లోకాభిరామం

చరిత్రలో ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగా గుర్తుంది. 11వ తరగతిలో ఉండగా నాగభూషణం గారని ఒక పంతులుగారు సోషల్ స్టడీస్ బోధించారు. ఒకప్పుడు చరిత్ర, భూగోళం అని రెండు విషయాలు వేరుగా చెప్పేవారు. పద్ధతి ఎప్పుడు మారినదీ గుర్తులేదు. ఎక్కడో ఒకచోట ‘జూడర్జీతో డచ్చివారు’ అని ఒక పాఠం చదివినట్టు మాత్రం మెదడులో ఒక ముడి నిలబడి మిగిలింది. ఇంతకూ ఒకనాడు నాగభూషణం గారికి ఒకనాడు, నేను పాఠం ధ్యాసతో వినడం లేదని అనుమానం వచ్చింది. తెలిసిపోయింది, అంటే బాగుంటుందేమో. నేను ఏ పాఠమూ శ్రద్ధగా విన్నది లేదు. అందులో సగం బాధ్యత పంతుళ్లది అని నాకు గట్టి నమ్మకం. ఈయన నన్ను లేచి నిలబడమన్నారు. ‘బుద్ధుడు ఏ సంవత్సరంలో పుట్టెను?’ అని నా మీద ఒక ప్రశ్నాస్త్రాన్ని ప్రయోగించారు. ఆయన క్రీస్తుపూర్వం పుట్టాడని నాకు ఇవాళటికీ గుర్తుంది. సంవత్సరాన్ని కూడా చెప్పగలను. కానీ నాకు ఎందుకో ఆనాడు చెప్పాలని అనిపించలేదు. ఎడ్డెంతెడ్డెంగా ఉండడము మన జీవ లక్షణము గద! అందుకే ‘అయ్యా! చెప్పమన్నారు గనుక చెప్పగలను. ఇంతకూ ఆయన పుట్టిన ఏడు ఏది అన్న సంగతి గుర్తుంచుకుంటే నేను గొప్పవాడిని, మంచి విద్యార్థిని అరు రుజూ అవుతుందా? (రుజూ అనే మూలం నుంచి డుమువులు పద్ధతిలో రుజువు అని మాట పుట్టెను. గమనింప మనవి!) ఆయన జీవితంలోని సందేశం, బోధనలు ముఖ్యము గదా! నేను మీ ప్రశ్నకు జవాబు చెప్పను. ఈ పాఠం నేను చదువుకుని అర్థం చేసుకోగలను అని జవాబిచ్చాను. నేను చేస్తున్నది తప్పు అని నాకు ఆనాడే తెలుసు. కానీ అది ఒక ఆనందం. తెలిసి తప్పు చేయడంలో ఒక ఆనందం ఉంది. అది రాక్షసానందం కానేకాదు. మానవానందమే! గురువుగారు మంచివారు. నా మీద కసి పెంచుకోలేదు. పేరు చెప్పనుగానీ మరొక పంతులుగారు, ఇట్లాగే నా మీద కోపం పెంచుకుని నాకు తక్కువ మార్కులు ఇచ్చారు.
చరిత్ర గురించి నాకు కొన్ని గట్టి అభిప్రాయాలు ఉన్నవి. బడిలో చెప్పిన, చెపుతున్న చరిత్రలో రాజులు, రాజ్యాలు, యుద్ధాల వివరాలుంటయి. ఆనాటి ప్రజల గురించి ఎక్కడా చెప్పినట్టు కనిపించదు. ఈ ప్రపంచంలో రాజులేనా చరిత్ర? ప్రతి విషయానికి చరిత్ర ఉంటుంది గదా? సైన్సు చదువుకునే వారికి ఏ స్థాయిలోనూ సైన్సు చరిత్ర చెప్పరు. వ్యవసాయానికి చరిత్ర ఉంది. మీ ఊరికి చరిత్ర ఉంది. అన్నిటికీ చరిత్ర ఉంది. అమెరికా దేశం పుట్టి నాలుగు వందల సంవత్సరాల మాత్రమే అయ్యింది. వాళ్లకు మరి అంతే చరిత్ర ఉంటుంది. బంగ్లాదేశ్ చరిత్ర అంతకంటే చాలా చిన్నది. మనిషి చరిత్ర మాత్రం చాలా పెద్దది.
గుర్రాల వాడకం గురించి చరిత్ర పద్ధతిలో చెప్పుకోవచ్చు. మన పాత పుస్తకాలలో యవనాశ్వములు, అరబీ ఘోట్టాణముల గురించి చెపుతారు. మన దేశంలో ఎందుకని మంచి గుర్రాలు అందుబాటులో లేవు? ఈ సంగతి గురించి మంచి సమాచారం ఉంటే చదవాలన్నది నా కోరికల్లో ఒకటి. భారతదేశంలో సాంకేతిక శాస్త్రం గురించి పుస్తకాలు, చాలా చిన్నవి వచ్చినట్లు తెలుసు. నారింజ పండు మన దేశానిది కాదు, అని అందులోనే చదివాను.
మనిషి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దానికి మీరు సంస్కృతి అని పేరు పెడతానంటే ‘నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్’! అనగా ‘యంత మాత్రము అభ్యంతరము లేదన్న మాట! పురాణాలు, ఇతిహాసాలలో మనుషుల తీరును నాకు చరిత్ర పద్ధతిలో చెప్పండి. వింటాను. అట్లా చెప్పిన రచనలు కొన్నింటిని చదివాను.
మాది కారంచేడు వంశము. కొంత పరిశీలన మీద, ఒంగోలులోని కారంచేడుతో మాకు సంబంధం లేదని తెలిసింది. ఒక నాలుగు వంశాల వారు, భగవద్రామానుజుల ఆదేశముల వల్ల ఆయన ఈ ప్రాంతాలకు రాక ముందే, తెలుగు మాట్లాడే దేశానికి వచ్చినట్టు సమాచారం ఉంది. వంగీపురం, కారంచేడు వంశాలు ఆ నాలుగింటిలో ఉన్నాయి. నాకు తెలిసి మా ప్రాంతంలోనే కారంచేడు వారు రెండు వంశాలుగా ఉన్నాము. నాకు తెలిసిన మరొక కారంచేడు వారు ఇటీవల గతించిన వెంకట రాఘవాచార్యులనే పండితులు, వారి వంశము వారు. వారికి మాకు జ్ఞాతిత్వము కాదుగదా, బంధుత్వము కూడ లేదు.
నేను వోటరు కార్డు కొరకు ఇంటర్‌నెట్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాను. నాతోబాటే అర్జీ (దులోని జను, జెడ్ అనే ఇంగ్లీషు అక్షరంలాగ పలకవలెను!) పెట్టిన నా శ్రీమతికి, బిడ్డకు కార్డులు వచ్చాయి. వాళ్లు ఓటు వేశారు కూడా. నాకు మాత్రం రాలేదు. విషయం గురించి నెట్‌లో సమాచారం తెలుస్తుంది అన్నారు. నేను ప్రయత్నించాను. నాకు వోటరు కార్డు రాలేదు గానీ, జెనరల్ నాలెజ్డ్ పెరిగింది. మా ఇంటికి దగ్గరలోనే కారంచేడు అనే ఇంటిపేరుగల కుటుంబం వారు ఉన్నారని తెలిసింది. నేను వారిని వెళ్లి చూడాలనే ప్రయత్నం చేయలేదు. చరిత్రను శాఖలుగా చీల్చుతూ పోతే, అందులో చివరికి మా వంశ చరిత్ర కూడా రావాలె గదా? పడమటి దేశాలలో వంశ చరిత్రల గురించి మాస పత్రికలు కూడా ఉన్నాయి. ప్రయత్నించి మన బంధువును వెతకవచ్చు.
సంస్కృతి, చరిత్రలను గురించి ఒక పుస్తకం చదువుతున్నాను. అందులోని అంశాలు చాలా ఆనందాన్నిస్తున్నాయి. నాకు సైన్సు చదవడం, రాయడంలో ఆనందం తెలుసు. చరిత్ర, సంస్కృతి కూడా మనకు, మనలాంటి మనుషులకు సంబంధించిన సంగతులు. కనుక అవి ‘మన గురించి మనం’ అన్న నా అభిమాన అంశంలో, థీమ్‌లో, ప్రయాసలో, భాగం అవుతాయని అర్థం అయింది. క్రికెట్‌కు చరిత్ర ఉంది. నాకు ఆ విషయంలో ఆసక్తి తగ్గింది. గనుక ఇప్పుడది నన్ను తాకదు. ఎన్నో ఆటలున్నాయి. అన్నింటినీ గురించి తెలుసుకుని ‘మన గురించి మనం’ అనుకోవచ్చునేమో తెలియదు. వాటిలో ఆనందం లేదని నేను అనను. అది పొరపాటని తెలుసు! సాహిత్య చరిత్ర కూడా అంతే! తెలిసిన వారికి కూడా తెలిసింది స్థూల చరిత్ర మాత్రమే. చిన్న కథల గురించి పరిశీలిస్తుంటే, తెలిసిన ఇంగ్లీషు నుండే సముద్రమంత సామగ్రి సమకూరింది. అదంతా మధించగలనా? అందులో నుంచి ఒక ముక్క ఏదయినా చెప్పగలనా?
మానవ చరిత్రను గురించి వ్యాఖ్యానిస్తూ, పైన ఉదహరించిన పుస్తకంలో ఒక గొప్ప మాట అన్నారు. అవకాశాలు, అవరోధాలు, స్పర్థలకు ప్రతిక్రియగా మానవ చరిత్రను చూడవచ్చునంటారు వీరు. చేతిరాతకు ఒకవేపు, నగరాలు, రాజ్యాల నిర్మాణానికి మరొకవేపు సంబంధం ఉందని ఈ పుస్తకంలో వివరించారు. నగర సమాజాల అవసరం కొరకు, పాలకుల సౌలభ్యం కొరకు, రాతను బాగా అభివృద్ధి చేశారట. అది మొదటి నుంచి కొనసాగిన స్థితి కాదని గుర్తుంచుకోవాలి. అయిదువేల ఏండ్ల కింద ఈ పద్ధతి మొదలయింది. ప్రస్తుతం దక్షిణ టర్కీ అంటున్న ప్రాంతంలోని ఒక అన్న తన తమ్మునికి ఉత్తరం రాసి, వెండి, బంగారం, బట్టల వ్యాపారం గురించి వివరించాడు. బతుకు బరువయిందని మొర పెట్టుకున్నాడు. ఇంతకూ రాసింది, కాగితం మీద కాదు. మట్టిపలక మీద. అక్షరాలు లేవు. తుంగతో గుచ్చిన గుర్తులున్నాయి. మన చరిత్ర, అంటే మనుషుల చరిత్ర, ఏ స్థాయిలోనయినా ఎంత బాగుంటుందో తెలుసా?

కె.బి. గోపాలం