వినమరుగైన

త్వమేవాహమ్ -ఆరుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కవిత కోసం నేను పుట్టాను. క్రాంతి కోసం కలం పట్టాను’’ అని పలికిన కవి ఆరుద్ర వాక్కు అద్భుతమైనది. ఆధునికాంధ్ర కావ్యాలలో వస్తు శిల్పాలు రెండూ అందంగా అమరిన మహోత్తమ కళాఖండం ఆరుద్రగారి త్వమేవాహమ్.
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని శ్రీ దాశరధి తెలంగాణా సీమను సంభావించారు. కోటిమంది తెలుగు ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో, దేశముఖ్‌లు జాగీర్దార్ల దౌర్జన్యంతో, పటేల్ పట్వారీల చిత్రహింసలతో, రజాకార్ల కిరాతకత్వంతో నానా పాట్లు పడ్డారు. ఆంధ్ర మహాసభ నేతృత్వంలో ప్రజలు పోరాటం సాగించారు. 1946 జూలై 4వ తేదీన విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి గూండాలు ఆంధ్ర మహాసభ కార్యకర్త దొడ్డి కొమురయ్యను కాల్చిచంపటంతో ప్రజలు సాయుధ పోరాటం ప్రారంభించారు. నిజాం సంస్థానంపై కేంద్ర ప్రభుత్వం జరిపిన ‘పోలీస్ యాక్షన్’ తరువాత కూడా పోరాటం కొనసాగింది.
శ్రీ దాశరధి, కాళోజీ మొదలైన తెలుగు కవులు తెలంగాణా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు జీవితాన్ని, అనేక కష్టనష్టాలను అనుభవించారు.
ఆరుద్రగారి త్వమేవాహమ్ తెలంగాణ పోరాట కాలంలోనే వచ్చింది. పోరాట వివరాలను ఆనాటి తెలుగు పత్రికలు ఎక్కువగా ప్రచురించేవి కావు. రజాకార్లచే చెరచబడ్డ ఒక స్ర్తి కథనాన్ని కృష్ణాపత్రిక 1948 జూలై 10వ తేదీ సంచికలో ప్రచురించింది. ఈ వార్తాకథనమే ఆరుద్రగారి త్వమేవాహమ్ కావ్యానికి ప్రేరణ కలిగించింది.
‘‘రైలు గుడివాడ దాటి వెడుతోంది. రైలు పెట్టెలో వున్న ప్రయాణీకులు హైదరాబాదు విషయాలు చెప్పుకుంటున్నారు. కాశిం రజ్వీ దురంతాలు, కాందిశీకుల కష్టాలు వర్ణించి విషాదభరితులవుతున్నారు.
ఇంతలో ఆ పెట్టెలోనే వున్న ఒక వనిత లేచి నిలబడింది. వలువలు తీసివేసింది. నగ్నంగా నిలబడింది. ఏమిటీ ఘోరమని అంతా తలలు వంచుకున్నారు. ఆమె అలాగే నిలబడింది. ఆ పెట్టెలోనే వున్న ఒక వృద్ధుడు ధైర్యం చేసి ‘‘అదేమిటమ్మా! ఆడపిల్లవు, అలా నగ్నంగా వున్నావు. తప్పు కాదూ’’ అన్నాడు.
‘‘తప్పా! నాకు తప్పా! ఏ నోటితో చెప్తున్నారామాట? నేను ఆడదాన్నా! నైజాం కిరాతకులు నన్ను వారం రోజులిలా నగ్నంగా చెట్టుకు కట్టివేసి అట్టే పెట్టారు. నా స్ర్తిత్వాన్ని ఆనాడే దొంగిలించారు. నా ఆడతనం ఆనాడే పోయింది. ఇంకా ఆడదానినంటారేమిటి? చూడండి నా వంటినిండా గాయాలు.
స్ర్తిత్వం ఒకసారి పోయింతరువాత మళ్లీ వస్తుందా? ఇలా వున్నది మా స్థితి. మీరిలా కూర్చుని కబుర్లు వింటున్నారు.
‘‘నేనేం సిగ్గుపడవలసినది లేదిక, మీరూ పడవలసింది’’ అని ఒక్కొక్క ప్రయాణీకుని దగ్గరకు వచ్చి తన వొంటిని వున్న గాయాలు చూపింది. పెట్టెలో వాళ్లంతా సిగ్గుతో తలవొంచుకున్నారు. ఆమె విషాదగాధ విని కన్నీరు కార్చారు.
ఆరుద్ర త్వమేవాహమ్ ప్రారంభంలో ‘‘ఆలోచనల ట్రెయిన్లో / ట్రెయిన్లో / పురుషుల 3వ క్లాస్ బోగీలో / చెట్ల గురించి /చిట్టెలుకల గురించి / చెద పురుగుల గురించి /చిన్న చిన్న చీమల గురించి / సంభాషణ రెయిల్లో / రెయిల్లో/ చెయిస్సు లేని మగాళ్లముందు / నిటారుగా నించొని / తన బట్టలు నింపాదిగా తాపీగా ఒలుచుకొనే / నిటారుగా నిస్సిగ్గుగా/ నించొనే నీతివంతురాలు’’ అని ఆరుద్ర ఆ అభాగినికి జరిగిన అన్యాయానికి ఆక్రోశించారు.
1948లో ఆరుద్ర త్వమేవాహమ్ రచించారు. మొదట రుూ కావ్యానికి ఆరుద్ర తెలంగాణ అని పేరు పెట్టారు. ఈ కావ్యం చదివిన మహాకవి శ్రీశ్రీకి ఆరుద్ర ఏనుగు బొమ్మ గీసి ఏనుగు అని పేరు పెట్టినట్లు అనిపించింది. కావ్యం పేరు మరింత భావస్ఫోరకంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో శ్రీశ్రీ ఆ కావ్యానికి త్వమేవాహమ్ అనే పేరు తగినదిగా ఉంటుందన్నారు. త్వమేవాహమ్ అంటే నీవే నేను అని అర్థం. చిరంజీవి మానవునితో మృత్యువు నీవే నేను అంటుంది. బాధాసర్పదష్టులైన తెలంగాణ ప్రజలతో పోలీస్ యాక్షన్‌కి పూర్వమే ఆరుద్ర సహా అనుభూతితో నీవే నేను అని పల్కటం విశేషం.
త్వమేవాహమ్ వచ్చిన కాలంలోనే దాశరధి గారి అగ్నిధార, సోమసుందర్‌గారి వజ్రాయుధం, అనిశెట్టి అగ్నివీణ, గంగినేని ఉదయిని, రెంటాల గోపాలకృష్ణగారి సంఘర్షణ తెలంగాణ పోరాట నేపథ్యంలో వచ్చాయి. వీటిలో ఏ కావ్యంమీద రాని ఆరోపణలు కొన్ని త్వమేవాహమ్‌పైన వచ్చాయి. తరువాత కుందుర్తి గారి తెలంగాణ మొదలైనవి వచ్చాయి. అందులో ముఖ్యమైనది రుూ కావ్యం సామాన్య పాఠకులెవరికీ అర్థం కావటంలేదని- కావ్య రచనలో నారికేళపాకం చిరకాలం నుండి ఉన్నదే. కాని యిది రుద్రాక్షపాకం బాబోయ్ అనుకొన్నారు కొంతమంది. త్వమేవాహమ్ చదివి సుప్రసిద్ధ కవి దాశరధి ఆరుద్రను మెచ్చుకుంటూ లేఖ రాశారు.
త్వమేవాహమ్‌లో ఉత్తమ కావ్య శిల్పం ఉన్నది. దీన్ని అందుకోలేనివారికి యిది కొరకరాని కొయ్య. నిజమైన కవిత్వం అర్థం కాక ముందే ఆనందింపజేస్తుంది. (Genuine poetry can communicate before it is understood)టి.ఎస్.ఇలియట్ సూక్తి మననం చేసుకోదగినది.
కావ్యానికి విషయం ఎంత ప్రధానమో టెక్నిక్ కూడా అంత ప్రధానం. ఆరుద్రగారు ఈ కావ్యంలో ఉపయోగించిన టెక్నిక్‌ను చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. ‘‘టెక్నిక్‌లేని కవిత్వాన్ని నేను ఊహించలేను. ప్రత్యేక సంవిధాన రహిత వాక్య సందోహాన్ని నేను కవిత్వంగా ఎంచలేను’’ అంటారు ఆరుద్ర.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -

-కడియాల రామమోహనరాయ్