేచి ఉన్న ఆ గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి సైతం బొలేరో వాహనం అతి వేగంగా దూసుకెళ్లిందని తెలిపారు.

ఆర్తనాదాలతో దద్దరిల్లిన ప్రభుత్వాసుపత్రి

మృతుల బంధువులతోపాటు క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలు, హాహాకారాలతో ప్రభుత్వాసుపత్రి దద్దరిల్లింది. ఉదయమే రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన తెలుసుకున్న తిమ్మాపురం, లక్సానుపల్లి, పెద్దమంతూరు, చెరుకూరు తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. మృతుల్లో తమ వారు ఉన్నారేమోనన్న అనుమానంతో మృతదేహాలు, క్షతగాత్రులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు ఛిద్రం కావడం, అవయవాలు తెగిపోవడంతో పెద్ద ఎత్తున రక్తం ప్రవహించింది. ఆసుపత్రి ఆవరణ పూర్తిగా రక్తసిక్తమైంది. దీనికి తోడు మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చడానికి, క్షతగాత్రులను పరామర్శించేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆసుపత్రి జనంతో కిక్కిరిసింది.
రెండు గ్రామాల్లో విషాద ఛాయలు
పెనుకొండ, ఆగస్టు 24: మండల పరిధిలోని సత్తార్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రొద్దం మండలం తిమ్మాపురం, లక్సానుపల్లి గ్రామాల్లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. తిమ్మాపురంలోని కురుబ వెంకటస్వామి, కురుబ వెంకటప్ప, వడ్డే ఆంజినేయులు, గొల్ల అంజినేయులు, కురుబ నారాయణప్ప, భీమయ్య ఆరుగురు మరణించడం ఆ గ్రామాన్ని శోకసముద్రంలో ముంచింది. ప్రమాదంలో తమ వారు మృతి చెందారన్న విషయం తెలుసుకొని గ్రామం మొత్తం విషాదంలో నిండింది. అలాగే లక్సానుపల్లికి చెందిన గోపాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డిలు ప్రమాదంలో మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తదానాలు హోరెత్తాయి.
మృతుల్లో ముగ్గురు సోదరులే..
మండల పరిధిలోని సత్తార్‌పల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాపురంకు చెందిన కురుబ వెంకటప్ప, కురుబ వెంకటస్వామి, కురుబ నారాయణప్పలు మృతి చెందారు. వీరు ముగ్గురు సోదరులు కావడం గమనార్హం. ప్రమాదంలో మృతి చెందిన మృతులందరూ రైతులు, వ్యవసాయ కుటుంబీకులే.
డ్రైవర్లు క్షేమం - పరారీ
మండల పరిధిలోని సత్తార్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అరటి గెలల లోడ్ కలిగిన వాహన డ్రైవర్ శివారెడ్డి, తిమ్మాపురం నుండి ప్రయాణీకులతో వెళుతున్న వాహన డ్రైవర్ రాజేష్‌లు ఇద్దరూ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. వారిద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే వారిద్దరూ సంఘటనా స్థలం నుండి పరారయ్యారు.
ఒక్కొక్కరిది ఒక్కో గాథ!
రోడ్డు ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ కుటుంబ సభ్యుల ఆవేదనలు పలువురిని కలచివేశాయి. లక్సానుపల్లికి చెందిన మృతుల్లో రవీంద్రారెడ్డికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెలందరూ కళాశాలల్లో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలు వివాహ వయసుకు రావడం గమనార్హం. వడ్డే ఆంజినేయులుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉండగా పిల్లలు ఇద్దరూ చిన్నారులే. భార్య లక్ష్మమ్మ రోదిస్తూ పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకోమని చెప్పగా మృత్యువాతన పడ్డాడని రోదించింది. మృతుల కుటుంబాలు ఆయా ప్రమాద విషయాలను తెలుసుకొంటూ తీవ్రంగా రోదించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, క్షతగాత్రులైన బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే బీకే పార్థసారధి అన్నారు. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వాసుపత్రి చేరుకొని మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. క్షతగాత్రులను పరామర్శించి ఆత్మస్థైర్యం నింపారు. మృతుల్లో చంద్రన్న బీమా ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, బీమా వర్తించని మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ప్రమాద విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
సంఘటన దురదృష్టకరం
మండల పరిధిలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరగడం తీవ్ర దురదృష్టకరమని ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఏఐసీసీ సభ్యులు కేటీ శ్రీ్ధర్ అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కుటుంబాలకు వైకాపా అండ...
పెనుకొండ మండలం సత్తార్‌పల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు వైకాపా అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పెనుకొండ నియోజకవర్గ సమన్వయ కర్త శంకరనారాయణ తదితరులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.10 వేలు అందించామని, ఒక్కో మృతుల కుటుంబానికి రూ.లక్ష వంతున త్వరలో అందిస్తానన్నారు.