అమృత వర్షిణి

సరస్వతీ కంఠాభరణాలు.. ధర, ఆదిభట్ల విశ్వనాథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కొందరు ప్రతిభావంతుల విషయంలో ఇది తారుమారు.
ఇక్కడ పుట్టిన తెలుగువారిలో చాలామంది ఎక్కడికో వెళ్లి స్థిరపడి పేరు తెచ్చుకుని ప్రసిద్ధులైన వారే.
త్యాగరాజు కుటుంబీకులు కంభం జిల్లా నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. అలాగే శ్యామశాస్ర్తీ కూడా - ఇక్కడ గుర్తింపు లభిస్తే ఎక్కడికో ఎందుకు పోతారు? త్యాగయ్య పరిమేష్టి గురువైన నారాయణ తీర్థులు (శొంఠి వెంకట రమణయ్య తండ్రికి తీర్థులవారు గురువు) వెళ్లి తంజావూరు జిల్లా, తిరుప్పొందుర్తిలో స్థిరపడి అక్కడ సిద్ధి పొందారు. క్షేత్రయ్య, కూచిపూడి, సిద్ధేంద్రయోగి, అంతా మనవాళ్లే. పదాల మాటల కూర్పుతో క్షేత్రయ్యలా నూటికి నూరుపాళ్లూ తెలుగుతనముట్టి పడే సారంగపాణి పదాలు ఈ వేళ అభినయించేవారు లేరు, పాడేవారూ లేరు. 18వ శతాబ్దానికి చెందిన కార్వేటి నగర సంస్థానాధీశుల హయాంలో వున్న తెలుగు కవి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి భక్తుడు అన్న సంగతి చాలామంది తెలుగువారికే తెలియదు.
పుట్టుకతోనే అబ్బిన కళలకు కళాకారులకూ ప్రభువుల ఆదరణ ఉండాలి, లేదా ప్రజలు అభిమానించాలి. ఈ రెండూ లేకపోతే ఎవరు ఆదరిస్తారో, ఎవరు మెచ్చుకుంటారో వారినే వెతుక్కుంటూ వెళ్తారు - ఆశ్చర్యంలేదు.
దోషం వలస వెళ్లిన వారిది కాదు. ఆదరించలేని వారిదే. మన తెలుగువారి దురదృష్టమేమో? మన వాళ్లను మనమే గుర్తించం. నిజానికి వీరెవ్వరికీ కీర్తి కండూతి లేనేలేదు. రాజాశ్రయం కోరలేదు.
పండుగలకూ, పబ్బాలకు, జాతీయ పర్వదినాల్లో ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాలు చూశారా? అందులో కవులకో, కళాకారులకో చేసే సన్మానాల ప్రహసనం మీకు తెలిసిందే. దానికో ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఇందులో సంగీత సాహిత్య కళారంగాల్లో బొత్తిగా ప్రవేశం లేని ఐఎఎస్ అధికారుల పాత్రే ఎక్కువ. క్రింది అధికారులు సిఫార్సు ఆధారంగా ఎంపికంతా భాషా ప్రాతిపదికగానే జరుగుతుంది. ఎవరిని ఎంపిక చేయాలో అధికార గణానికి తెలియదు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివిధ కళారంగాల్లోని వ్యక్తులు వారువారు సాధించినదంతా ఏకరువు పెట్టి ప్రభుత్వానికి దరఖాస్తులు పంపుకోవాలి. ఎంపిక చేసిన వారికి సత్కారం చేసి ఏదో అవార్డు ఇచ్చి పంపుతారు. ఆత్మగౌరవం చంపుకుని వెళ్లి సన్మానం చేయించుకుని వస్తారు. చిన్నచిన్న అవార్డుల నుంచి జాతీయ స్థాయిలో చేసే సత్కారాలన్నీ ఈ బాపతే. ఆత్మగౌరవానికి అర్థం చెప్పిన వ్యక్తుల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు. స్వాభిమానంతో ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
రాళ్లను సైతం కరిగించగల సంగీత పాండిత్యం కలిగిన గాయకులు, విద్వాంసులు కూడా ఈ గడ్డమీదే పుట్టారు. కానీ, ప్రభువులెల్ల నీచసేవకులురా పరమార్థవౌ మార్గమెరుగరు’ అని మహారాజులకు దూరంగా వుంటూ బ్రతికారు.
అటువంటి వారిలో ముఖ్యుడు నాదయోగి త్యాగయ్య. ఏళ్ల తరబడి సంగీత విద్య మీద మమకారంతో అనురక్తితో, కండలరిగేలా సాధన చేసిన విద్వాంసులను, ముందు ప్రజలు గుర్తించాలి. సంస్కారమున్న రసికులుండాలి. ప్రభువులైనా, రాజులైనా, ప్రభుత్వాలైనా గుర్తించలేక పోవడానికి ప్రధాన కారణం - అవిద్య. ఏళ్ల తరబడి సంగీతం ఎందుకు, ఏమి నేర్చుకుంటారు? ఎలా నేర్చుకుంటారన్నది ప్రభువులకు అస్సలు తెలియదు. సాధారణంగా తెలియని విషయాలపై అలసత్వం, ఉదాసీనత, చిన్నచూపు, హేళన సహజం. తెలియకపోవడం సర్వసహజమే. తెలిసినట్లు నటించడమే అసలు సమస్య. అధికార గర్వంతోనో, బాగా ధనవంతుడవ్వడం వల్లనో సంక్రమించే దుర్లక్షణమే ఇది.
తమకంటే గొప్పవారిని గుర్తించలేని దౌర్భాగ్యులెందరో కనిపిస్తారు. అధికారులెందరో ఉంటారు. కానీ ఆర్టిస్టులు కొందరే పుడ్తారని తెలియని వారి సంఖ్య ఎక్కువ.
హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు లాంటి పుంభావ సరస్వతి ఎంతటి ప్రజ్ఞావంతుడో అంతటి స్వాభిమానం కలిగిన వ్యక్తి. ఎవరినీ ఖాతరు చేసేవారు కాదు. కుండబద్దలు కొట్టినట్లు సత్యమే పలికిన ధీరుడు. కొందరికి అది నచ్చేది కాదు. భయపడిన వారున్నారు. కిట్టనివారూ ఉన్నారు.
సంగీత జ్ఞానం బొత్తిగా లేకున్నా ఉపన్యాసాలు దంచేవారుంటారు చూడండి. అటువంటి వారు మహారాజులైనా, కోటీశ్వరుడైనా సరే. దాసుగారు ఏ ఒక్కర్నీ లక్ష్యపెట్టలేదు. ఎవ్వరినీ లెఖ్ఖ చేయలేదు. వంగివంగి సలాములు చేయలేదు.
ఇది కవి పండితులకైనా సంగీత విద్వాంసులకైనా ప్రధానంగా ఉండవలసిన లక్షణం.
ఆత్మవిశ్వాసం లేనివారు వంగి వంగి సలాము చేస్తూనే ఉంటారు. కానీ దాసుగారి జీవితానుభవాలు దీనికి భిన్నం. ఒకసారి, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులైన సి.ఆర్.రెడ్డి, విశాఖపట్నం రైల్లో వెళ్తున్నారు. విజయనగరం ప్రముఖులు ఆయన్ని చూసేందుకు స్టేషన్‌కు వచ్చారు. దాసుగారు కూడా అక్కడున్నారు. విశ్రాంతి గదుల సమీపంలో రాతి స్తంభానికి ఆనుకుని, తన వెండి పిడికర్ర మీద గడ్డం ఆన్చి చూస్తూ నిలబడ్డారు. దాసుగార్ని చూసిన రెడ్డిగారు, దగ్గరకు వెళ్లి కుశల ప్రశ్నలడిగి ‘ఏమి ఇలా వచ్చారు?’ అనగా, ‘ఏదో వైస్ ఛాన్సలర్‌గారు వెళ్తున్నారని తెలిసి, అందరితోపాటు నేనూ చూసేందుకే వచ్చాను’ అన్నారు. ఆ మాటకు మేమేమి వైస్ ఛాన్సలర్స్ మండీ? యు ఆర్ ది యూనివర్సిటీ ఇట్‌సెల్ఫ్’ (మీరే ఒక విశ్వవిద్యాలయం) అని అభినందించారు. దానికి వెంటనే దాసుగారి సమాధానం.. ఈ సంగతి మీకు తెలుసు. నాకు తెలుసు. ఈ వచ్చిన పెద్ద మనుషులకు తెలిస్తేగా? అన్నారు. రెడ్డిగారికి నవ్వాగలేదు. దాసుగారు గొప్ప విమర్శకుడు. పాటలో మంచిని మెచ్చుకుని అభినందించేవారు. ఆయన ఆత్మవిశ్వాసం, స్వయంప్రతిభ, సంగీత సాహిత్య ప్రజ్ఞ, అసమానం, అమోఘం. ఈ సహజశక్తితో ఏ సభల్లోనైనా, వారున్నారు, వీరున్నారనే జంకు లేకుండా, రాజాస్థానమైనా పెద్దపెద్ద ప్రభుత్వోద్యోగులైనా, కలెక్టర్లు, జడ్జీలు, మంత్రులున్న సభలైనా, నిర్భయంగా మాట్లాడేవారు.
‘ఏమండీ దాసుగారూ? సభకు వచ్చిన వారిని అలా దుయ్యబట్టితే వాళ్లేమీ అనుకోరా?’ అనడిగితే.. ‘ఒరేయ్! ఎవ్వరూ ఏమీ అనుకోరు. నా ఉపాసన బలం అటువంటిది. ఆ దైవశక్తి, వాళ్ల నోళ్లు మూయిస్తుంది. నేనూ మీలాగా ఊరుకుంటే, ఈ లోకంలో మంచి చెప్పే వారెవరురా?’ అనేవారుట.
సాహితీ ప్రపంచంలో కళాప్రపూర్ణ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ హిమాలయ శిఖర సదృశుడు.
స్వాభిమానం, స్వతంత్ర జీవనం, సమయస్ఫూర్తీ కలిగి విశేష ప్రజ్ఞాప్రాభవంతో, తనకు తానే సాటి యనిపించుకున్న స్వయం సంపూర్ణుడు.
ఆయన్ని ఇతర కవులతో పోల్చలేం. ఆయనకాయనే సాటి. తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రజ్ఞాప్రాభవాలు కలిగిన పుంభావ సరస్వతి.
విశ్వనాథ వారిలో ప్రముఖంగా కనిపించే సమయస్ఫూర్తి, చమత్కార భాషణం ప్రత్యక్షంగా చూశాను. సామాన్యులకు గిలిగింతలు పెట్టేలా వుంటూనే, పండితులైన పెద్దలకు చురకలు వేసినట్లు కనువిప్పు కలిగించేలా వుండేది.
రెండు సందర్భాలను ముచ్చటిస్తాను. ఒకటి ఆయనకు న్యూఢిల్లీలో తెలుగు సంఘం తలపెట్టిన సన్మానం. ఆయన కుమారుడు కీ.శే.విశ్వనాథ పావనిశాస్ర్తీ స్వయంగా నాకు చెప్పినదే.
జన్మతః ప్రతిభా వ్యుత్పత్తులు కలిగి తన వాణి స్వకపోల కల్పితమై, వశం చేసుకున్న విశ్వనాథ ఆంధ్ర సాహిత్యంలో నూతన ప్రక్రియలకు ఆద్యుడై, ఆరాధ్యుడైన కవికుల తిలకుడు. సాహిత్య విషయంలో ఆయన్ని సమీపించి మాట్లాడే ధైర్యం కవిశేఖరులెందరికో వుండేది కాదు.
రామాయణ కల్పవృక్షాన్ని ఈ జాతికి అందించి ‘జ్ఞానపీఠం’ కైవసమైన కవిసామ్రాట్ ఆయన. రామాయణాన్ని తెనిగించిన కవులెందరో వున్నారు. కానీ ఈయనకు సాటి మరెవరూ లేరని డా.దివాకర్ల వెంకటావధానే అన్నారు. అతిశయోక్తి ఎలా అవుతుంది? మన తెలుగువారందరూ కలిసి నిర్వహించే న్యూఢిల్లీలోని ఆంధ్ర మహాసభ వారు ఆయన్ని సన్మానించాలనీ, సత్కారం చేయాలని సంకల్పించి, ఒక తేదీ నిర్ణయించారు. విశ్వనాథ వారు సంతోషంగా అంగీకరించారు. నాలుగు రోజుల తర్వాత మరో ఉత్తరం వచ్చింది. వివిధ కళారంగాల్లో లబ్దప్రతిష్ఠులైన వారిని కూడా సత్కరింప దలచినట్లు చెబుతూ ఆ రోజుల్లో సుప్రసిద్ధ సినీ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్యను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల పట్ల బొత్తిగా అవగాహన లేని ఏర్పాట్లు ఎలా ఉంటాయో చూడండి. అంతే. విశ్వనాథ వారికి కోపం కట్టలు త్రెంచుకుంది. సాహిత్యంతో సంబంధం లేని వ్యక్తితో సన్మానమంటే రాదా కోపం? ముఖమాటం లేకుండా ఆ సెక్రటరీని నిలదీసి అరగంటసేపు తలంటేశారు. ‘ఎవరిని ఎలా గౌరవించాలో తెలియని సంస్థలుండి ఏమి? లేకపోతేనేమి? మీ అభిరుచి అలా ఏడిసిందని, చీవాట్లతో నీరాజనాలిచ్చి వెంటనే ప్రయాణం విరమించారని, పావని శాస్ర్తీ పగలబడి నవ్వుతూ చెప్పాడు.
విశ్వనాథ వారి కోపానికి గల కారణం విజ్ఞులు మాత్రమే గ్రహించగలరు. యుక్తాయుక్త విచక్షణ కలిగిన వ్యక్తుల్ని వెదకవలసిన పరిస్థితి ఇప్పుడు మాత్రం లేదనుకుంటున్నారా? సంగీత సాహితీ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని తగ్గించి మాట్లాడే సాహసం చేసే వ్యక్తుల్నీ లేదా సంస్థల్నీ ఎదిరించగలిగినప్పుడే ఆ విద్యలకు గౌరవం ఏర్పడుతుందని వేరే చెప్పాలా?