లోకాభిరామం

క్షుదానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి అసలయిన ఆర్థిక మంత్రి రుతుపవనాలు, అని అర్థం వచ్చే మాట ఈ మధ్యన ఎక్కడో చదివాను. ఆ తరువాత, అలవాటుగా మరికొన్ని పుస్తకాలు చదువుతున్నాను. మంచి విషయం, అంటే తెలివిగా చెప్పిన ఏ విషయం చదివినా అందరితో పంచుకోవాలనిపిస్తుంది. లోకాభిరామమ్‌లో ఎన్ని సంగతులని చెప్పగలను? పైగా, ఆ మధ్యన ఒక మిత్రుడు ఫోన్ చేసి ‘లోకాభిరామం’ గురించి మాట్లాడాడు. ఆయన మొదటి నుంచి, కాలంను చదువుతున్న శ్రేయోభిలాషి. ఈ వారం లోకాభిరామంలో నీవు కనిపించడం లేదు. అదేదో వ్యాసం చదివినట్టు ఉంది అన్నాడాయన. అది నేను రాసిన వ్యాసం. అందులోనివి నా అభిప్రాయాలు, అంటే ఆయనకు నచ్చలేదు.
లోకాభిరామం నా ఆత్మకథ కాదు. ఇది నా ఆత్మగతం మాత్రమే. కనుక నాకు ‘అవును గదా’ అనిపించిన సంగతులను ఇక్కడ అందరితో పంచుకుంటాను. నేను చదువుతున్న పుస్తకాలలో కొన్ని నన్ను కుదుపుతాయి. ఆలోచనలు రేగుతాయి. తిండి గురించిన రెండు మూడు పుస్తకాలు చదివాను. అవి వంటావార్పు పుస్తకాలు కావు. మనిషి మనుగడకు అన్నం, నీళ్లు అవసరమన్న సంగతి అందరికీ తెలిసిందే కదా! అన్నమంటే వరి ఉడకబెట్టిన తెల్లని అన్నం మాత్రమే మనందరికీ మనసులో మెదలుతుంది. ఇక్కడ అన్నం అన్న మాటకున్న అర్థం ‘తిండి’ అని. (పాలమూరు ప్రాంతంలో తిండి వెడుతున్నది, అంటే గోడుకు పెడుతున్నది, అని అర్థం. గోకుడుకు నవ్వ, నొవ్వ, తీట వంటి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. అప్రస్తుతము ఉపశమించుగాక!) బియ్యం ఎక్కడ నుంచి వస్తుంది అంటే బస్తాలో నుంచి, అని బదులిచ్చే మన వంటి వారికి, తిండి, చరిత్ర, పరిణామం మనసున పట్టేనా? అసలు ఈ ప్రపంచానికి తిండి పెడుతున్నది ఎవరు? ఏ రకంగా? వంటి ప్రశ్నలు అడిగితే, చాలామందికి, కోపం వచ్చే వీలుంది. మొత్తం ప్రపంచంలో అయిదారు రకాల ధాన్యాలను మాత్రమే ఎందుకు తింటున్నారు? మరిన్ని రకాలు లేవా? అంటే ఇంకేమంటారో తెలియదు. వరి అన్నంగాక చామలు, లేదా సామలు, కొర్రలు అనే ధాన్యం తిన్న గుర్తుంది. అవింకా ఉన్నాయా? బియ్యం పాత రకాలు ఇంకా మిగిలి ఉన్నాయా? ఎన్నో ప్రశ్నలు.
గతంలోకి వెళితే, మరీ గతంలోకి కాకున్నా, పదివేల ఏండ్లు వెనుకకు వెళితే, అప్పుడే వ్యవసాయం మొదలయింది. వాతావరణంలోని పద్ధతి, మార్పులను అనుసరించి వ్యవసాయం సాగింది. ఎక్కడి వాతావరణం అక్కడ ప్రత్యేకం. గనుక పంటల్లో వైవిధ్యం మొదలయింది. అయినా అందరూ హాయిగా తిని బతకగలిగారు. వ్యవసాయం ఎంతకాలమయినా ఒకే రకంగా సాగింది అంటే తప్పు. మనిషి, వాతావరణం, మరిన్ని సంగతులతో బాటే వ్యవసాయం కూడా మారుతూ వచ్చింది. ఇవాళటికీ మారుతూనే ఉన్నది. లేకుంటే, పట్టుకుచ్చులు, మహారాజభోగాలు కనబడకుండ పోతాయా? ఇంతకూ అవేమిటో తెలుసునా? వరి రకాలు! మా పొలంలో పండిన రకాలు. తైచుంగ్ అనే చైనావరి కూడా మా దగ్గర పండింది!
ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఒండు గొట్టడము, గొర్రెలు మేకల మంద ఆడడము, పెంట ఎరువు లాంటివే తప్ప, రసాయన ఎరువులు లేవు. పురుగు మందులు ‘పిండి’ ఎరువులు (మా ప్రాంతంలో రసాయన ఎరువులను అట్లాగన్నారు) వచ్చినప్పుడు, వాటివల్ల పంటలు నాటకీయంగా మారినట్టు ఎవరూ భావించలేదంటే నమ్మండి. పాత పద్ధతి పంటలే పుష్కలంగా పండేవి!
వ్యవసాయంలో రసాయనాల వాడకం గురించి ప్రయత్నాలు వెనకటే జరిగాయంటే ఆశ్చర్యం. దేశం చాలాకాలం తెల్లవాని అధికారం కింద సాగింది గద. ఇక్కడి వారికి ఏమీ తెలియదు అనుకోవడం, దొరల పద్ధతి. (తెలంగాణ వారికి వ్యవసాయం తెలియదు, ఒక అక్కయ్య, ఒకానొక నవలలో రాశారట, అచ్చంగా దొరల పద్ధతిలో). 1889లో మహా ఘనత వహించిన (ఈ మాటలకు పొట్టి రూపం మ.ఘ.వ. గదా! సంస్కృతంలో మఘవ అంటే ఇంద్రుడు) బ్రిటీషు ప్రభుత్వం వారు, ఇక్కడి వ్యవసాయాల్ని మెరుగుపరచాలని జాన్ ఆగస్టస్ వోల్కర్ అనే పెద్దమనిషిని భారతదేశానికి పిలిపించారు. ఆయన దేశంలో తిరిగి ఇక్కడి వ్యవసాయ పద్ధతులను సూక్ష్మంగా పరిశీలించాడు. ఇక్కడ మెరుగుపరచవలసింది, అంటూ ఏమీ లేదు. ఇంతకన్నా పర్‌ఫెక్ట్ (తెలుగులో ఏమనాలి?) వ్యవసాయ విధానం, నేను, మరెక్కడా చూడలేదన్నది, సత్యం. భారతదేశం వారికి సలహాలు ఇవ్వడంకన్నా, ఇంగ్లీషు వ్యవసాయాన్ని మరింత మార్చి బాగుపరిచే ప్రయత్నం చేయడం, సులభంగా కుదురుతుందని, ధైర్యంగా చెప్పగలను’ అన్నారు ఆ పరిశీలకుడు. లేదా నిపుణుడు లేదా పరిశోధకుడు! ఆయన సమర్పించిన నివేదిక నేటికీ లండన్‌లో సిద్ధంగా ఉంది!
నాటికీ నేటికీ ఒకటే తీరు. మన మీద మనకు నమ్మకం లేదు. మరో సంగతి కూడా చూస్తే నా మాటకు ఉదాహరణ ఇచ్చినట్టు ఉంటుంది.
నిలదొక్కుకోగల వ్యవసాయం అని ఒక మాట పుట్టింది. కృత్రిమంగా ఏదీ చేర్చకుండానే, వ్యవసాయం సహజంగా, ప్రకృతి సిద్ధంగా కొనసాగాలి. ఈ రంగంలో సర్ ఆల్బర్ట్ హోవార్డ్, అని ఒక నిపుణుడు ‘తూర్పు దేశాలలో (అంటే మన ప్రాంతంలో) వ్యవసాయం, అత్యున్నత పరీక్షలకు నిలబడింది. గెలిచింది. గడచిన కాలం అడవులలాగే, గడ్డి మైదానాలలాగే, లేదా సముద్రంలాగే, ఇదంతా సహజం, ప్రకృతి సిద్ధం!’ అని ఆయన తేల్చి చెప్పాడు 1940లోనే ఆయన ఈ మాట చెప్పాడు.
ఇంతకూ భారతదేశపు వ్యవసాయం గురించి ఇంత బాగా వ్యాఖ్యానించిన ఈ పెద్ద మనుషులు ఇద్దరూ తెల్లదొరలు! సిసలయిన ఆంగ్లేయులు! ఇక్కడ తమ పట్టు మరింత బిగించాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వంలోనివారు. అప్పట్లో కరువులు, కాటకాలు వచ్చాయి. అవి మనిషి కారణంగా, వ్యవసాయ పద్ధతుల వల్ల మాత్రం రాలేదు. దొరల దోపిడీ కారణంగా అన్నం, నీళ్లు కరువయ్యాయి. బెంగాల్ కరువు, అందుకు ఒక ఉదాహరణ. (ఈ విషయాన్ని సత్యజిత్ రే ఆశని సంకేత్, మృణాల్‌సేన్ లే అకార్ సంధానే అనే సినిమాల్లో ఎంత బాగా చూపించారో? వాటిని కూడా చర్చిద్దాం.)
గడిచిన యాభయి సంవత్సరాలలో పరిస్థితి తారుమారయింది. మార్పులను నా వయసు వారు కళ్లారా గమనించారు. ఎరువుల పేరు మారింది. గొట్టం బావులు ఇష్టం వచ్చినన్ని తవ్వి, నేలలోని తడిని పిండుకున్నారు. వ్యవసాయం ఒక వ్యాపారంగా మారింది. తట్టుకోలేక (మా వంటి) రైతులు పక్కకు తప్పుకున్నారు. పర్యావరణం మారిపోయింది. అత్యాశ కారణమని అర్థమయేలోగా అకాలం, అనే పరిస్థితి వచ్చింది. నిలకడగా సాగే వ్యవసాయం మరుగున పడింది. పెట్టుబడి వ్యవసాయం పెరిగిపోయింది.
వ్యవసాయంలో, సాంప్రదాయికం పద్ధతులు పోయి, సైన్సు, టెక్నాలజీ పాత్ర పెరిగింది! సదానందం, చిదానందంగా సాగిన బతుకులు క్షుదానందంలో (ఆకలి కూడా ఆనందమే) కూరుకుపోతున్నాయి.

కె.బి. గోపాలం