డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏదో చెప్పిరా హరితా, నాకు నిన్ను చూడాలని వుంది. అంతేకాక నీకు కూడా మార్పుగా వుంటుంది మమ్మలని చూస్తే’’ అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు భరణి. అతడి కంఠంలో కనిపిస్తున్న కన్నర్స్‌కి కరిగిపోయింది హరిత. వెళ్ళాలనిపించింది.
‘‘సరే భరణీ ట్రై చేస్తాను’’ అంది.
‘‘్థంక్స్ హరితా, తప్పకుండా రావాలి’’ అని ఫోన్ పెట్టేశాడు భరణి.
***
హాస్టల్లో వున్న సీనియర్ దగ్గరనుంచి రికార్డులు తెచ్చుకోవాలని తల్లితో అబద్ధం చెప్పి బయలుదేరింది హరిత. భరణీ తనని పిలిచినట్టుగానే వరుణ్‌ని కూడా పిలిచి వుంటాడా? ఆ రోజు తరువాత వరుణ్ తనకి ఫోన్ చేయలేదు. కోపమో బాధో మరే కారణమో తెలియడంలేదు. ఇన్నాళ్ళూ ఫోన్ చేయకుండా వుండడం ఇదే మొదలు.
హాస్టల్లోకి వెళ్లి భరణి రూమ్ వంక వెడుతుంటే, ఆమెకి ఆ రోజు అతడు తనతో ఫోన్లో అన్న మాటలు గుర్తొచ్చాయి. భరణీ నిజంగానే తనని ప్రేమిస్తున్నాడా?! తను వరుణ్‌ని ప్రేమిస్తోందన్న విషయం తెలిసినా కూడా తనని ప్రేమిస్తున్నాడా?!
‘ఏమిటీ విచిత్రం?! అసలు ప్రేమంటే ఏమిటీ?’ అనిపించిందామెకి.
కారిడార్లో నడుచుకుంటూ వెళ్లి గదిలోకి అడుగుపెట్టబోయిన హరిత లోపలనుంచి వినిపిస్తున్న మాటలకి ఒక్కసారిగా ఆగింది, ఆ మాటల్లో తన పేరు వినిపించడంతో.
‘‘అసలే వరుణ్‌తో రిలేషన్ బ్రేకవుతోందన్న బాధతో ఉన్న హరితతో డైరెక్టుగా నీ ప్రేమ గురించి చెప్పేసావు. అసలే సున్నిత మనస్కురాలు. ఆమె నీ గురించి ఏమనుకుంటుంది? మళ్లీ నీ ముఖం చూస్తుందా? అసలామె ఇవాళ వస్తుందన్న నమ్మకం నాకు లేదు’’ ఎవరో స్నేహితుడు అంటున్నాడు భరణితో.
భరణి విలాసంగా నవ్వాడు, ‘‘నా అంచనా తప్పదు. తప్పకుండా వస్తుంది. ప్రేమ అన్నది ఒక మత్తుమందు లాంటిది. ఒకసారి అలవాటుపడ్డాక ఆ మత్తుమందు లేకుండా అమ్మాయిలు వుండలేరు. దాన్ని ఆమెకి వరుణ్ అలవాటుచేసాడు. అందుకు ప్రోత్సహించిందీ నేనే. ఇపుడు ఆ మత్తు లేకుండా ఆ అమ్మాయి వుండలేదు. వరుణ్ ఇంక ఆమె జోలికి రాడు. ఆమె ప్రేమకోసం అల్లాడుతుంది. నన్ను వెతుక్కుంటూ పరుగెత్తుకుని వస్తుంది.
ఇందులో నాకు రెండు విధాల లాభం వుంది. ఒకటి- ఆల్రెడీ ఆ వరుణ్‌గాడు దాన్ని ఒక లెవెల్‌కి చెడగొట్టేశాడు. ఇపుడు నాతో ‘గీత దాటించడానికి’ నేను పెద్దగా కష్టపడక్కర్లేదు. రెండు- ఒకసారి కళ్ళు మూసుకుంటే, వరుణ్ అయినా ఒకటే భరణి అయితే ఒకటే అన్న విషయం అర్థం చేసుకున్నాక ఆమె నాతో రిలేషన్ బ్రేక్ చేసుకోవడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడదు. అదీ నా ప్లాన్!’’ అంటూ మళ్లీ నవ్వాడు భరణి.
హరిత షాక్ తిన్నట్టుగా వుండిపోయిందొక్క క్షణం. ‘ఇతడినేనా తాను అంత గుడ్డిగా నమ్మింది? ఇతడినేనా వరుణ్ తన ప్రేమకి పెద్ద దిక్కు అని మురిసిపోయింది? అతడి నిజ స్వరూపం ఇదా? ఆడవాళ్ళమీద అతడికున్న అభిప్రాయం ఇంత చవకబారుదా? కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్టుగా అనిపించసాగింది ఆమెకి.
లోపల నుంచి భరణి ఇంకా నవ్వుతూనే వున్నాడు. హరితకి సమ్మెటతో నిశ్శబ్దంగా తలమీద ఎవరో బాదుతున్నట్టనిపించసాగింది. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా వున్న మేఘాల్లా మారాయి. వస్తున్న కన్నీళ్ళని కూడా ఆపుకోకుండా అలాగే పరిగెడుతూ మెట్లు దిగి హాస్టల్ బయటికి వచ్చేసింది.
బస్ వచ్చి ఆగింది. హరిత ఎక్కింది. శబ్దం చేస్తూ బస్ కదిలింది. హరితకేమీ వినబడలేదు... అంతా నిశ్శబ్దంగా అనిపిస్తోంది.. కొన్ని కొన్ని విస్ఫోటనాలు నిశ్శబ్దంగానే జరుగుతాయి!
***
ఆ రోజు ఇంటికి వచ్చాక హరితకి చాలా దిగులుగా అనిపించింది. వరుణ్ చేతకానితనం.. భరణి మోసం.. ఇవేవీ కాదు ఆమె దిగులుకి కారణం. దాన్ని మించిన బాధ.. తీవ్రమైన అసంతృప్తి.. తన జీవితం తన చేతుల్లోంచి జారిపోతోందన్న భావం.
తను కాలేజీలో చేరిన రోజునుండీ ఆ రోజు దాకా జరిగిన ఒక్కో సంఘటనా గుర్తుకు తెచ్చుకుంది. వరుణ్‌తో పరిచయం, ప్రేమా.. అందరికన్నా తనో ప్రత్యేకమైన వ్యక్తిననకుంది. ఆ భ్రమలోనే అనాలోచితంగా అడుగులు వేసేసింది. తను ఎంతో గొప్పదనుకున్న తమ ప్రేమ భరణి లాంటి వాళ్ళ దృష్టిలో ఎంత చులకనగా మారిపోయింది? లోపం ఎక్కడుంది? తనలోనా? వరుణ్‌లోనా? మరెక్కడ? ఆ ఆలోచనలతో ఆమెకి నిద్రరావడంలేదు.
మొదటిసారి పుట్టిన రోజుకి వరుణ్ తనకి ఇచ్చిన మెటల్ బాక్సు తీసి దాన్ని ఓపెన్ చేసింది. అందులోని బొమ్మ బయటికివచ్చి ఎప్పటిలానే తన చుట్టూ తాను తిరుగుతూ నాట్యం చేయసాగింది. ఇన్నాళ్ళూ తనకి స్వాంతననిచ్చిన ఆ బొమ్మలో మొదటిసారిగా ఎందుకో ఏదో లోపం వున్నట్లనిపించసాగింది.
ఏమిటది?
ఆలోచనలనుంచి తప్పించుకోవడం కోసమని ఆమె ఆ బాక్స్ మూసేసి ఏదో పుస్తకం తీసింది చదువుదామని. టేబిల్ దగ్గిర కూర్చుని దాన్ని చదవసాగింది.
సెకెండియర్ సబ్జెక్టు అది. పరీక్షల ముందు హడావిడిగా నాలుగు ప్రశ్నలు చదివేసి రాసేసిన సబ్జెక్టు. అపుడు బోర్ కొట్టిన పుస్తకం ఇపుడు నెమ్మదిగా ఒక్కో చాప్టరూ చదువుతుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తోంది. రాత్రి చాలాసేపు ఆ పుస్తకం చదువుతూ ఉండిపోయింది. పరీక్ష ముందు ఒక్కరోజైనా అలా శ్రద్ధగా ఆ పుస్తకం చదివి వుంటే పరీక్ష చాలా బాగా రాయగలిగి వుండేదనుకుంది.
ఇన్నాళ్ళూ తన చదువు, తన సబ్జెక్ట్ బోర్ అనుకునేది. కానీ అవి కూడా ఆసక్తికరంగా వుంటాయని మొదటిసారి తెలిసిందామెకి. ఒక విషయాన్ని పైపైన తెలుసుకోవడానికీ లోతుగా పరిశీలించడానికీ వున్న తేడా అది. పుస్తకం మూసేసి లైటార్పి పడుకుంది. ప్రతిరోజులాగా ఆమెకెందుకో పడుకోబోయే ముందు వరుణ్ గుర్తుకురాలేదు.
***
కాలేజ్ లేకపోడంతో రెండు రోజులు అలా ఇంట్లో పుస్తకాలు చదువుతూ గడిపింది హరిత. మూడో రోజు బయటికి వెళ్లాలనిపించింది. తల్లిని బ్రతిమిలాడింది. ఏ కళనుందో సుమతి ఒప్పుకుంది.
ఉత్సాహంగా తయారై బయటికివచ్చిన హరిత తీరా బయటికి వచ్చాక ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించింది. వరుణ్ ఆ రోజునుంచీ ఫోన్ చేయలేదు. ఎలా వున్నాడో ఒకసారి వాళ్ళింటికి వెళ్లి చూసి వస్తే అనిపించింది. కానీ ఎందుకో మళ్లీ వెళ్లాలనిపించలేదు. ఏది ఏమైనా ఇదివరకటిలా అతడిని తల్చుకోగానే ఆమె మనసు ఉత్సాహంతో తుళ్ళిపడడంలేదు.
వరుణ్ గురించిన ఆలోచనలని పక్కన పెట్టి బస్ ఎక్కి లైబ్రరీకి వెళ్లింది. లైబ్రరీలో పుస్తకాల రేక్‌ల మధ్య తిరుగుతున్న ఆమెకి లక్ష్మి కనబడింది.
‘హలో’ అంటూ పలకరించింది.
ఆమెని చూడగానే హరితకెంతో ఆనందంగా అనిపించింది. లక్ష్మి రెగ్యులర్‌గా లైబ్రరీకి వస్తూంటుంది.
‘‘ఇక్కడి పుస్తకాలన్నీ నాకు మంచి స్నేహితుల్లా అనిపిస్తాయి’’ అంటూ తన కూడా తెచ్చిన పుస్తకాలని లైబ్రేరియన్‌కి ఇచ్చేసి మరో పుస్తకం తీసుకుందామె. ఆమె తీసుకుంటున్న పుస్తకం ఏమిటా అని చూసింది హరిత, ఏదో సైకాలజీకి సంబంధించిన పుస్తకం అది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ