లోకాభిరామం

కుడి - ఎడమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాయిరి నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్, అని చెప్పిన కవి, కుడి, ఎడమయితే ఫరవాలేదన్నాడు. ఎవరయినా ఆ సంగతి గురించి ఆలోచించారా? అందుకు టైమెక్కడండీ, అంటారేమో! తొందరలో పడితే పగలు, రాత్రి తెలియవు. తిండి రుచి తెలియదు. బతుకులో రుచి అంతకన్నా తెలియదు. కానీ, పద్ధతి అది కాదు! ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది?
గణేశ్ పండుగకు (అవును వినాయకచవితికి) బోలెడన్ని విగ్రహాలు పెట్టి, తర్వాత నీళ్లలో పడేస్తరు. గణేశుని తొండము ఎటువేపు మళ్లి ఉంటుందని ఎవరయిన చూచినారా? తొండము కుడికి తిరిగే వినాయకుడు (వలంపురి వినాయగర్) ప్రత్యేకమని తెలుసునా? శంఖములు ఎటువేపు సుడి తిరిగి ఉంటయో ఎంతమంది గమనించినరు? కుడికి తిరిగిన శంఖాలను (దక్షిణావర్త శంఖము) ప్రత్యేకం సేకరించుకుంటరని, వాటికి బోలెడు ధర పలుకుతుందని ఎంతమందికి తెలుసు?
గ్లూకోస్ అనే తియ్యని పొడి తెచ్చుకుంటము. దాని పేరు పక్కన ‘డి’ అనే ఇంగ్లీషు అక్షరం ఉంటుంది. అంటే అది కుడి రకం పొడి. అంటే మరి ఎడమ రకం కూడ ఉంటుందా? అవును ఉంటుంది! ప్రత్యేకమయిన వెలుగు ప్రయోగంతో తేడా తెలుసుకోవచ్చు. పందిరి మీద ఒక తీగ పాకుతుంది. అది మామూలుగ ఎటుదిక్కు తిరుగుతుందని చూడండి. వాటికి ఒక పద్ధతి ఉంది. ఇటువంటి సంగతులన్ని పట్టించుకుంటే ఏమి వస్తుందని అడిగే వారుంటరు. నాకు తెలుసు. కానీ, అవునా, అనేవారు కూడ ఉంటరు. ఈ ప్రపంచంలో మనకు అడుగడుగున అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎదురవుతయి. పట్టించుకోకుండ బతుకుతమంటే చెయ్యగలిగింది లేదు. కానీ, ఆ ఆనందం కొరకు ఎదురుచూచే వారి కొరకు మాత్రం ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. మాటలు సాగుతయి. మజా ఉంటుంది!
అద్దం చూడకుండ పొద్దు గడువదు, గడవదు, నడవదు, సాగదు గదా! అందరూ, అనుమానం లేకుండ ‘అద్దం ఎడమ, కుడిలను మార్చి చూపుతుంది’ అనుకుంటరు. అంటరు. అందరిని నమ్మిస్తరు గూడ! క్రీ.పూ.నాలుగవ శతాబ్దంలో ప్లేటో అనే మహానుభావుడు ఈ విషయం గురించి తనకు అర్థమయినది ఏదో చెప్పినడు. అప్పట్లో వెలుగు, దాని తీరు గురించి తెలిసిందే తక్కువే గనుక, ఆయన మాటలు మనకు ఇప్పుడు అవసరం లేదు.
అద్దం అన్నది కాంతిని తిరిగి వెనుకకు పంపగలిగిన ఒక చదునయిన పదార్థం. నిలకడగ ఉన్న నీళ్లు కూడ అద్దంలాగ పని చేస్తయి. అసలయిన సమస్య ఒకటి మిగిలి ఉంది. ఈ అద్దములోకి చూస్తే, కుడి పోయి ఎడమ అవుతుంది. అంతేగాని, తలకిందులు బొమ్మ మాత్రం రాదు. అద్దం ముందు నిలబడితే, తలనే పైన కనిపిస్తుంది. అంటే ఇక్కడ కుడి-ఎడమ, కింద-మీద అన్న మాటలను అర్థం చేసుకోవటంలో ఎక్కడో తేడా ఉందని అర్థం! నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్రయోగం ఒకటి, మీకు వివరిస్తాను. ఓపిక ఉంటే మీరు గూడ చేసి చూడండి. అద్దంలో ఉన్న మీకు మీరే నమస్తే చెప్పండి. చెయ్యెత్తి సెలూట్ చెయ్యండి. అద్దంలో మీరు అదే పని చేస్తారు. ఇంక షేక్‌హాండ్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. మీరు కుడిచెయ్యి ముందుకు జాపితే, అద్దంలో మీరు కూడ అదే పని చేస్తారు. ఎడమచెయ్యి ఎత్తే ప్రశే్న లేదు. అయితే చిత్రంగా అద్దంలో మీ కుడిచేయి, అసలు కుడిచెయ్యికి ఎదురుగా ఉంటుంది. అంతేగాని అక్కడ ఎత్తింది ఎడమచెయ్యి మాత్రంగాదు. ఎడమచెయ్యికి ఎదురుగ ఎడమచెయ్యి, కుడిచెయ్యికి ఎదురుగ కుడిచెయ్యి, తలకు ఎదురుగ తల, పొట్టకు ఎదురుగ పొట్ట ఉన్నయి.
ఇంకొక్క మాట. ఇది గూడ చేసి చూడండి. కుడిచేత పెన్ను, ఎడమచేత పుస్తకం పట్టుకుని అద్దం ముందు నిలబడండి. పెన్ను ఎడమ చేతిలోకి రాలేదే? కనుకనే, కింద-మీద తేడా కూడా రాలేదు. నిజానికి కుడి-ఎడమలు మారలేదు. అద్దంలాంటి నేల మీద, వీలయితే అద్దం మీద నిలబడితే, కాళ్ల దగ్గర కాళ్లుంటయి - తల మరెక్కడో ఉంటుంది. అదంత తికమకగానీ, అసలు సంగతిని సులభం చెప్పుకుంటే బాగుంటుంది.
‘అద్దం ముందు నిలబడి ఉంటిమి, మన శరీరంలోని ప్రతి భాగము, దాని బొమ్మ, అనగా బింబము సూటిగా ఒకదానికి మరొకటి ఎదురుబదురుగా ఉంటుంది. రెంటి నడుమ గీత గీస్తే, అది అద్దానికి లంబకోణంలో ఉంటుంది. అద్దానికి అసలు వస్తువు ఎంత దూరంలో ఉందో, దాని బొమ్మ అద్దంలో అంత లోతులో ఉంటుంది! ఇదండీ సూత్రం! సైన్సులో వాళ్లు కూడా దీన్ని ‘అద్దం రూలు’ అని ఒప్పుకున్నారు! హమ్మ య్య! ఎంత సంతృప్తి! మనం కుడిచెయ్యి పైకెత్తినప్పుడు, అద్దంలో మనం ఎడమ చెయ్యి ఎత్తితే అప్పుడు తేడా వచ్చింది, అనాలి. నా ఎదురుగ్గా మరో నేను ఉన్నాననుకోండి. నేను కుడిచెయ్యి ఎత్తి, ఎదుటి నేను కూడా కుడిచెయ్యి ఎత్తితే, అవి రెండు ఎదురుబదురుగా ఉండవు. కానీ, అద్దంలో నా ఎదురుగా మరొక నేను లేను. మీ ఎదుట మరో మీరూ లేరు. ఉన్నదల్లా బొమ్మ మాత్రమే! ఫొటో తీస్తే కెమెరాలో బొమ్మ తలకిందలయి, కుడి-ఎడమ మారుతుంది. దాన్ని చూస్తే మరో మనం కనబడతాము! అక్కడ కూడా కుడి-ఎడమలు మారవు. ఎవరి కుడి వారిదిగా ఉంటుంది. ఫొటోలోని మన బొమ్మ, మన ఎదురుగా వచ్చిన మరో మనం, అనుకుంటే అసలు సంగతి అర్థమవుతుంది. మనం లేకున్నా మరొకరికి ఫొటో కనబడుతుంది. అద్దంలో బొమ్మ, మనం కదిలితే, అది కూడా కదిలి వెళ్లిపోతుంది. ఎంత బాగుందండీ!
ప్రతి సంగతి గురించి పట్టించుకోవాలి. లోతులకు వెళ్లాలి. అర్థం చేసుకోవాలి. నిజంగా అర్థమయితే మరో నలుగురికి వివరించాలి. ఎంత లోకాభిరామమయినా ఎంతసేపూ కాలక్షేపం (పాపము శమించుగాక, ఇదేనేమిటి, ఇనాళ్లుగా నేను చేస్తున్నది?) గాకపోతే, కాసింత మెదడుకు పని చెప్పే సంగతులు గూడా చెప్పవచ్చు గదా! ఇప్పటికే ఈ మధ్య వచ్చిన రాతల గురించి వ్యాఖ్యానాలు వచ్చాయి లెండి!
వ్యాసంతోబాటు రెండు బొమ్మలున్నాయి. రెంటిలోనూ ఒక చెయ్యి ఉంది. అది అద్దంలో కనబడుతున్నది. మూడు వేళ్లు ఒక్కొక్కటి ఒక్కో దిక్కు మళ్లి ఉన్నాయి. మొదటి బొమ్మలో నడిమి వేలు, పొడుచుకు వస్తున్నది. మరి అసలు వేలు కూడా అద్దంలోనికి పొడుస్తున్నదాయె! మీరు వేల్లు అట్లా పెట్టి అద్దంలో చూడండి. ఎట్లా కనిపించింది. ఇక్కడ, ఇందాక మనం అనుకున్న అద్దం నియమం, అక్షరాలూ పని చేసింది కదూ! రెండవ బొమ్మలోలాగ కనిపించదుగాక కనిపించదు. అది ఫొటో కాదు. బొమ్మలను మార్చడానికి ఫొటోషాప్ అని ఒకటి వచ్చింది లెండి. ఇది ఆ పద్ధతి బొమ్మ.
సందర్భం గనుక ఒక జోకు. ‘ఎక్స్‌రే తీశారు. మీ ఎముక విరిగింది. ఫొటోషాప్ చేసి కంప్యూటర్‌లో అతికించారు లెండి’ అన్నాడట డాక్టరు! మరి అసలు విరిగిన ఎముక సంగతేమిటి? మొదట్లో చెప్పిన తొండం, శంఖం, చక్కెర, తీగలు అన్నింటికీ కుడి-ఎడమ తేడాలున్నాయి. ఆ సంగతి మనకు తెలియదు. అద్దంలో మాత్రం తేడా లేదు. కానీ, అదంతా అర్థమయి పోయిందన్నట్లు ‘అదంతేలే!’ అనడం పైగా! ఇంతసేపు మీరు సైన్స్ చదివారు! తెలిసిందా? గోపాలం సంగతే అంత! వీలు దొరికితే చాలు, రెచ్చిపోతాడు!

కె. బి. గోపాలం