జాతీయ వార్తలు

నవభారతమే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: నవ భారత నిర్మాణం కోసం కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు వారాల సమయంలోనే పలు చర్యలు తీసుకున్నాం.. రైతులు, భద్రతా దళాలు, సగటు మనిషి అభివృద్ధికోసం ఉద్దేశించిన నిర్ణయాలు తీసుకున్నామని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు వారాల్లో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం.. ఇది తమ ప్రభుత్వ పని విధానం.. ఇకముందు కూడా ఇదే వేగంతో ముందుకు సాగుతామని నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయటం అంటే.. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పటమేనని ప్రకటించారు. దేశం ఎదుర్కొంటున్న జల సమస్యను పరిష్కరించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. దీనికోసమే ప్రత్యేకంగా జల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని మోదీ తెలిపారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రు శంకుస్థాపన చేసినా దశాబ్దాల తరబడి నిధులు కేటాయించలేదు.. చివరకు యూపీఏ ప్రభుత్వం కూడా నిధులివ్వలేదు.. తాము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రారంభోత్సవం చేశానంటూ ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినవారు తనను తప్పుపట్టటం ఏమిటని కాంగ్రెస్‌ను నిలదీశారు. దేశంలోని పేద మహిళలు ఎదుర్కొంటున్న రెండు సమస్యలు మరుగుదొడ్లు, నీటి సమస్య.. స్వచ్ఛ్భారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల మొదటి సమస్యను పరిష్కరించాం.. ఇక జల సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారిస్తామని మోదీ ప్రకటించారు. విత్తనాల నుండి మార్కెట్ వరకు రైతులకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. మైక్రో నీటి పారుదలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఖాద్య తైలాల రంగంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానానికి చేరుకున్నప్పుడు మీరు ఎంతో సంతోషించారు.. మా హయాంలో ఆర్థిక వ్యవస్థ ఆరో స్థానానికి చేరుకుంటే సంతోషించరా? అని ఆయన కాంగ్రెస్‌ను నిలదీశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ను అపహాస్యం చేశారు.. కానీ ఈ లక్ష్యాన్ని సాధించకపోతే మరింత వెనకబడిపోతామని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశం కొద్దో గొప్పో ఆయుధాలను ఎగుమతి చేసేది.. చైనా ఏమీ చేసేది కాదు.. కానీ ఇప్పుడు మనం ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంటే చైనా ఎగుమతి చేస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ సాధించకపోతే మనం మరింత వెనకబడిపోతామని ఆయన చెప్పారు. పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా దేశానికి గుర్తింపు తీసుకురావచ్చునన్నారు. అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవినీతిపరులను జైలుకు ఎందుకు పంపించలేదని అడుగుతున్నారు.. ఇది ఎమర్జెన్సీ కాదు.. ప్రజాస్వామ్యం.. జైలుకు పంపించవలసిన బాధ్యత కోర్టులదని ఆయన అన్నారు. కోర్టులు బెయిల్ ఇస్తే ‘ఎంజాయ్’ చేయాలంటూ ఆయన బెయిల్‌పై ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి.. దీనిని మతాలతో ముడిపెట్టవద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. అధికారాలను అనుభవించటమే కాదు.. కర్తవ్య నిర్వహణ కూడా నేర్చుకోవాలి.. దీనికోసం మనమంతా కృషి చేయాలని అన్నారు. మన కర్తవ్యాలను నిర్వహించకపోతే మన అధికారాలు కూడా హరించుకుపోతాయని జవహర్‌లాల్ నెహ్రు హెచ్చరించారని మోదీ గుర్తుచేశారు. మార్పునకు దేశం సిద్ధంగా ఉంది.. మనమంతా రాజకీయాలను పక్కనబెట్టి నవ భారత నిర్మాణానికి నడుం బిగించాలని మోదీ పిలుపునిచ్చారు. చాలా సంవత్సరాల తరువాత ప్రజలు పటిష్టమైన తీర్పు ఇచ్చారు.. ఎన్‌డీఏకు రెండోసారి అధికారం అప్పగించారు.. మన ఓటర్లు జాగకూరుకులై ఉన్నారనేందుకు ఇదొక నిదర్శనమని మోదీ చెప్పారు. దేశ ప్రజలు అన్ని అంశాల గురించి లోతుగా ఆలోచించిన తరువాతనే తమకు మరోసారి అధికారం అప్పగించారని ఆయన తెలిపారు. అందరి హితం.. అందరి సుఖం కోసం తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన కృషిని చూసిన తరువాతనే మరోసారి అధికారం ఇచ్చారని అన్నారు. తమది పేద ప్రజల ప్రభుత్వమని ఆయన ప్రకటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని ప్రశంసించని కాంగ్రెస్ తన ప్రభుత్వం గొప్పతనాన్ని తెలుసుకోలేదని మోదీ విమర్శించారు. దేశంలో గత యాభై సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధిని బీజేపీ గుర్తించలేదంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పకొట్టారు. ఈ రోజు 25 జూన్.. దేశాన్ని నిర్బంధానికి గురిచేసిన రోజని అన్నారు. ఇదేరోజు ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి అత్యవసర పరిస్థితిని విధించారని మోదీ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. అధికారం కోసం దేశం మొత్తాన్ని జైలుగా మార్చేశారని ఆరోపించారు. తన ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితి ఉన్నా అప్పట్లో ప్రజలు ధైర్యంతో ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు.. ఇప్పుడు పదిహేడవ లోక్‌సభలో మరోసారి దేశ ప్రజలు తమ ఆలోచన, బలాన్ని ప్రదర్శించి తమకు ఓటు వేశారని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150 పుట్టిన రోజు, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. దేశంకోసం సర్వస్వాన్ని త్యాగం చేసినవారిని స్మరించుకోవవటం ఎంతో అవసరమని మోదీ చెప్పారు. స్వాతంత్య్రం కోసం మరణించేందుకు సిద్ధపడిన మనం ఇప్పుడిక దేశంకోసం జీవించవలసిన అవసరం వచ్చింది.. నవ భారత నిర్మాణానికి పని చేయవలసి సమయం ఆసన్నమైందని అన్నారు. 1942లో ‘దేశం విడవండి’ అనే నినాదాన్ని ఇచ్చిన మనం.. ఇప్పుడు దేశ సమస్యల పరిష్కారం ఉద్యమంగా మార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. అధికార, ప్రతిపక్షం అందరం కలిసి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రధాన మంత్రి సూచించారు. 130 కోట్ల మంది కోసం పని చేయాలంటే విశాల దృక్పథంతో ఆలోచించాలి.. నాది కూడా విశాల దృక్పథం.. ఆలోచన అని ఆయన ప్రకటించారు.

చిత్రం... మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ