వినమరుగైన

రాష్టగ్రానము -తుమ్మల సీతారామమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతారామమూర్తిగారి ధోరణి వేరు. వారు అన్య కవుల మాదిరిగా పురాతనాంధ్ర వైభవాన్ని పుష్కలంగా కొనియాడినవారే. కాని అంతటితో వారు ఆగిపోలేదు. ఆంధ్రత్వాన్ని గూర్చి వారు ఆరాటపడినారు. ఆంధ్రోద్యమం తీరూ తెన్నూ చూచి ఆవేదన పొందారు. ఇదే సీతామమూర్తిగారిని ఇతర కవులనుండి వేరుచేసింది. విజయనగర చక్రవర్తులు కొలువుచేసిన వీరరాహుత్తుల వంశంలో జన్మించిన శ్రీ సీతారామమూర్తి ఆరవ ముద్రణం పొందిన రాష్టగ్రానానికి ముందుమాటగా వ్రాసిన మనవిలో-
‘తెలుగుఁదేశము, తెలుగుఁగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు ప్రజ, తెలుగు సంస్కృతి అనినంతనే నా యొడలు పలకించును ఇవి నాకు ప్రాణల్ప విషయములు. ‘నేను తెలుగువాడను’ అనునహంకారము నాకెక్కువ. ఈ అహంకారమే నన్ను కవిని చేసింది. ఇటిట నా జాతియు, నా భాషయు పరతంత్రములై, పరకీయ సంస్కారము నాశ్రయించి ప్రాచీన గౌరవమును కోల్పోయినవి కదా! ఇది నా మనస్సులో అనుక్షణముగా రేగునట్టి యారాటము. ఈ యారాటమునకు నా జీవుడు కదలినాడు. ఆ కదలికయే రాష్టగ్రానము- అని వక్కాణించారు. ఈ విధంగా ఏ యితరాంధ్ర కవీ చాటుకొనలేదు. ఇంతగా వారు ఆంధ్రదేశంలో తాదాత్మ్యం భజించారు.

రాష్టగ్రానం తాత్పర్యం అంతా/ ‘‘ఆంధ్రుడవై జన్మించితి;/ వాంధ్రుడవై అనుభవింపు మాయుర్వీభవం;/ బాంద్రుడవై మరణింపుమి;/ ఆంధ్రత్వములేని బ్రదుకు నాసింపకుమీ!.. అనే చిన్న కంద పద్యంలో ఇమిడి ఉన్నది. శ్రీ సీతారామమూర్తి ప్రాచీనాంధ్ర వైభవాన్ని బహుళంగా వర్ణించి తృప్తిపడలేదు. తన కాలంనాటి ఆంధ్రుల దుస్థితి వారికి గాఢ మనస్తాపాన్ని కలిగించింది. ఆంధ్రుడు శకములు నిల్పిన తన జాతి చరిత్రని మరచిపోయాడు. మాతృభాషను ఏవగించి పరభాషా వ్యామోహంలో పడి కొట్టుకొంటున్నాడు. ఆంధ్ర కళాకారులను అతడు మెచ్చుకోవటం లేదు. తెలుగు గ్రంథాలనూ, తెలుగు పత్రికలనూ చదువడు. కులభేదంతో, యోగ్యులయిన వారిని సమ్మానించడంలేదు. తాత తండ్రుల కట్టూ బొట్టూ వదిలివేశాడు. చివరకు పౌరుష చిహ్నాలయిన నిమ్మకాయలు నిలుపగలిగిన మీసాలను వదలి ఫ్రెంచి కటింగు మోజులో పడినాడు. ఈ అనాంధ్రత్వాన్ని శ్రీ సీతారామమూర్తి నిప్పులు కక్కుతూ వెల్లడించారు.
ఆంధ్ర రాష్ట్రోద్యమ చరిత్రను సూక్ష్మంగా పరిశీలిస్తే తమిళుల రాజకీయ చాతుర్యమూ, జాతీయ నాయకుల ఉదాసీనత్వమూ, ఆంధ్రుల అనైకమత్యమూ రాష్ట్రం సిద్ధింపకపోవటానికి ప్రధాన కారణాలని పక్షపాతబుద్ధి లేని పరిశోధకుడెవడయినా గ్రహిస్తాడు. ఇవి శ్రీ సీతారామమూర్తి వంటి రాష్ట్ర కవి తెలిసికోవటం ఆశ్చర్యం గాదు. ఆంగ్లేయులు ఆంధ్ర - తమిళ - కర్ణాట- మలయాళ భూభాగాలను చేర్చి పెద్ద చెన్నరాష్ట్రంగా ఏర్పరిచారు. దీని రాజధాని మద్రాసు అనే నామాంతరం గల చెన్నపట్టణం. ఈ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆంధ్రుల వికాసానికి అవరోధంగా ఉన్నదని భావించటమే ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ముఖ్యకారణం. ఈ భావన సహేతుకమని తలచిన శ్రీ సీతారామమూర్తి-
‘‘తిరుచునాపల్లి తంజావూరులందు రేడియో
పెట్టిన మనకేమి యుట్టిపడును
పైకరా మెట్టూరు ప్రాజెక్టులను లెస్స
కట్టిన మనకేమి పొట్టనిండు
అయ్యర్లు మొదలియార్లధికారమును నిర్వ
యించి నంతనే మనకేమి యొరగు
ద్రవిడ భాషా నిఘంటువు సిద్ధమైనచో
బాపురే మనకేమి పండువగును
అణ్ణమల విశ్వవిద్యాలయమ్ము మిగుల
బుష్టినందిన మనకేమి ప్రోగుపడును
చెప్పుకొన నేల? యిస్సిరో సిగ్గుచేటు
సైపలేమింక నుమ్మడి కాపురంబు’’
అని స్పష్టం చేశారు. చెన్నపట్టణం ఆంధ్రులదే అంటూ వారు చారిత్రక సాక్ష్యాలు త్రవ్వితలకెత్తారు. నెల్లూరు మాదే అని వాదించిన అరవ నాయకులకు తెలుగు రాజులు పాలించిన మధుర తంజావూరులు మాకిచ్చి నెల్లూరును మీరే తీసికొనండని వారు సమాధానం చెప్పారు.
భారత జాతీయ నాయకులు, సమయోచితంగా సాకులు చెప్తూ, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం పట్ల పెడమొగం పెట్టారు. ఈ సందర్భంలో శ్రీ సీతారామమూర్తి సుభాష్ చంద్రబోనూ, వల్లభాయి పటేలునూ- చివరకు మహాత్మాగాంధీని సైతమూ విమర్శించారు. వారితో తెలుగు నాయకులు రాయబారాలు నడపటం వారికి గిట్టలేదు.
‘‘యాచనాదైన్య మెఱుగని యాంధ్రజాతి/ యింత దిగజాఱునే! యెంత వింత పుట్టె’’.. అని వారు ఆశ్చర్యం ప్రకటించారు.
ఇంతేకాకుండా పులిమీద పుట్ర అన్నట్లు రాయలసీమ నాయకులు తమకు ప్రత్యేక రాష్ట్రంగావాలని ఆదోని సభలో తీర్మానించారు. వారి మనసుల్లో కోస్తా జిల్లాల వారి పట్ల అసమంజమయిన అనుమానాలు కలిగాయి. శ్రీ సీతారామూర్తికీ దుష్పరిణామం పిడుగుపాటయింది.
వారు దత్తమండల నాయకులను మృదువుగా మందలించారు. సర్కారు జిల్లాల వారిపట్ల సందేహాలు పెంచుకోవద్దని పశ్చిమాంధ్ర సోదరులకు సుద్దులు చెప్పారు. సమస్తాంధ్రదేశమూ రాయలసీమే అని వారికి వివరించారు. దత్త మండలాలలో ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తే, దానికి ఆర్థిక పుష్ఠి ఒనగూడదన్నారు. అనాంధ్రుల కుతంత్రాలకు బలికావద్దని హెచ్చరించారు.
ఈ రీతిగా శ్రీ సీతారామమూర్తి అవధుల్లేని ఆంధ్రాభిమానంతో స్వరాష్ట్రం కోసం ప్రయత్నించిన ఆంధ్రజాతి ఆకాంక్షలూ, ఆవేదనలూ ప్రతిబింబించే రీతిగా రాష్టగ్రానం రచించారు. ప్రఖ్యాత పత్రికా సంపాదకుడూ, సాహితీవేత్త అయిన కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు అణ్ణామలై విశ్వవిద్యాలయ రజతోత్సవ సంచికలో Nationalism in Telugu Poetry అనే వ్యాసం వ్రాస్తూ రాష్టగ్రానాన్ని ఫ్రస్తావించి-
""The Rastra Ganamu of Thummala Seetha Rama Murthy is beautiful epitome of the patriotic feelings of the Andhras and of their dreams for the Future అని తీర్పు చేశారు. ఈ తీర్పు నూటికి నూరుపాళ్లూ నిజం.

-అయిపోయింది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-నాగళ్ల గురుప్రసాదరావు