వినమరుగైన

సౌందర నందము - పింగళి లక్ష్మీకాంతము, కాటూరి వేంకటేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇరవయ్యో శతాబ్దపుటాంధ్ర మహాకావ్యాల్లో సౌందరనందము ఒకటి. ఆంధ్ర ప్రబంధ సరస్వతికి మకుటము’’ అని ముట్నూరి కృష్ణారావు ప్రశంసించిన ఈ కావ్యాన్ని పింగళి లక్ష్మీకాంతమూ, కాటూరి వేంకటేశ్వరరావూ రచించారు.
‘‘బంధువు లేక మానసులు బాల్య సఖుల్ సహపాఠులున్ సమస్కంధులు పింగళాన్వయుడు కాంతుడు, కాటూరి వెంకటేశుడున్ సుందరనందరాగ పరిశోభిత వృత్తము రమ్యతత్వమీ సౌందరనంద సత్కృతిని సల్పిరి దేశికు డిచ్చమెచ్చగన్’’ అని కావ్యం చివర శిలాక్షరం మాదిరిగా పద్యం వన్నది. ప్రాచీనాంధ్ర కవిత్వానికి భరత వాక్యమూ, నవీనాంధ్ర కవిత్వానికి నాందీ వాక్యమూ పలికిన తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెళ్లపిల్ల వెంకటశాస్ర్తీగారి షష్టిపూర్తి ఉత్సవం బందరులో జరిగినప్పుడు ఈ జంట కవులు గురుదక్షిణగా ఆ ‘అద్యతతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’కు సమర్పించారు. సౌందరనందాన్ని 1932లో రచించినప్పటికీ వీరు తర్వాత గాని గురువునకు అంకితం చేయలేదు.
సౌందరనందం ఇంతవరకూ ఎనిమిదిసార్లు అచ్చుకెక్కింది. 1932 నాటి మొదటి ముద్రణం ‘విజ్ఞప్తి’లో గ్రంథకర్తలు.
‘‘సంస్కృతమున అశ్వఘోష మహాకవి సౌందరనందమను కావ్యమొండు రచించెను. మా గ్రంథమునకును దానికిని ఇతివృత్తంలో నీషత్తు పోలిక కలదు. కాని ఇంకెందును సాదృశ్యము లేదు. ఇది దానికి అనువాదము కాని, అనుకరణముగాని కాదు. అశ్వఘోషుని శ్లోకములకు ఛాయలని చెప్పదగినవి 5, 6 పద్యములు మాత్రము మొదటి రెండు సర్గలలోనున్నవి. గ్రంథనామ మింపుగా నండుటచే నదియే కైకొంటిమి’’ అని చెప్పారు.
ఆంధ్ర సౌందరనందంలో తొమ్మిది సర్గలున్నవి. ప్రతి సర్గకూ తలకట్టుగా కవులు ఒక పేరు పెట్టారు. రెండవ సర్గ నుండి ఎనిమిదో సర్గవరకూ, ప్రతి సర్గకూ ముందు దానిలోని కధాతత్త్వాన్ని సూచించే అర్థవంతమయిన పద్యం వారు రచించారు. తొమ్మిదో సర్గకు ముందు మాత్రం భవభూతి ఉత్తరరామ చరితంలోని ‘‘అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వా స్వవస్థాసు’’ అనే శ్లోకాన్ని స్వీకరించారు. మొదటి చివరి సర్గలకు ముందు పద్యాలేవీ లేవు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. సౌందర నందం మొదటి కూర్పునూ, తర్వాతి కూర్పునూ పోల్చి చూస్తే ఈ జంటకవులు ఎన్నో పాఠాలు సవరించారని తెలిసికొంటాము. ఈ సవరణలన్నీ చాల అర్థవంతమైనట్టివీ, సుందరమైనట్టివీ. అయితే ఈ సవరణల వల్ల ఒక చోట యతిదోషం నివారింపబడింది. మరొకచోట అది దాపురించింది.
బుద్ధ్భగవానుడు కపిల వస్తు పురానికి తిరిగి వచ్చిన తర్వాత విషయలంపటడూ, భార్యాదాసుడూ, సవతి తమ్ముడూ అయిన నందుణ్ణి భిక్షువుగా చేసి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. క్షణకాలమైనా భర్తృవిరహాన్ని సహించలేని నందుని భార్య సుందరి అంతరంగమథనానికి లోనై తుదకు బుద్ధ్భగవానుడు గావించిన పనిలోని పరమార్థాన్నీ, దానివల్ల సంభవించే విశ్వకళ్యాణాన్నీ గ్రహింపగలిగింది. భిక్షకీభిక్షువులయిన భార్యాభర్తలిద్దరూ మానవసేవ గావిస్తూ ఒకసారి వెలివాడలో కలిసికొని, అక్కడకువచ్చిన బుద్ధ్భగవానుని ఆదేశ ప్రకారం మరణించిన పేదరాలి బిడ్డలకు సంరక్షకులవుతారు. వ్యక్తినిష్ఠమయిన ప్రేమ విశ్వవ్యాప్తమై కళ్యాణకారి అవుతుంది. ఇది ఆంధ్ర సౌందరనందంలోని కథ.
అశ్వఘోషుని సౌందరనందంలోని కథ ఆంధ్ర సౌందరనందంలోని కథకంటె వేరుగా వుంటుంది. సంస్కృత సౌందరనందం పద్ధెనిమిది సర్గల మహాకావ్యం అశ్వఘోషుడు తన కావ్యం మోక్షార్థ గర్భమయిన కృతి అన్నాడు. అందువల్ల కావ్యధర్మం అప్రధామయింది. కాళిదాసునకే కావ్యమార్గం చూపిన అశ్వఘోషుడు బౌద్ధమత ప్రచారానికి కంకణం కట్టుకొన్నవాడు కావటం చేట సంస్కృత సౌందరనందంలో నవీన కావ్యలక్ష్మి సహింపలేని మానవలోకాతీత సన్నివేశములు, తత్త్వోపదేశములు అత్యధికంగా గోచరిస్తాయి. సంస్కృత కావ్యంలో సుందరి పాత్ర మనకమసకగా కనబడుతుంది.
ఇక ఆంధ్ర సౌందర నందం స్వరూపం వేరు. దీనిని లక్ష్మీకాంత వెంకటేశ్వర కవులు కళాప్రధానమైన రసవత్కావ్యంగా పోతపోశారు. ఆంధ్ర కావ్యంలోని భిక్షాగమన సర్గము సంస్కృత కావ్యంలోని భార్యాయాచితకమనే స్వర్గాన్ని అనుసరించినట్టిదే. నందప్రవ్జానం, భార్యావిలాపం అనే సంస్కృత కావ్య వర్గలకూ, పరివ్యాజనం- నిరీక్షణం అనే ఆంధ్ర కావ్యసర్గలకూ కథాసామ్యం ఉన్నది. కాని వీటిల్లోని కావ్యకళ వాటిల్లో కనబడదు. ఆంధ్ర కవులు సంస్కృత సౌందరనంద శ్లోకాలను యథామూలంగా అనువదించిన తావులు చాలా ఉన్నవి. భిక్షాగమనంలో అనువాదం అధికం. పరివ్యాజనంలో దానికంటె తక్కువ. నిరీక్షణంలో దీనికంటె లొచ్చు. పునరాగమనం, ధర్మసంవాదం అనే సర్గల్లో మూడు నాలుగు శ్లోకాల అనువాదం కనబడుతుంది. మొత్తంమీద ఆంధ్ర సౌందరనందంలోని మొదటి నాల్గు సర్గల కథా సన్నివేశములకు మాత్రమే సంస్కృత సౌందరనందంతో సంబంధం ఉన్నది. మిగిలిన అయిదు సర్గలు లక్ష్మీకాంత వెంకటేశ్వర కవుల కావ్యకళా వైదుష్యమునకూ ప్రతిభకూ ప్రబలోదాహరణగా నిలిచాయి.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-నాగళ్ల గురుప్రసాదరావు