వీరాజీయం

పాకిస్తాన్ గాడిదలంటే చైనాకు మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనుకటికి ‘వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడో లేదో తెలియదు’ కానీ- ప్రస్తుతం చైనావాడు మాత్రం పాకిస్తాన్ గాడిదల సేవలకి సిద్ధంగా ఉన్నాడన్నది ఒక ప్రముఖ వార్త! సరే, చాలాకాలంగా చైనాకి పాకిస్తాన్ నుంచి గార్ధ్భ చర్మాలు చాలావరకు దొంగ రవాణా చేస్తున్న ముఠాలు నాలుగందాల లాభాలు చేసుకుంటున్నారు. ఇదిలా వుండగా, గత నెల 26వ తారీఖున కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ‘పెద్ద గాడిదల ముఠా’ ఒకటి పోలీసులకి అడ్డంగా దొరికిపోయింది. వీళ్ళు గాడిదల్ని కాదు- వాటిని నేరుగా విమానం ఎక్కించడం సాధ్యం కాదు కనుక వాటి పచ్చితోళ్లని చైనాకి దొంగ ‘బంగీ’లుగా పంపించేస్తున్నారు. ఇది ఒక బడా స్మగ్లింగ్ వ్యాపారం. కరాచీ విమానాశ్రయం నుంచి రహస్యంగా పంపబడుతున్న అక్షరాలా 4,736 ఖరము చర్మములను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో చీనావాడు ఒక నాయకుడై ఉంటాడు. ఇలా దొరికిపోయిన చర్మ సంపద విలువ- పాక్ రూపాయల్లో పదకొండు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు. ఆఖరికి- ఒక్క గాడిద చర్మం అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకున్నా చాలు ఇరవై ఐదు వేల రూపాయలు చేతిలో పడతాయి. అక్కడి గులిస్తాన్ జవహర్ అనే షాపు గిడ్డంగిలో ఏకంగా 152 సంచులు గాడిద తోళ్లతో నిండినవి దొరికాయి అంటేనే తెలుస్తోంది ఈ గాడిద చర్మాలకు చీనా దేశంలో ఎంత విలువ ఉన్నదో! చీనా వాళ్ళు, పాకిస్తానీయులు కలిసి ఒక ముఠాగా పనిచేస్తూంటారు.
పాకిస్తాన్‌లోని వాయవ్య సరిహద్దు రాష్ట్రం ఖైబెర్ ఫక్తూన్ఖ్వా ఈ మేలు జాతి గాడిదలకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రానికి ఒకవైపు అఫ్ఘానిస్తాన్, మరోవైపు ఆక్రమిత కాశ్మీరు వున్నాయి. కొండ ప్రాంతలలో- అవి ఎంత మంచు కొండలయినా పరవాలేదు అక్కడ గాడిదలు, కంచర గాడిదలు- అవే మనిషికి మంచి నేస్తాలు. అందుకే మనవాళ్ళు అంటారు గాడిద చాకిరీ అని, అలాగే గాడిద బరువు అనీ.. మనదేశంలో కూడా గాడిదలు నిన్న మొన్నటిదాకా ‘మడేలన్న’కు అన్నభిక్ష పెట్టగల ఓపికగల జంతువులు. కానీ, ఈమధ్య చాకిరేవులే మాయం అయిపోతున్నాయి కనుక మన నగరాలలో వీటి ఓండ్రింపులు వినరావడం లేదు. కాకపోతే మనం ఏ దేశానికి గాడిదల్ని కానీ, వాటి చర్మాలను కాని అమ్ముకోము- కాని వీటి పాపులారిటీకి ఏమీ తక్కువ లేదు. మన యోగి వేమనగారు ఒకసారి అన్నాడు కదా? ‘గంగిగోవు పాలు గరిటెడైన చాలు కడివెడయిన నేమి ఖరము క్షీరమూ’ అని- కాని ఓ మిల్లిగరిటెడు గాడిద పాలు చాలు కీళ్ళ వాతాన్ని తన్ని పంపించేస్తాయి(ట)!
చైనాలో గాడిద చర్మాలతో రకరకాల మందులు, జేలటిన్ వగైరా తయారుచేస్తారు.. ఎందుకు? పాక్, చైనాల ‘గాడిద చెలిమి’ ఎందుకు ఇంత చక్కగా ఖరము పాలవలె చిక్కగా ఉన్నదో తెలిసిపోయిందిగా. ఖైబర్‌ఫక్తూన్ఖ్వా ప్రాంతమంతా కొండ జాతులు.. గాడిద పెంపకమే అక్కడి వారికి ముఖ్య వ్యాపకం. కాకపోతే వాళ్ళు ఎవరిమాటా వినే రకం కాదు. ముందు వాళ్లని దువ్వాలి, ఆనక గాడిదల సంగతి... పాకిస్తాన్‌కు ఇలా తోళ్ళు దొంగలు తోలుకుపోతున్నారన్న వ్యధకన్నా, మరో బాధ వున్నది. గాడిల తోళ్ల కోసం వాటిని చంపాలిగా.. కాని వాటి మాంసాన్ని ఏమి చెయ్యాలి? మాంసం ఎగుమతి కాదు- ఎవరూ భుజించరు- పైగా, గోమాంసమనీ, గొర్రె మాంసం అనీ లేదా లొట్టిపిట్ట మాంసం అని హలాల్ మాంసంగా అంటే అల్లాకి నివేదన చేసినది అని అమ్మేస్తున్నారు (అయ్యో పాపం అని కూడా అనరు). ఈ మతలబు తెలిసినా అరికట్టడం సాధ్యం కావటం లేదు. పైగా జనాల్ని మభ్యపెట్టి రెండు చేతులా తినేస్తున్నారు.. దీన్ని ఎలా అరికట్టాలి? ప్రభుత్వ బొక్కసానికి అదనపు ఆదాయం ఎలా తేవాలి? అని మేధావులు తలలు బద్దలు కొట్టుకొని ఆలోచించారు. చర్మాలు, తోకలు, డెక్కలు అని గాక నేరుగా గార్ధ్భరాజములనే చైనా వాళ్లకి ఎగుమతి చేస్తే? ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. అంచేత, ముందుగా గార్ధ్భ సంరక్షణ పోషకాభివృద్ధి పథకం ఒకటి- ఓ వంద కోట్ల రూపాయలు కేటాయించి తయారుచేసుకున్నారు. చైనా నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ స్కీము లక్ష్యం. దీనికోసం తాజాగా చైనా విపణిలో ఒక రోడ్ షో నిర్వహించారు పాక్ వాణిజ్యవేత్తలు. మామూలుగానే, చైనా మీద ఆశలు చాలా వున్న దేశం- వాటిలో ఈ గాడిదల వ్యాపారం ఒకటి. ఈ వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో వ్యవసాయం, గాడిద పాడి పరిశ్రమ చైనా వాడి ఔదార్య సాయంమీద ఆధారపడతాయి. ఈ తపన ఇండియా మీద అసూయతో మరింత ప్రబలింది.
అంచేత, పాకిస్తాన్ చైనా-పాక్ వాణిజ్య నడవా పేరిట ఒక బిజినెస్ కారిడార్‌ని ఏర్పాటుచేసుకుంటున్నది. దీనికి పెట్టుబడిగా నలభై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్లను వెచ్చించాలని పాక్ సంకల్పం- అంతా బాగున్నది కాని దొంగ మాంస వ్యాపారాన్ని ఎలాగా అరికట్టాలి? ఈ రాష్ట్రం అంతటా చిన్న చిన్న కొండ జాతులవారి స్వయంపాలక ఇలాకాలున్నాయి. వాళ్ళు తిరగబడకుండా వాళ్ళ చేతనే గాడిదల సంపదని పెంచుకోవాలన్నది పాకిస్తాన్ ఎత్తుగడ. కాకపోతే, గాడిదలమీద మమకారంతో వచ్చే పెట్టుబడిదారులు చాలా షరతులకి అంగీకరించాలి. గాడిదల కోసం వాళ్ళే షెడ్డులు నిర్మించాలి.. వాటి వీర్య సేకరణ, ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లు చూడాలి. ఆఫీసు బిల్డింగులు కూడా వాళ్ళే చూసుకోవాలి కానీ సిబ్బందిని మాత్రం స్థానిక గవర్నమెంటు అందిస్తుంది. ఇది ఒక జాయింటు వ్యాపారంలా రెండు గాడిదలు, ఆరు పిల్లలు అన్నట్లుగా గార్ధ్భా అంటే గాడిదల జనాభా పెరగాలి. మిత్రలాభం గాడిదలు కూడా చేకూరుస్తాయన్నమాట. ఇరుదేశాలు రుజువుచెయ్యాలి. వాణిజ్య నడవా అంతా గాడిదల ఓండ్ర భేరీనాదంలాగా నిండాలి అనుకుంటున్నారు. చైనా దిగివచ్చేది కాదు గాని, 2015లో పాక్ గాడిదల చర్మాన్ని ఎగుమతిని నిషేధించింది. చైనా మందులు లేక అల్లాడిపోయింది. దెబ్బకి చైనా ‘మీ ఇష్టం మిత్రమా, అల్లా దయామయుడు’ అంటూ దారికి వచ్చింది అని లోకల్ మీడియా వారి వ్యాఖ్య.
ఇట్స్ ఏ కిక్- యాస్ సొల్యూషన్ ఫర్ దెయిర్ ఫ్రెండిషిప్!