లోకాభిరామం

గతి తప్పిన తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పిన కథ చెప్పకుండా చెపుతున్నాను. కించిత్తు గాత్ర సౌలభ్యం చెడింది, అని కథాకారుడు, పాలు, మిరియాలు అడుగుతాడు. నేను కొన్ని విషయాలను గురించి మాత్రమే అట్టు అటువేసి, ఇటు వేసి అన్నట్టు రాస్తున్నాను. కొంచెం కలం అరిగినట్టు నాకే ఒకోసారి అనిపిస్తున్నది. చెప్పవలసినవి చాలా ఉన్నాయని ఎప్పుడూ అనిపిస్తుంది. ఏం రాయాలి అనే నిర్ణయానికి వచ్చే సమయానికి అనుమానాలు మొదలవుతాయి. ఆదివారంనాడు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. అందులో కొందరు నిజంగా పెద్దవాళ్లు. బాగా రాస్తున్నావు అంటారు. నిజమా అనిపిస్తుంది. రాయాలి అనిపిస్తుంది. నిజానికి ఆలోచిస్తూ పడుకున్నప్పుడు ‘్ఫలానా సంగతి రాస్తే?’ అనిపించడం, లేచి లైటు వేసి, కాగితం ముక్క మీద నాలుగు మాటలు రాయడం, మళ్లీ ఆలోచిస్తూ పడుకోవడానికి ప్రయత్నించడం చాలాసార్లే జరిగింది.
బెల్ బాటం యువత కాలం అని ఒక మాట తోచింది. ఒకప్పుడు ప్యాంట్లు మరీ ఇరుకుగా వేసుకునే పద్ధతి వచ్చింది. అంతకు ముందు లేదా తరువాత గంట పంట్లాము పద్ధతి వచ్చింది. రాజ్‌కపూర్, దేవానంద్, దిలీప్ కుమార్‌ల యుగం వెనుకబడి తర్వాతి వారు వస్తున్న కాలం అది. ఆ సమయంలోనే వచ్చిన జీతేంద్ర (జితేంద్ర అనాలేమో) బెల్ బాటం ప్యాంట్లు వేసుకున్నాడు. శశికపూర్ లాగే చెంగు చెంగున గంతులు వేస్తూ చలాకీ హీరోల పద్ధతికి మార్గం వేశాడు అప్పట్లో. లాగూలు ఎంత వదులుగా, (కింద మాత్రమే) ఉంటే అంత గొప్ప! బెల్ బాటం, ఆ తరానికి ఒక గుర్తు మాత్రమే. రాజేశ్ ఖన్నా పేరున ప్యాంటు మీద లాల్చీలు వేసుకునే పద్ధతి వచ్చింది. అట్లా వేసుకోవచ్చునని అంతకు ముందు వారికి ఎందుకు తోచలేదో అర్థం కాదు! (ఒకప్పుడు ఒక టూత్‌పేస్ట్ బ్రాండ్ కొత్తగా వచ్చింది. అందులో వాళ్లు కొంచెం లవంగం నూనె చేర్చారు. ఇక నోరు మంచి వాసన వచ్చి, ఎంతో బాగుందన్న భావం కలిగింది. ప్రచారంలో ఆ పేస్ట్ కంపెనీ వారు ‘ఇంతకు ముందు ఈ పద్ధతి ఎవరికీ తోచకపోవడం ఆశ్చర్యం’ అని అర్థం వచ్చే మాట వాడుకున్నారు!) ఇది నిజంగా పాత పద్ధతులు పోయి, కొత్తదనానికి దారి అని అప్పట్లో విద్యార్థులుగా ఉన్న మేమంతా అనుకున్నాము.
అప్పటికి ఇంకా ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు లాంటివి దేశంలోకి వస్తాయన్న ఆలోచన కూడా లేదు. రెండు పంచెలుంటే, అంతే నా దశ అనుకునే కాలం. ఈ మాటలతో నేను ఒక కవిత కూడా రాశాను ఆ రోజుల్లో. తెలంగాణ ఉద్యమం ముగిసింది. మా తరం వారికి సంవత్సరాల కాలం వృథా అయింది. చదువుల వ్యవహారం చాలా అన్యాయంగా తయారయింది. అసలు ఎవరికీ చదువుల మీద గౌరవం లేదు. ఉద్యోగాలు దొరుకుతాయన్న నమ్మకం లేకపోవడం, ఒక భూతంలాగ నిలబడి అందరినీ తప్పుదారికి మళ్లించింది. ఆత్మస్థైర్యం అన్న మాటకు అర్థం కూడా తెలియదు. పరీక్షలలో మాస్ కాపీయింగ్ చాలా గొప్ప విషయమని అప్పట్లో అనుకున్న వాళ్లలో నేనూ ఉన్నాను. నేను కాపీ కొట్టడం ఒక పక్కన బెడితే మిగతా వాళ్లకు ఆ పనిలో సాయం చేయడం గొప్పగా తోచింది. అది తప్పు అన్న సంగతి తరువాత చాలా కాలానికి మాత్రమే అర్థమయింది.
తెలివిగలవాడు, బాగా చదువుకుంటాడు అని పేరు ఉండేది. అంతటితో అది ఆగితే బాగుండేది. ఊళ్లో ఏ స్థాయి పరీక్షలు వచ్చినా, మిత్రులు (అనుకున్నవారు) ముందే వచ్చి సాయం చేయాలని అడుగుతారు. పరీక్ష జరుగుతున్న చోటికి దగ్గర్లో ఒక చోటు ఏర్పాటు చేస్తారు. అక్కడికి ప్రశ్నపత్రం వచ్చేస్తుంది. నేను, జవాబులు ఎక్కడ ఉన్నదీ చెప్పాలి. కొన్నిసార్లు ఏకంగా జవాబులు చెపుతుంటే, అందరూ రాసుకునేవారు. చీటీలు సెంటర్లకు చేరుకుంటాయి. అందులో నాకు ఏమి మిగిలింది? నాకు ఆనాడూ ఈనాడూ అర్థం కాలేదు. నేను రాను, అంటే ఒకరిద్దరు భయపెట్టిన సందర్భాలు కూడా గుర్తున్నాయి. ఇక్కడ ఒక చిత్రమయిన అనుభవం గురించి, తప్పు అని తెలిసి కూడా చెప్పేస్తాను. చేసిన పాపం, చెపితే పోతుంది, అంటారు. మా సీనియర్లు పరీక్షలు రాస్తున్నారు. రాతతో బాటు, సైన్సులో గీతలు కూడా ఉంటాయి. అంటే బొమ్మలు వేయాలి. రాసే వాడే గీస్తే సమయం సరిపోదని, నేను ఒక (సాయం చేసిన అన్నలాంటి) విద్యార్థికి బొమ్మలు వేసి పెడుతున్నాను. ఆన్సర్ బుక్స్, అంత సులభంగా బయటకి వచ్చేవి అంటే నమ్మగలరా? అంతలో ఒకతను వచ్చి నాకు నమస్కారం చేశాడు. అతని చేతిలో ఒక ప్రశ్నపత్రం ఉంది. అది తెలుగు లిటరేచర్ పేపర్. అతను ఆ సబ్జెక్ట్‌తో పరీక్ష రాస్తున్నాడు. నినికి ఏమీ రాయలేకపోతున్నాడు. అతనున్న హాల్లో డ్యూటీ చేస్తున్న ఒకానొక గురువుగారు, ‘చెట్టు కింద ఒకతను ఉన్నాడు. పోయి కాళ్లు పట్టుకో!’ అని చెప్పి పంపించాడట. నాకు చిత్రంగా ఆ పేపర్‌లోని అంశాలన్నీ తెలిసినవిగా కనిపించాయి. చెప్పాను. అతను రాసుకుని వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత వెతుకుతూ మా ఇంటికి వచ్చి అతను ‘మీ పుణ్యాన నేను పాస్ అయినాను’ అని ధన్యవాదాలు చెప్పి పోయాడు. పుణ్యమా, పాపమా అన్న సంగతి పక్కనబెడితే, ఈ సంఘటనల వెనుక, నా మనసులోని బాధ అర్థం చేసుకొనవలసిందిగా వేడుకుంటున్నాను.
మేము పరీక్షలు రాసే సమయానికి, ఈ కాపీయింగ్ తగ్గలేదు. కానీ, ఏకంగా యూనివర్సిటీ వారు, రెండు మూడు కాలేజీల వారు బాగా రాసినా, మంచి మార్కులు వేయకూడదని నిర్ణయించారట. నేను బి.ఎస్‌సీ, సెకండ్ క్లాస్‌లో మాత్రమే పాసయ్యాను! ఎమ్.ఎస్‌సీకి వెళ్లిన తరువాత కళ్లు తెరచుకున్నాయి. కసికొద్దీ చదువుకుని రాశాను. బంగారు పతకం గెలుచుకున్నాను.
మా తరానికి మంచి మార్గదర్శనం దొరకలేదు, అన్నది నిజం. మా ప్రాంతంలో అది మరింత సత్యం! ఆ తరం వారు రాజకీయాలు, పరిశ్రమ లాంటి రంగాలలో కూడా కొంత అనుమానంగానే ముందుకు సాగినట్లు నా అనుమానం. అయినా, తెలివిగల వాళ్లు సంగతి తెలుసుకుంటారు గనుక, తగిన సమయంలో దారి మార్చుకుంటారు. ఆ కాలంలోనే విశ్వవిద్యాలయం స్థాయి ఎన్నికలు ఉస్మానియాలో రద్దయినయి. ఇప్పటివరకు అదే పద్ధతి కొనసాగుతున్నదని అనుకుంటాను. యూనివర్సిటీలో అప్పటి తరం వారిని గురించి చెప్పడానికి ఏకంగా ఒక పుస్తకం రాయాలి. నిజంగా అది పరిశోధించ దగిన సామాజిక అంశం. ఒక విద్యార్థి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మోటర్ సైకిల్ మీద ఎక్కినట్టు విన్నాను. అలాంటి వారి కొరకు క్యాంపస్‌లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తొమ్మిది స్పీడ్ బ్రేకర్స్ పెట్టించారు, అన్నారు. కొన్ని ఉద్యోగాల ప్రకటనలలో ఉస్మానియా వారు అప్లికేషన్ వేయవద్దు అని రాశారట!
రోజులు మారాయి. నిజమే! కానీ, పరిస్థితులు మెరుగయినయ్య? అనేది ప్రశ్న! మేమే మేలేమో? అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇరుకు ప్యాంట్లు లేవు. గంప ప్యాంట్లు అంతకన్నా లేవు. అందరూ జీన్స్ వేసుకుంటారు. జేబులు, కాలర్ లేని బనియన్‌లు తొడుక్కుంటారు. మరి చదువులు బాగా చదువుకుంటారా? ఇంజనియరింగ్, వైద్య విద్య తీరు గురించి అనుభవపూర్వకంగా తెలుసు. నా పిల్లల్లో ఒకరు ఇంజనియర్. ఒకరు డాక్టర్. మరి ఇక సైన్స్, సామాజిక శాస్త్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదంటారు. నిజంగానా?
*

కె. బి. గోపాలం