డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా డల్‌గా అనిపించసాగింది. సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆ డల్‌నెస్ మరింత పెరుగుతున్నట్లు అనిపించింది. వెళ్ళే ముందు కాలేజి గేటు దగ్గర వరుణ్ ఫ్రెండ్ ఫణి కనిపిస్తే ఇంక ఆపుకోలేక అడిగేసింది, ‘‘వరుణ్ ఏడి, ఇవాళంతా కనిపించలేదూ?’’ అంది క్యాజువల్‌గా అడుగుతున్నట్లుగా.
ఆమె ప్రశ్న వినగానే ఫణి ఆశ్చర్యపోయినట్లుగా ముఖం పెట్టాడు. తను అడిగినదానిలో అంతగా ఆశ్చర్యపోవడానికి ఏంవుందో అర్థం కాలేదు హరితకి. ఫణి మాత్రం హరితనేమాత్రం పట్టించుకోకుండా జేబులోంచి సెల్ తీసి ‘‘అరే వరుణ్.. అచ్చు నువ్వు చెప్పినట్లుగానే జరిగిందిరా?’’ అన్నాడు.
ఇంకా ఏదో మాట్లాడబోతున్న అతడిని వారిస్తూ అంది హరిత కోపంగా- ‘‘వరుణ్ చెప్పినట్లు జరగడమేమిటి?’’- అంతలోనే వరుణ్ పక్కనుంచి వాళ్ళ ముందరకి వచ్చాడు.
‘‘హరితా.. నామీద కోపం పోయిందా? నన్ను క్షమించావా?’’ అన్నాడు దగ్గరగా వచ్చి.
హరితకేం చెప్పాలో అర్థం కాలేదు.
‘‘ప్లీజ్ హరితా.. నువ్వలా వౌనంగా వుండకు. ఒక్క విషయం చెప్పు? నా బైక్‌మీద ఎక్కమంటే ప్రతిసారీ భయపడిపోతావు. ఏదో అయిపోతుందనీ, ఎవరో చూసి ఏదో అనుకుంటారనీ, కాని ఏమైంది? అందరూ మనల్ని చూసారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం నీకు తెలియచేయాలనే అబద్ధం ఆడాను. నీకు ఇష్టం లేకపోతే ఇకనుంచీ నాతో తిరగకు. నేను నినే్నమీ బలవంతపెట్టను. కానీ ఎవరికో భయపడి మాత్రం నీ ఇష్టాన్ని చంపుకోకు. అది చెప్పాలనే ఇలా చేశాను. నేను చేసింది తప్పనిపిస్తే నన్ను తిట్టు.. కొట్టు.. కానీ నన్ను క్షమించానన్న ఒక్క మాట చెప్పు చాలు. లేకపోతే నేను బ్రతకలేను.’’
అతడి మాటలకి హరిత ఆశ్చర్యంగా చూసింది. అతడు చేసిన పనిని తేలికగా తీసుకుని తను తప్పు చేస్తోందో ఒప్పు చేస్తోందో తెలియదు కానీ అతడిని ఆపే శక్తి మాత్రం తనకి లేదని ఆమెకి అప్పటికే అర్థమైపోయింది ఆమెకి.
‘‘క్షమించానని ఎలా చెప్పను? స్నేహితుల మధ్య థాంక్సులూ సారీలూ వుండవుగా?’’ అంది నవ్వుతూ.
ఆమె మాటలకి వరుణ్ నమ్మలేనట్లుగా చూసాడు. అతడి కళ్ళలో వేయి దీపాల కాంతి!
‘‘నిజంగానా?’’ అన్నాడు. హరిత నవ్వింది తలూపుతూ.
‘‘అయితే ఈ శుభ సందర్భంలో ఇద్దరం కలిసి కాఫీ త్రాగుదాం పద.’’ అన్నాడతను ఆనందంగా.
‘‘వద్దు.. నాకు కాఫీ త్రాగడం అలవాటు లేదు’’ అంది హరిత.
***
సరిగ్గా ఇది జరిగిన నెల రోజులకి. ఓ వర్షం కురుస్తున్న సాయంకాలం.. వరుణ్‌తో కలిసి ఎ.సి హోటల్లో కూర్చుని కాఫీ తాగుతోంది హరిత. కాఫీ తాగడం ఆమె కొత్తగా అలవాటుచేసుకుంది.. అతని కోసం. కాఫీ తాగడం మాత్రమే కాదు బైక్‌మీద అతడి నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని పడిపోకుండా కూర్చోవడం కూడా అలవాటు చేసుకుంది.
కాఫీ కప్పు తీసుకుని ఆమె ఒకసారి సిప్ చేయగానే అతడు వెంటనే తన కప్పు ఆమెకిచ్చి ఆమె ఎంగిలి చేసిన కప్పు తను తీసుకుని తాగసాగాడు.
‘‘ఇదేం అలవాటు నీకు?’’ సిగ్గుపడుతూ అంది హరిత.
అప్పటిదాకా వర్షంలో తడవడంవల్ల బట్టలు తడి తడిగా వున్నాయి. ఫేన్‌లోంచి వస్తున్న గాలి మరింత చల్లగా చలి పుట్టిస్తోంది. ఆ చల్లటి వాతావరణంలో చలికి వణుకుతూ దగ్గర దగ్గరగా కూర్చుని వేడి వేడి కాఫీ త్రాగడం, అతడి మాటలూ అదంతా ఎంతో థ్రిల్లింగ్‌గా వుంది హరితకి. జీవితంలో అంతకుముందెన్నడూ అనుభవించని థ్రిల్..
అతడి ప్రతి చర్యలనూ ప్రతీ మాటలోనూ తన పట్ల వున్న ఇష్టం వ్యక్తవౌతూ వుంటే.. తనకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అతనికెంతో అపురూపంగా కనిపిస్తుందని తెలుస్తుంటే.. ఆ ‘గుర్తింపు’ ఆమెకెంతో సంతృప్తినిస్తోంది.
***
హరిత ఇంటికెళ్ళే సరికి తండ్రి ఇంకా ఇంటికి రాలేదు. సుమతి వంటింట్లో వంట చేసుకుంటోంది. తమ్ముడు సుధీర్ స్నేహితులతో ఎక్కడికో వెళ్లాడు.
హరిత స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి ముందు గదిలో టీవీ ఆన్ చేసి కూర్చుంది. టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తోంది. ఆమె మనసు ఆ ప్రోగ్రాంమీద లేదు. టీవీ చూస్తున్నట్టు నటిస్తూ ఆలోచిస్తోంది.
ఊరికే కూర్చుంటే తల్లి ఏదో పని చెబుతుంది. కాలేజ్‌లో ఏం చెప్పారు అని అడుగుతుంది. ఆ అడగడం తనమీద శ్రద్ధతో కాదు.. తను నిజంగానే కాలేజ్‌కి వెళ్లిందా లేక ఆ పేరుతో ఎక్కడేనా తిరుగుతోందా అని పరీక్ష చేయడానికి.
ఆ విషయం తెలుసు కనుక హరిత తల్లి దగ్గిర చాలా జాగ్రత్తగా వుంటుంది. ఒకవేళ అలాంటి ప్రశ్నలు అడిగినా ఏం జవాబులు చెప్పాలో ముందుగానే ఆలోచించుకుని సిద్ధంగా వుంచుకుంటుంది.
టీవీ చూస్తూ ఆమె వరుణ్‌తో గడిపిన క్షణాలు, అతనితో చెప్పుకున్న కబుర్లని మననం చేసుకోసాగింది. ఆమెకి బయలుదేరుతుంటే అతను ఇచ్చిన గిఫ్ట్‌ప్యాక్ గుర్తుకువచ్చింది.
‘‘రాత్రి పనె్నండు గంటల తర్వాతే దీనిని ఓపెన్ చేయాలి’’ అన్నాడతను.
భోజనం చేసేసి బలవంతంగా తన గదిలో పుస్తకం పట్టుకుని కూర్చుంది పనె్నండెప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ. గడియారం పనె్నండు చూపించగానే లేచి వెళ్లి హ్యాండ్ బ్యాగ్‌లో దాచుకునున్న ఆ చిన్న ప్యాకెట్‌ని తీసి ఓపెన్ చేసింది.
నల్ల రంగులో వున్న చిన్న మెటల్ బాక్స్ అది. దాని మూత తెరవగానే చిన్నగా గంటలు కొడుతున్నట్లు శ్రావ్యమైన సంగీతం.. ఆ బాక్స్‌లోపల నాలుగువైపులా అన్నీ అద్దాలు.. మూత తెరవగానే క్రిందనుంచి వచ్చిన గౌను వేసుకున్న చిన్న అమ్మాయి బొమ్మ తన చుట్టూ తాను తిరుగుతూ నాట్యం చేయసాగింది.
జాగ్రత్తగా గమనిస్తే కనబడ్డాయి. బాక్స్ మూత మీద అద్దంమీద ‘హ్యపీ బర్త్‌డే’ అన్న బంగారు రంగు అక్షరాలు..
అపుడు గుర్తొచ్చింది హరితకి ఆ రోజు తన పుట్టినరోజన్న సంగతి!

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ