లోకాభిరామం

పోగాలము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానికి గోపియను పేరు పెట్టిరి. వాడు వాస్తవముగనే ముక్కుమీద గోపము గలవాడాయెను. వాడు నాకు చాలా గొప్ప పేరున్నదనును. ఆ పేరెక్కడనున్నదని ప్రశ్న బుట్టును. కొందరికి వారి పేరు గోడ మీద నుండును. గోడ మీదకన్నను, గోడకు తాపితము జేసిన నొక జెక్క మీద చెక్కబడి యుండుననిన కడు సమంజసముగా నుండును. వీనికట్టి పేరు లేదు. అట్లున్న పేరు గొప్ప పేరెట్లగును? అది చెక్క మీద పేరగును. ఒకనికి గొప్ప పేరున్నదన్న నేను భావము? వాని ప్రతిష్ఠ ఘనముగా నున్నదని గదా! అందుకే పేరు ప్రతిష్ఠలను నొక సమాసమేర్పడినది. అందొకటి యున్న రెండవది గూడ తోడుగా నుండునని భావము.
వానికి తలిదండ్రులు బెట్టిన పేరు గోపాలము. తెనుగున పేరల జివరన డుమువులుండవలెనని గదా వ్యాకరణము. వాడు గోపాలుడు. తమిళమున గోపాలన్ అందురు. అది యేకవచనమే. గోపాలర్ అన్న గాని బహువచనము గాదు. తెనుగున డు అన్న నేకవచనము. అది యుందరికి నచ్చదు. నీవొక్కరివే. కాని నినె్నవరో ‘మీరు’ అని సంబొధించిన నొక గౌరవము, ఒక యానందము. ఒకప్పుడొకడు నా వద్దకు వచ్చి యేదో ఫిర్యాదు చేయనుండెను. వాడు మాటిమాటికి ‘మేము’ అనుచుండెను. నాకు కొంచెము తిక్క. అది కొంచెము గాదు, పుష్కలముగ నున్నది. వాటిని, ‘ఏదీ, కొంచెము పక్కకు జరుగుమంటిని. వానికర్థము గాలేదు. యేలయని యడిగెను. ‘కొంచెము జరుగుమని మరల యుంటిని. నేనధికారిని. అతడు సేవకుడు. కనుక జరిగెను. ఒక్కనినే యుంటిని. మాటిమాటికి మేమనుచుంటిని. నీవసలే స్థూలకాయుడవు, వెనుక నెవ్వరయిన యుండిరో చూడవలెనని, జరగమంటిని’ అని వారించితిని. వానికి కొంత అర్థమయినది. కొంత గాలేదు.
డుమువులలో రెండవది ము. రాముడను వాడు ‘రామము’గా మారును. అది యేకవచనమా? ఎన్ని పదములన్న యనుమానమేరికిని గలుగదు. అదియును ఒకనినే సూచించును. అయినను, అవగాహనము కొరవడినందుకు అందొక సౌలభ్యము దోచును. ఈ గోపియను కోపికి, గోపాలము అని పేరు వడినది. పట్నము పాపమని యేవ్వరును వ్రాయుట లేదు. పట్నం అని వ్రాయుచున్నారు. ఎక్కడికి బయలుదేరితివని ప్రశ్న. పట్నమునకని ఉత్తరువు. అంత పట్టింపు లేనివారు ‘పట్నానికి’ అని బదులిత్తురు. ఈ మధ్యన పుస్తకములు, పత్రికలలో గూడ ‘పట్నంకు’ అను ప్రయోగము గనుపించుచున్నది. సంస్కృతమున విభక్తి ప్రత్యయములున్నవి. నగరం అన్న మాటలో నగరమునకు అను నర్థము గూడ నిమిడియున్నది. నగరము నందు, అనుటకు నగరే యనవలయును. మన వారు నగరంనందు యని నగుబాట్లగుదురేమో? భాష యను నది ప్రవహించు నది వంటిది. మారుచుండవలెను. నిజమే. కానీ మార్పు వలననెవరికో కొంత వెసులుబాటుండదగును. గోపాలము, తన పేరు గోపాలం అని వ్రాయును. నా పేరు, నా యిచ్చయనుకొన్నాడేమో? డుమువులున్నంత కాలమది తెనుగు పేరు. అవి లేకున్ననది దెగులు పేరు.
ఒక గాయకుడు వచ్చెను. భజరే గోపాలం, అని పాటబాడెను. గోపాలుని భజింపుమని గదా పాట యర్థము? రామ శబ్దమకారాంతము. రామముగా వ్రాసిన నది డుమువులు పద్ధతిలో పేరు. రామం అని వ్రాసినచో నది సంస్కృత శబ్దమగును. రామునికను నర్థమిచ్చును. ఈ గోపాలమను వాడు బ్రౌను దొర రాసిన తెనుగు నిఘంటువును అచ్చునకు తయారుజేయు కార్యక్రమమునందు పాలుగాచెను. యంత్రము నందు అక్షరముల పొందిక జేయునపుడు, పదముల యంతమందుండు ము వర్ణమును పూర్వానుస్వారముగ మార్చవలెనని ప్రచురణకర్తల ప్రస్తావన దెచ్చిరి. వీడు, ఎంత మాత్రము కుదరదనెను. మనము నిఘంటువును, పరిష్కరించుట లేదు. మన యిచ్చవచ్చినట్టు మార్పులు జేయుట తగదని వారికి నచ్చజెప్పెను. అంతటి యాలోచనము గలిగిన వారికి స్వకీయ నామధేయము గురించి మాత్రము సత్యము దోచియుంచ లేదెందులకు?
ప్రథమ విభక్తి యందు మూడవ యక్షరము ‘వు’. ప్రభు శబ్దము దెనుంగన ప్రభువుగా మారును. వధూ శబ్దము వధువుగా పరివర్తనము జెందును. సేతువు తీతువు అను మాటలున్నవి తీతుననగా తీయుదువని గాదు. తీతువనునది యొకానొక పక్షి విశేషము. గోపాల శబ్దము మాత్రము వ్యాకరణమున నియమములుండు. ఇప్పుడు సమాజమున గరణములు వేరు. ఉన్నను వారు కరణీకము జేయుట లేదు. భాషలయందు వ్యాకరణమును నట్లే మృగ్యమగుచున్నది. ఆంగ్లమును గూడ నడుమ విరిచి, ఎవరికి చేతయిన రీతిని వారు వ్రాయుచున్నారు.
భాషయనునది భావ వినిమయ మాధ్యమము. ఎదుటి వారికి నీవు జెప్పున నట్టిదేదో తలకెక్కిన చాలునని అర్థము. బిచ్చగానిని కొందరు పైకి బొమ్మందురు. అనగా మరియొక యింటికని వారి లెక్క. పైకి బోవటయన్న ప్రాణము బోవుట యనుట గూడనున్నది. జనుల భాష ఈ తీరున నానాటికి తీసిట్లగుచుండగా, పత్రికలు, టెలివిజనుల వారు మరింత కృతకమయిన భాషను వాడుకలోకి దెచ్చియుండిరి. ‘లోతట్టు ప్రాంతములు జలమయిమయినవి. జనము తీవ్ర ఇబ్బందుల గురయి వాపోవుచున్నారందురు. వాపోవుట యనగా వానికి దెలియునా? నోరంతయు దెరిచి బొబ్బలెట్టుట. జనులు ‘వా’యని యంగలార్చుచుండిరా? తీవ్ర యిబ్బందులనునది సరియగు సమాసము గాదు. అటువంటి నేపథ్యము, పరిస్థితి వంటి మాటలు లేక వారికి వాక్యము వీలుగాదు. తెలుగు నేర్పెడి గొప్ప పండితుడొకడు సమయలేమి, లేదా అటువంటి మాటయేదో వాడెను. ఆయనకు ఎవరు జెప్పవలెను? తప్పుదెలుసుకొనుట ఒక ఎత్తు. దానికి అంగీకరించుట మరియొక ఎత్తు. ఈ రెంటి తరువాత సరిదిద్దుట యను స్థాయి వచ్చును.
భాష పరిణామ శీలము. ఇది సత్యము. పరిణామమనగా, ఏదియో యవసరము, వెసులుబాటు కొరకు కొన్ని మార్పులు రావచ్చును. కడుపుగోసినను మాటరాని వారి వలన భాష భ్రష్టుపట్టిన దానిని పరిణామమనబడదు!
గోపాలమునకు మద్రాసను, చెన్నపట్నము నుంచి ఉత్తరమొకటి వచ్చెను. దాని మీద వీని పేరు ‘కపాలమ’ని వ్రాసియున్నది. కొత్త పేరు దొరికినదని వాడెంతో సంతసించెను. అట్టి వానికి, వాని పేరు సరిగా లేదని జెప్పుట ఎట్లు?
ఇందొక విషయమున్నది. ఒకటి యనగా రెండు, మొదటిది గోపాలమనువాని పేరును గురించిన వాక్యార్థము. వాని పేరు యెట్లున్నను కడమ వారికి పట్టదు. కనుకనే పోగాలము అన్ననుగూడ వాడు బహుశా పలుకును. పేరు ఎవరికి వారు ఇష్టపూర్తిగా పెట్టుకొనునది కాదు. తల్లిదండ్రులు నిర్ణయింతురు, ఆ పేరుతో పిలుచుచుందురు. కొంతకాలము వరకు అది తన పేరని ఏరికిని ధ్యాసయే యుండదు. కొన్ని వందలసార్లు అందరును అదే పేరుతో పిలిచినందుకు, ఇది నా పేరను నిర్ధారణము కలుగును. ఈ గోపాలమనువాడు ఈ మధ్య వరకు తన పేరు గురించి అంతగా పట్టించుకోలేదనునది సర్వ విదితము. కానీ ఈ మధ్య వాడు తన పేరును ‘విజయ గోపాలుడని’ వ్రాసుకునుచున్నాడు. ఇందొక విషయమున్నది. వాని భార్యామణి పేరు విజయ. ఆమె వలన వీనికి కడు విజయములు చేతికందినవి. కనుక వాడట్లు పేరు పెట్టుకొనెను.
మరి రెండవ విషయముండవలెను గద! అది భాషకు సంబంధించినది. తెలుగనునది యిట్లు గూడ యుండెనని అందరు మరిచిరి. చిన్నయసూరి పద్ధతి తెలుగు మరొక రకము. అనవుడు, నావుడు అను మాటలకర్థము తెలియక బడి పంతుండ్లు కూడ తికమక పడిన సంగతి చెప్పుచుందురు. అది తెలుగు కాదనుటకు లేదు. అందులోని కమ్మదనము అందిన వారికి అది అమృతోపమానముగ దోచును. ఇక ప్రాంతములను బట్టి మాట తీరనునది గూడ మరియొక విశేషము. యాస, భాష అను రెండు మాటల మధ్యన అంతరము తెలుసుకొనవలెను. ఈ రెంటిలో ఏదయినను భాషలో మాధుర్యము, భావము పలికినంత వరకు అది అంగీకార యోగ్యమే. కానీ మిడిమిడి జ్ఞానము వలన తప్పులు వ్రాయుటను మాత్రం సహించకూడదు. ఈ మధ్యను ఎటుచూచినను జనము పోటెత్తుచుండిరట. నీరు కూడ పోటెత్తునట. ఏదో జరిగినది అని చెప్పుటకు జరిగిన పరిస్థితి అనుట ఒక యాచారమయినది. ఇట్లు చాల విషయములు మాట్లాడవచ్చును. వాటిని మరొకసారి చూతముగాక.

కె.బి. గోపాలం