వీరాజీయం

ఇది వ్యవస్థా? అవస్థా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకొచ్చిన ప్రగతి..? ఎందుకొచ్చిన అత్యంత సోకాల్డ్ ఆధునికత..? అరచేతిలోనే ప్రపంచం అంతా చూడొచ్చు. ఆగమేఘాల మీద ప్రపంచాన్ని చుట్టి రావొచ్చు. కాని రోడ్లకి రక్తదాహమెక్కువ అయిపోయింది. తెల్లారేపాటికి ఇప్పటికీ- ఇంటర్నెట్ కాలంలో కూడా పేపరు కోసం ఎదురుచూడటం అలవాటైపోయింది. రివ్వున మూడో అంతస్తుకైనా- ఎగిరి వచ్చిపడే ‘పిట్ట’ (పేపర్ చుట్ట) అది. దాన్ని విప్పి చూడాలంటేనే భయం- ఆందోళన.. రక్తసిక్తమై వస్తున్నది దినపత్రిక.. ఏ రోడ్డుమీదా భద్రత లేదు. కవులు రాస్తూ వుంటారు గొప్పగా గజల్స్- ‘ప్రేయసీ నీకోసం నేను నా పాడెని జేబులో పెట్టుకొనే తిరుగుతున్నాను..’ (జేబ్ మే కఫన్ రఖ్కర్ చలతా హుం) అని. అలాగే రోడ్డుపై ప్రయాణం చేసేవాడు తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోతాడో? గమ్యం చేరుకుంటాడో? తెలియని- స్పీడు యుగం ఇది..
ఉత్తరాది కొండలపై, లోయల్లో చూడటానికే వొళ్ళు గగుర్పొడిచే రోడ్డుమీద కన్నా- మామూలు సమతల ప్రాంత రోడ్లమీదనే బోల్తాలు- శాల్తీల గల్లంతులూ ఎక్కువైనాయి. మారుమూల అడవుల్లో లేదా అడవుల్లాంటి ప్రాంతాల్లో కాదు.. నలుగురు తిరిగే చోట ‘అయిదు నక్షత్రాల’ నాగరికత మధ్యనే పైశాచిక పాశవిక మానభంగాలు.. మానవ మృగాలు చెలరేగిపోతున్నాయి. లోయలో పడుతుందా బస్సు.. లేక వూరు పొలిమేర చేరుతుందా? దేవుడికే తెలియాలి మనం ఉంటున్నది అవస్థా? వ్యవస్థా? ప్రాయం రాని ఆడపిల్లల్ని మానభంగాలకు గురిచేస్తున్నారు. మగాళ్లా? మృగాళ్లా? అంటూ తిడతారు.- ఒరేయ్ మగాడా? ఆడదాన్ని బ్రతకనియ్యవా?.. అంటూ ఆవేశంగా నినాదాలు నిష్టూరాలు పెట్రేగిపోయే కాలం అంతే.. అది కూడా ఇవాళ దాటిపోయింది..
మైనర్- పసికూనలకి, చిన్నారి బాలికలకి అత్యాచార విపత్తు సంభవించడం- నిత్య వార్త అయిపోతోంది. పాలకుల ‘మన్ కీ బాత్’లో కాని.. మాటల్లోగాని ఈ దారుణ ఘోరకలి మీద ఆందోళన.. బెంగ.. ఇంత పిసరు కనపడటమే లేదు. మానభంగం చెయ్యడం కూడా కాదు.. ఆ దుర్భర దుష్ట సన్నివేశాన్ని మొబైల్‌లో చిత్రీకరించి- బజారున పెట్టడం ఒక పైశాచిక వినోదం అయిపోయింది.
నాయకులారా! సోకాల్డ్ సంఘ సంస్కర్తలారా? మగవాడ్ని తిట్టడంతోనే సరిపెట్టుకుని- ఓదార్పు పొందే అభ్యుదయవాద మహిళా లోకమా? ఎవరు నిందార్హులు? మొన్నటికి మొన్న కాన్పూర్ దరి మహారాయ్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో నలుగుర్ని రేప్ ఆరోపణ మీద పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇంతవరకే వింటే- ఈ దౌర్భాగ్య దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా- ఇంటర్నెట్ నెట్, మొబైల్స్ యుగం సాక్షిగా- అది సాధారణ వార్త ఐపోయింది. కాని ఈ వార్తా వివరం అతి భయంకరం.. నాలుగేళ్ల పసికూన- ఆటలే గాని మాటలు రాని ముక్కుపచ్చలారని పాప- అత్యాచారానికి బలి అయిపోయింది.. ఇంకా ఘోరకలి ఏమిటీ అంటే- అదుపులోకి తీసుకోబడ్డ ఆ నలుగురు నిందితులు కూడా ఉన్మాద పురుషులు లేదా కామోద్రేక రౌడీలు, త్రాగుబోతులూ కాదు... పవిత్ర భారతదేశమా? నీకిదేమి? శాపం తల్లీ?.. ఆ నలుగురు కూడా మైనర్ యువకులే.. అందులో ఒక్కడు పనె్నండు సంవత్సరాల ప్రాయం వాడు.. మిగతా ముగ్గురూ.. ఆరేండ్లవాళ్ళు.. ఎవరు ఇస్తారు సంజాయిషీ దీనికి? ఎవరు జావాబుదారీ?
మొబైల్స్, స్మార్ట్ సెల్‌ఫోన్లు.. డేటాకార్డు వేసి మరీ ఇచ్చి తమతమ సంతానాన్ని- ఆడమగ పిల్లల్నిద్దరినీ సమానంగా-(చెడగొడుతూ) పెంచుతున్న- సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పేరెంట్సా? లేక ‘బేటీ బచావో..’ అన్న నినాదమే ఏదో మంత్రం అన్నట్టు, ప్రగతికి చిట్కా అన్నట్లు- స్వోత్కర్షలో మునిగి తేలే నాయకత్వమా? ఇదే వారంలోనే- మరో దుర్ఘటన- అది ప్రమాదం కాదు. దారుణం. ఉత్తరప్రదేశ్‌లోని బస్తి జిల్లాకి చెందిన ఒక వూళ్ళో ఒక మైనర్ యువతిని-ముగ్గురు కిశోర ప్రాయంలోనే వున్న కుర్రాళ్ళు- మోటారు సైకిల్‌మీద దారికడ్డంగా వచ్చి ఎత్తుకుపోయి- తెల్లవార్లూ.. ఆ తరువాత ఏం జరిగిందో వేరే చెప్పక్కరలేదు.
ఆ బాలిక ఎప్పటిలాగే తన ఇంట్లో రాత్రి నిద్రపోతూ మధ్యలో లేచి- ‘అమ్మా.. అమ్మా!’ అంటూ కడుపునొప్పితో రోదిస్తూ వుంటే- ఆమె తండ్రి లేచి కూతుర్ని తీసుకొని డాక్టరు దగ్గరికి తీసుకొనిపోతున్నాడు. అంతలో ఈ మైనర్ ప్రాయ దుష్టత్రయం- మొబైల్స్ చేతిలో ధరించి- మోటారు బైక్ మీద వచ్చి- ఆ తండ్రిని చావగొట్టి- బాలికని ఎత్తుకుపోయి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణానికి ‘వైరల్ వైరల్’ అంటూ ఒక కొత్త పేరుపెట్టి ఘోర దృశ్యరూపంలో యూ ట్యూబ్‌లో.. ఉచిత షార్ట్ ఫిలిమ్స్‌గా అందరూ చూశారు. కొంతమంది శాడిస్టులు ఇలాంటివి దాచుకొని (‘సేవ్’ చేయడం అంటారు ఆ ప్రక్రియను) పదే పదే చూస్తూ ఉండవచ్చును. ఇలా అనేక సంఘటనల్లో మైనర్ నేరస్తులు, బాధితులు కూడా ఒక సమస్య అయిపోయారు. దేశంలో స్వాములు, సన్నాసులు, సంస్కర్తలు- అంతా దోసెడు నీళ్ళల్లో పడి చావాలి ఇట్టి దృశ్యాలను చూసి. కానీ చావరు వాళ్ళు.. ప్రజాస్వామ్యంలో వాళ్ళు శాశ్వతం. జనం మాత్రమే పాపాత్ములు.. అన్నట్లు లెక్చర్లు కొడతారు.
ప్రొద్దునే్న పేపరు తీసి-పేజీలు తిరగేస్తూ- ఒక కలం పట్టుకొని- మైనర్ మానభంగాలు, రోడ్డుప్రమాదాలు ఎన్ని వున్నాయో ‘టిక్’ చేసుకుంటూ పొండి.. మీది వీక్ హార్ట్ అయితే మాత్రం- మొబైల్ యాడ్లు, సినిమా బొమ్మలూ చూసుకోండి.. మన ఇంటర్నెట్ యుగ శోభ అంతా ‘యాడ్ల’లోనే.. అంటే ప్రకటనలోనే.. మొబైల్స్ వెరైటీలోనే.. కానవస్తు వుంటుంది..
ఇలాంటి ఘటనలు జరిగినపుడల్లా మంత్రులు విలేఖరుల సమావేశాలను నిర్వహించి- ఇంకా కఠినంగా కొత్త చట్టాలను తెస్తాం అంటారు గొప్పగా. చట్టాలు పొరపాటున కోర్టులోకి పోయాకా.. ముగ్గురు నలుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసి వెళ్ళేదాకా కేసు- చూయింగ్ గమ్‌లా సాగుతూ వుంటుంది..
పదహారేళ్ళ లోపు పిల్లలు మోటారు శకటం తోలుతూ పట్టుబడితే- వాళ్ళ అమ్మనాన్నలని బుక్ చేసేయ్యమన్న చట్టం వుంది. అలాగే- బాలబాలికలకి దరిద్రగొట్టు అసభ్య అసహ్య అక్రమ లైంగిక సంబంధాల వెబ్‌సైట్లని ఎక్కువగా చూపించే - రంగురంగుల హంగుల స్మార్ట్ఫోన్లను అందించే మాడరన్ జంటలని బుక్‌చేసే చట్టాలు తీసుకొని రండి.. మొగుడూ పెళ్ళాం ఇద్దరి కలిపి ఓ రెండు లక్షల దాకా కేవలం ‘వొళ్ళో కంప్యూటర్ పెట్టుకొని చేసే’ ఉద్యోగాల్తో అర్జిస్తున్నాం.. ఎక్కడా కన్నం వెయ్యడం లేదు. మా ఆడపిల్లలకు స్మార్ట్ ఫోను, పిజ్జాలు, జీన్లు ఇవ్వకపోతే వాళ్లు మమ్మల్ని క్షమించరు అనే తల్లితండ్రుల ముందు- చట్టాలు, విలువలు అన్నీ చెత్తే.. ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు అప్‌లోడింగ్ సదుపాయాలు వగైరా వున్న సెల్‌ఫోన్లను ముందు నియంత్రించండి.
‘నీకెందుకు కెమరాలున్న సెల్? నువ్వేమైనా విలేఖరివా? గూఢచారివా?... రేడియోను ఇంట్లో పెట్టుకుంటేనే లేదా- వెంట పెట్టుకుంటేనే లైసెన్స్ గురించి అడిగేవారు గతంలో. సైకిలు తొక్కితే- దానికో లైసెన్స్, లైటు ఉండాలనే వారు.. నేడు స్మార్ట్ఫోను తుపాకీ కన్నా డేంజరస్ అయిపోయిన సాంఘిక పరికరం.. పిల్లల చేతికెందుకు ఇవ్వాలి? అమెరికాలో తుపాకులు పిల్లల చేతిలో పెడతారు? అట్లాగే వుంది ఇది?! నగదు రహిత లావాదేవీలకు సాదాసీదా ‘మోదీ మార్కు’ సెల్ డబ్బాలను- మంజూరు చెయ్యండి.. బూతులు, అవినీతులు నిరంతరం బోధించే వ్యసన శ్రవ్య దృశ్య పరికరాలను కరతలామలకం చేసి- ఇంటింటికి వంటింటికీ- వైఫై ఇస్తాం అంటూ ప్రలోభ పెట్టకండి. బార్‌లెందుకు? బ్రాందీ షాపులెందుకు పెడతారు.. ఆనక త్రాగొద్దని చట్టాలెందుకు? డర్టీ చానెల్స్‌ను,వెబ్ సైట్లను నిరోధించలేని- నియంత్రించలేని గవర్నమెంటూ- నువ్వు కూడా అంటే గవర్నమెంటూ, దాని నాయకత్వమూ కూడా నేరస్తులే.. మీరు ఈ ఘోర నేరాలలో విచారణకి బోనులో నిలబడాలా? వద్దా?
లెట్ దిస్ బి ది టాపిక్ ఫర్ ఇంట్రోస్పెక్షన్

virajiyam-- 92900 99512