వీరాజీయం

ధోనీ, గంభీర్‌లకు భాజపా గాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే లోక్‌సభ ఎన్నికలు కనుచూపు మేరకి చేరుకున్నాయి. ఇప్పుడు ఎంపీలుగా కూర్చున్న పెద్దమనుషులకు టిక్కెట్లు ఇస్తే వాళ్లు మళ్లీ నిలబడతారేమో గానీ- గెలుస్తారా? అన్న అనుమానం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీని వేధిస్తున్నది. అందుకని.. మోదీ-షా ‘ థింక్‌ట్యాంక్’- కొత్త సెల బ్రిటీలను పట్టుకొని, వాళ్లకి అడుగులకు మడుగులొత్తుతూ తీసుకొని వచ్చి టిక్కెట్లు ఇచ్చి, ‘ఓల్డ్ బేండికూట్లను’ వదిలించుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోగా ఎన్నికలు తప్పవు. ఈలోపు అధికారం అనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కొత్త దేవుళ్లు ఎవరయ్యా? అంటే- ఇప్పుడు ఇంకెవరు? ధోనీలు, కోహ్లీలు వీల్లేగా..! క్రికెటర్లు అంటే అందరూ ‘మాస్’ అయిపోతున్నారు, ఫిదా అయిపోతున్నారు. అటు చూస్తే గాలి కెరటాలలో-ఈ కొత్త దేవుళ్‌ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం క్రికెటర్ ధోనీ పేరు అన్ని దిక్కులా ధనాధన్‌గా పేలుతోంది. ఢిల్లీలో మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు భాజపా సర్కిల్స్‌లో వినవస్తోంది. ఇంకో క్రికెటర్ వీరేంద్ర సెహవాగ్ పేరు కూడా చెప్పుకుంటున్నారు. వీరు గాక నాన్- పొలిటికల్ రంగానికి చెందిన సినిమా స్టార్లు కూడా జాబితాలో ఉన్నారు. ప్రధాని మోదీ భక్తజనంలో అగ్రగణ్యుడిగా చేరిపోయిన బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్ ఒప్పుకుంటే అతన్ని నిలబడమని అడుగుతారట. హిందీ నటి మాధురీ దీక్షిత్‌కి ఇంకా గ్లామర్ ఉంది. మరో హేమమాలిని కాగల గ్లామర్ మాధురిలో ఉందని అమిత్ షా బృందం ఆశ. తిరువనంతపురం సీటును మళయాల నటుడు మోహన్‌లాల్‌కు కేటాయిస్తే.. గెలుపు గ్యారెంటీ ఉంటుందేమో?
అయితే క్రికెట్ దేవుళ్లకు టిక్కెట్లు ఇచ్చి- ఇక్కట్లు కొనితెచ్చుకోవడమా? రిస్కెందుకు? అని కొంతమంది దీర్ఘదర్శుల యోచన. ఎందుకంటే భారతరత్న పురస్కారం ఇచ్చి పార్లమెంటులో కుర్చీ వేసి మంగళ హారతులు పడితే క్రికెట్ దేముడు సచిండు మొహం ‘చాటేసిండు’. ఇవాళ పద్మభూషణ్, ఖేల్త్న్ర, క్రికెట్ భూషణ మహేంద్రసింగ్ ధోనీ పేరు క్రికెట్ మైదానంలో ధోన్ ధోనీ .. అంటూ మార్మోగిపోతోంది. కనుక ధోనీ గెలుపు గుర్రమే అను కుంటున్నారు అమిత్‌జీ వర్గీ యులు. బ్యాట్ వీరుడు, నవ మోహంగుడు అంటూ అతడ్ని రంగం లోకి దింపితే -అతని చేతికి గ్లోవ్స్ తొడిగి బాక్సింగ్ కి పంపినట్లు అవుతుందేమో? అన్నాడో నిత్య శంకితుడు. ఇలాకొత్త వాళ్లని పిలిచి వాళ్ళ చేతులకి వోట్ల జోలి కట్టి పంపితే? మొదటికే మోసం కాదా? పాత వారిని బరిలోకి దింపితేనే బెటరేమో అనుకున్నారు పార్టీలో పాతవారు కొందరు. కాదంటే పాతశాల్తీలు ప్రతిపక్షానికి ఉచిత సేవలు ఇస్తాం అంటూ పోయి కొమ్ము కాస్తారేమో? సరే... ధోనీ బ్యాట్ ఒగ్గేసి-వికెట్ కీపింగ్ గ్లోవ్స్ అవతలపెట్టి మోదీ భజన చేస్తూ దేశంలో ‘ఓట్లు’ అడుక్కుంటూ తిరగడానికి సిద్ధం అవుతాడా? ఒక రంగంలో ‘ఒట్టిపోతే’నే, మరో రంగంలోకి దూకుతాడెవడైనా.
ధోనీ మంచి స్పీడు మీద ఉన్నాడు. అయనా అతడు సందిగ్ధంలో పడ్డాడు. రాజకీయరంగలోకి ప్రచార రథసారథిగా ధోనీని లాగాలన్న ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఆగస్టులో ధోనీ ఒక యాడ్ షూటింగు కోసం సిమ్లా వెళ్ళాడు. ఇట్లా విమానం నుంచి సతీ సమేతంగా దిగాడో లేదో, హిమాచల్ ప్రదేశ్ పాలకులు రావయ్యా మహేంద్రా.. మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా... అంటూ ఘనంగా ఆతిథ్యం ఇచ్చి అతని భార్య ‘సాక్షి’- సాక్షిగా అన్ని ఖర్చులు సంతోషంగా భరించి - కాంగ్రెసు పార్టీ అధినేతల చేత తిట్లు, శాపనార్థాలు తిన్నారు. ఇటు ధోనీ బయటికి గంభీరంగా ఉన్నా లోపల రైళ్లు పరిగెట్టాయ. అటు అమిత్ షాకీ అంతే. గంభీర్ సంగతి వేరు. ధోనీ 1980, జూలై 7న జన్మించాడు. కాగా, గంభీర్ గౌతముడు అంత బుద్ధుడేమీ కాదు. కాకపోతే ధోనీ కన్నా కొంచెం వయస్సులో చిన్న. ఇద్దరూ రాజకీయాలకి చిన్న.. క్రికెట్‌కి పెద్ద వయస్సు గల వారే. గంభీర్, ధోనీ ఇద్దరూ 2011 ప్రపంచ కప్ వీరులే. తేడా ఏమిటంటే- ధోనీకి ‘మిస్టర్ కూల్’ అన్న జనం పెట్టిన కీర్తి కిరీటం అదనంగా ఉంది. అతను ఏప్రిల్‌లో రానున్న ప్రపంచ కప్ కి కూడా వికెట్లకు రక్షకుడిగా-గెలుపుకి భరోసాగా ఉంటాడని- భారత కోచ్ రవిశాస్ర్తి సహా అందరు నొక్కి వక్కాణిస్తున్నారు. గంభీర్ ఆట అటకెక్కింది. కేవలం రికార్డులు మిగిలాయి. షార్ట్ టెంపర్ ఎక్కువ. చీటికి మాటికి ఎదుటి వాడి కాలరు పట్టుకొనే రకం.
అవతలి పార్టీలు కూటమి కడతాయా? లేదా? అన్నది ప్రశ్న కాదు. భాజపా కాక మిగతా పార్టీల వారూ మహా ఘటికులు. మాయావతి, మమతా బెనర్జీ లను తక్కువ అంచనా వెయ్యడం ప్రమాదమేనని చాలామంది మోదీ భక్తుల భయం. చివరి క్షణంలోనైనా గట్టిగా ఆడేయగలరు. అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీది కాగలదు. ‘నరుడా.. ఏమి నీ కోరిక?’ అన్నట్టు- ఓ వోటరూ.. ఏమి నీ కోరిక? అంటే సవాలక్ష అడుగుతాడు . సహనమేరా మన కర్మ అనుకుని అందాకా భరించాలి. ఆ పని గ్లామర్ దండిగా ఉన్న సెలబ్రిటీస్ చేయగలరా? ప్రస్తుతం పార్లమెంటులో కూర్చున్న ప్రబుద్ధులలో చాలామంది - జనంలో కావలసినంత అయిష్టతను, అసహ్యాన్ని సంపాదించుకున్నారు. పార్టీని కూడా బద్నాం చేస్తున్నారుట. వాళ్ళకే స్వీటు పెట్టి.. సీటు గెలవండిరా! అని టిక్కెట్ చేత పెడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. లేదా చొక్కా తిరగేసి ఏకు మేకు అయిపోతారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ములు పోయే ప్రమాదమున్నది ధోనీ లాంటి వాళ్లకి.
కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు. అది చాలు మిగతా నాయకులు చేతులు కలపడానికి. దక్షిణాదిన అమిత్ షా తిష్ట వెయ్యడం లేనేలేదు. అడుగు కూడా పెట్టలేకపోతున్నాడు. ఇక యూపీలో మాయ, అఖిలేష్‌లు సీఎం యోగీకి చుక్కలు చూపెడతారు. ‘మీరు మరుగుదొడ్లు కట్టారు కాని ప్రక్షాళనకి నీల్లేవీ?’ అంటారు జనం. వాటికోసం మేమున్నాంగా చూస్తూ ఉండండి.. మేం మేఘాలను రప్పిస్తాం .. నీళ్లు రప్పిస్తాం’... అంటాడు రాహుల్‌జీ. ఆమ్ ఆద్మీ పార్టీ కుమార్ విశ్వాస్- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీద కక్షతో భాజపా మీద కవనగానం చేస్తున్నాడు. అతనికి సీటు ఇస్తే.. బెటర్. వెయ్యి హరిదాసుల పెట్టు- ఓ వంద కవాలీలకి దీటు.. బాగా రాగతాళయుక్తంగా-పోయెట్రీ పాడి వినిపించి మోదీజీని కీర్తించి ప్రచారం బాగా చేస్తాడు. ఇట్లా కొత్త మొహాల కోసం అమిత్ అనే్వషణ మొదలైంది. బడుగు, మధ్య తరగతి జనంలో పేరుకుపోతున్న అసంతృప్తిని తొలగించాలంటే ఏమి చెయ్యాలి? అందులో ‘నోటా’లు ఎక్కువ అవుతున్నారు. అంచేత- 2019 ఎన్నికల రోడ్డు మ్యాప్ టిపికల్ ఇండియన్ హైవే లాగ ఉంది. అన్నీ అతుకుల గతుకులే... జనంలో ప్రాజెక్టుల మీద నమ్మకం పోయింది. అవి కాంట్రాక్టర్ల కోసమే - అవన్నీ సశేషం గానే ఉంటాయి.. ఇది ఖాయం అంటున్నారు పెక్కురు. జాగ్రత్త... పాకిస్తాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అవంగా లేనిది మేము ఓ మంత్రి పదవికే చాలమా? అని మన క్రికెటర్లు బేరం పెడితే- ఆశ్చర్యం వద్దు.
బీవేర్ ఆఫ్ హోల్స్ అండ్ పాత్‌హోల్స్.. ఎహెడ్!

సెల్: 92900 99512