వినమరుగైన

ఫిరదౌసి -గుర్రం జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కృతియొక జెబ్బులింబలె శరీర పటుత్వము నాహరింప, శే
షితమగు నస్థిపంజరము జీవలవంబున నూగులాడగా
బ్రతికియుఁ జచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
వతకు రుచించునా పరిభవ వ్యధ యింతట నంతరించునా?
ముత్యముల కిక్కయైన సముద్రమునను
పెక్కుమారులు ముస్కలు వేసినాడ;
భాగ్యహీనుండ, ముత్యమ్ము పడయనైతి
వనథి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు’’
గజనీ మహమ్మదు ఫిరదౌసికి చేసిన అన్యాయాన్ని కవి దురదృష్టాన్ని స్ఫురింపజేసే వాక్యాలివి. ఈ సందర్భంలో బహుశా ఇంతకంటే ధ్వని ప్రధానమైన వ్యక్తీకరణ ఎవరికీ సాధ్యంకాదేమో.
ఫిరదౌసి తన భార్య, కూతురుతో గజనీ పట్టణం వదలి అరణ్యమార్గంలో ప్రయాణించేటప్పుడు కవికి ప్రకృతిని వర్ణించే అవకాశం లభించింది. అయితే అక్కడ సైసై వర్ణనలుగాక జాషువా మనిషి-ప్రకృతి- భగవంతుడు అనే త్రికానికి సంబంధించిన లోతైన తాత్విక పరిశీలన చేస్తాడు. ఫిరదౌసి మానసిక పరిణతికి అదెంతో అవసరం. ‘‘చెలువమొప్ప పుడమి సృష్టించి, మాకిచ్చి, అనుభవింపుడనుచు ఆనతిచ్చి, నిలువ నీడలేక నిల్చిన కలవాడు’’గా భగవంతుణ్ణి భావిస్తాడు. ప్రకృతి అంతా పరమేశ్వర కవనంగా ఊహిస్తాడు. ప్రకృతి అనంతత్వాన్ని మనిషి అశాశ్వ తత్త్వాన్నీ వివేచిస్తాడు.
ఈ కావ్యంలో నాయకుడు కవి గనుక ఎన్నో సందర్భాల్లో కవి స్వభావాన్ని వ్యాఖ్యానించే అవకాశం లభించింది జాషువాకి.
‘కవికి గన్నతల్లి గర్భంబు ధ్వనంబు
కృతిని జెందువాడు మృతుడుగాడు’’
‘‘తమ్మి చూలికేలు దమ్మిని గలనేర్పు
కవి కలంబునందు గలదు’’
‘‘దాటిపోయిన యుగముల నాటి చరిత
మరల పుట్టింప కవి య సమర్ధుడగును.’’
ఈ భావాలన్నీ గజనీ మహమ్మదు నోటివెంట జాషువా పలికిస్తాడు. అపారమైన కావ్య ప్రపంచంలో కవే బ్రహ్మ అని అనందర్దనుడు అనే అలంకారికుడు అంటాడు. అటువంటి భావానే్న చెప్పాడు జాషువా. కవి సామర్థ్యంవల్లనే ఫిరదౌసి రచించిన షానామా లోగాని, కాళిదాసు రఘువంశంలో గాని దాటిపోయిన యుగముల నాటి చరిత్ర దర్శించగలుగుతున్నాం. కవి ఏ పాత్రను చిత్రించేటప్పుడు ఆ పాత్రలో తాదాత్మ్యం చెందాలి. అప్పుడే సజీవపాత్ర చిత్రణ జరుగుతుంది. పరకాయ ప్రవేశ లాగా యిది పరాత్మా ప్రవేశమే. అందుకే
‘‘వసుధ శాసింపగల సార్వభౌముడగును
ధీరుఁడగు, భిక్షుకుండగు, ధీనుఁడగును
దుఃఖితుండగు, నిత్యసంతోషి యగును
సత్కవి ధరింపరాని వేషములు గలవె?’’
అన్నాడు జాషువా. రచనాక్రమంలో కవి అనుభవించే ఆవేశ తీవ్రత, ఆలోచనా వ్యగ్రత అతని శారీరక మానసిక శక్తుల్ని ఎంతగానో హరించి ఆలోచనా వ్యగ్రత అతని శారీరక మానసిక శక్తుల్ని ఎంతగానో హరించివేస్తాయి. ఈ రచనాభారం మోసిన వాడికే తెలుస్తుంది. విద్వానేవ విజానాతి విద్వజ్ఞాన పరిశ్రమమ్’అని పెద్దలు చెప్తారు.
కనుకనే ‘ఒక్కొక్క పద్దియంబునకు నొక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా రచించితి’నని ఫిరదౌసి అంటాడు.
పద్యరచనా శిల్పం తెలిసిన కవుల్లో జాషువా ముందువరుసలో ఉంటాడు. పద్యం రాయటమంటే ‘గురువు లఘువుజేసి కుంచించి కుంచించి, లఘువు గురువుజేసి లాగి లాగి’గణాలు పూరించటం కాదు. యతిప్రాసల దగ్గర పిల్లిమొగ్గలు వెయ్యటం కాదు. కవికి మాట యొక్క మూలశక్తి తెలియాలి. మాటకి రంగు, రుచి, వాసన ఉంటాయని దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అంటాడు. అవి తెలియాలి. శబ్ద సమన్వయం తెలియాలి. భావం శబ్దంలో ఒద్దికగా ఒదిగిపోవాలి. ‘పదముల పొందిక’ గుఱ్ఱపు కదనున కెనవచ్చు పద్య గమనము. రస సంపదయును, స్వభావ శబలత పిరదౌసి కవిత్వంలో ఉన్నట్లు జాషువా చెపుతాడు. నిజానికి ఈ లక్షణాలన్నీ జాషువా కవిత్వంలోనూ ఉన్నాయి. ఉర్దూ మొదలైన ఇతర భాషా పదాలు గూడా జాషువా కవిత్వంలో అందంగా ఒదిగిపోతాయి. తెలుగు పద్య సౌందర్యం తెలుసుకోవాలంటే జాషువా రచనలు తప్పకుండా చదవాలి.
గొప్పకవులు తమ భాషని తామే సృష్టించుకొంటారు. భాషలో ఆ మాటలు ముందే ఉండొచ్చు. సృజనాత్మకతగల కవి ఆ మాటలకి విశిష్టమైన అర్ధం స్థిరీకరిస్తాడు. వేర్వేరు మాటల్ని కలిపి ఆ పద బంధాల ద్వారా కొత్తకొత్త అర్ధాలు స్ఫురింపజేస్తాడు. ఆంగ్లంలో షేక్‌స్పియర్ వంటి మహాకవులు ఈ పనే చేశారు. తెలుగులో తిక్కన, పింగళి సూరన మొదలైనవాళ్లు. జాషువా కవిత్వంలో అద్భుతమైన సృజనాత్మకత, భావనాశక్తి కనిపిస్తాయి. రచనతో ఒక తాజాదనం, నూతన కాంతి కన్పిస్తాయి. ఎంతోమంది కవులకు కోయిల కూత తెలుసుగాని, ‘ముదురు కోయిల కంఠ నివాసము సేయు కొసరింపు కూతల’ గుట్టు తెలిసినవాడు జాషువాయే. ‘మేఘంపు తెఱచాటు మెఱపు, బోగపుసాని మోసగింపుల’ అర్ధమును గ్రహించిన వాడు తనే. అలల నురుగుల్ని సముద్రపు పిల్లలుగా ఊహించగలిగినవాడతనే. ‘ఉక్కుపుప్పొడి రాలు యుద్ధ్భూమి’ని భావించగలిగిన వాడూ అతనే. నల్లని వాన మబ్బుల్ని గర్భిణీ మేఘాలన్నాడు జాషువా. ఆగడవు మబ్బు శయ్యల మీద ‘బుడత చంద్రుడు’ నిద్రపోతాడన్నాడు. సృష్టికర్త ‘విత్తనంబున మహావృక్షంబు నిమిడించ సృష్టించి గారడీ’ చేసే వాడుగా కన్పించాడు జాషువాకి. అదే సృష్టికర్త ఆకాశపు కాగితం మీద తను రచించే లేఖను వేగుచుక్కతో నిలిపివేశాడట! ఇంత అద్భుతమైన ఊహాశక్తి జాషువాది. తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్కడు జాషువా.
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-పాపినేని శివశంకర్