డైలీ సీరియల్

బంగారుకల 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన రాయలు ప్రభువైనాడు గదా! తననింక గుర్తుంచుకుంటాడా! మనసు నిండా సంతాప మేఘాలు కమ్ముకుంటున్నాయి. తనవల్ల రాయల కీర్తికి ఎటువంటి మచ్చ రాకూడదు. పట్టమహిషి పదవిమీద కూడా ఆమెకి ఆశలేదు. రాయలే ఆమెకి సర్వస్వం. ఆమె అతనికి ప్రియురాలు, భార్య, అర్థాంగి, రాణి కూడా. మంజరి ముద్ర పట్టి ‘కృష్ణనృత్యం’ చేస్తున్నది. రాధ విరహంతో వేగిపోతూ కృష్ణుని రాకకోసం చెట్టునీ, పుట్టనీ, పులుగునీ, పున్నమినీ స్వామి జాడకోసం అభ్యర్థిస్తోంది.
‘‘రాడేలనే స్వామి రాడేలనే
నా వాడని నమ్ముకొంటి
ఇంతకింత రేయిమించె
రాడేలనే స్వామి రాడేలనే!’’
మంజరి విరహోత్కంఠిత రాధలా మారిపోయింది. ఆమె హృదయంలో అగ్ని బాణాలు గుచ్చుకుంటున్నాయి. నేటికి పది దినాలనుండి చద్రప్ప జాడ లేదు. అతని సన్నిధి కోసం ఆమె బేల హృదయం పలవరిస్తోంది.
‘‘నే తాళలేనే చెలియా
నే తాళలేనే ఓ ఖియా’’
అంటూ ఉన్మత్త విరహిణిలా మంజరి నేలకొరిగింది. అప్పటివరకూ అదే స్థితిని అనుభవిస్తూ విపరీత వేదనకు గురవుతున్న చిన్నాదేవి మంజరి స్థితికి కంగారుపడింది. ఆమె పరిచారికల సహాయంతో మంజరిని సేద తీర్చింది.
‘‘మంజరీ! ఏమిటిది! నీది నర్తనమా! నిజస్థితి ప్రదర్శనమా?’’
మంజరి బలహీనంగా నవ్వింది. ఆమె ఆహారం తీసుకుని కొన్ని దినాలయిందని గ్రహించింది చిన్నాదేవి. మంజరిని మంచం మీదికి చేర్పించింది. పానీయం ఇప్పించింది. ఆమె సేద తీరాక విషయం అడిగింది.
‘‘మంజరీ చెప్పు, మనం చిన్నప్పట్నుంచీ నేస్తాలం. ఒకరి మనసు మరొకరు బాగా తెలిసినవాళ్ళం. నీవు చంద్రప్ప ఒకరికొకరుగా మెలగటం నాకూ తెలుసు. ఇప్పటి నీ పరిస్థితికి అతను కారణమా?’’ ప్రేమగా మంజరి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.
మంజరి తలదించుకోవటంవల్ల ఆమె మనసులో ఏముందో తెలీటం లేదు. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరం మనోవ్యాకులతను తెలుపుతోంది. చిన్నాదేవి మంజరిని మరి ప్రశ్నించదలచలేదు.
‘‘కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందాం’’ అని మంజరిని ఏకాంతంగా వదిలేసి బయటి కక్ష్యలోకి వచ్చింది.
అప్పటికే ఆమె కోసం ఒక వార్తాహరుడు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయల ప్రేమకు పాత్రమైన ఆమె పట్ల అంతా గౌరవం, వినయాలనే ప్రదర్శిస్తున్నారు. ఏమో! ‘రాబోవు కాలంలో కాబోయే రాణి’ అని తలచి కాబోలు!
‘‘ఏమి వార్త తెచ్చావయ్యా’’ చిన్నాదేవి రాజసాన్ని ఒలకబోస్తూ ఆసనంపైన ఆసీనురాలయింది.
‘‘మహామంత్రి తిమ్మరసుల వారు మరో రెండు గడియల్లో మిమ్ములను కలవనున్నారు. ఇది అతి గోపనీయమని సెలవీయమన్నారు’’ వార్తాహరుడు అభివాదం చేసి నిష్క్రమించాడు.
దిగ్గున లేచింది చిన్నాదేవి. మనసు భయాందోళనలతో, ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. ఏమి చేయటానికి పాలుపోవటంలేదు. అంతటి మహామాత్యుడేమిటి.. తమ ఇంటిని పావనం చేయటమేమిటి? విజయనగర సామ్రాజ్య యశస్సుకు మూలస్తంభం లాంటి అప్పాజీ తమబోటి వారింటికి రావటమా! సమయానికి తల్లి కూడా ఇంట లేదే!
ఆలోచిస్తుండగానే తిమ్మరుసు మహామంత్రి ధీరగంభీర మూర్తిలా ఆ దేవదాసి ఎదుట నిలిచాడు. తొట్రుపడింది చిన్నాదేవి.
‘‘మహామంత్రికి ప్రణామాలు!’’ పాదాభివందనం చేసింది. ఆయనను ఆసనంమీద కూర్చుండబెట్టి ఎదుట తల వంచి వినమ్రంగా నిలిచింది ‘ఏమి ఆజ్ఞ’ అన్నట్లు.
సర్వాలంకారభూషితయై శే్వతాంబరధారిణిగా అపర సరస్వతిలా నిలుచున్న చిన్నాదేవి ముగ్థమనోహర రూపాన్ని ఒక నిమిషం పరికించాడు అప్పాజీ.
‘ఈమె ఇంతటి సౌందర్య సౌశీల్యాలు కల్గి ఉంది కాబట్టే రాయలు మనసిచ్చాడు. పట్టమహిషి కాదగిన సకల లక్షణ సముపేత’ అనుకున్నాడు అప్పాజీ.
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నాదేవి మెల్లగా అడిగింది ‘‘పెద్దలకి నా మీద ఇంత అనుగ్రహానికి కారణమేమో తెలుసుకోవచ్చునా?’’
అప్పాజీ గంభీర ముద్ర వహించాడు. మరుక్షణం చిన్న చిరునవ్వు ఆయన పెదాలపై చంద్రవంకలా మెరిసింది.
‘‘అమ్మా! విజ్ఞురాలివి. రాయలు ఏనాడో నీవాడైనాడు. రాజుకు భార్యలెందరున్నా దోషం కాదు. అయినా నీ స్థానం నీదే! ప్రభువుల వివాహానికి అనేక కారణాలుంటాయి. నీవల్ల ఒక సహాయం కోరి వచ్చాను’’.
ఉలిక్కిపడింది చిన్నాదేవి.
‘‘నావల్లనా అప్పాజీ! విజయనగర సామ్రాజ్యమే మీకెంతో ఋణపడింది. చెప్పండి మహామాత్యా!’’
‘‘చిన్నాదేవీ! కృష్ణరాయలు రాజుకాకముందే వారి అభిమానం సంపాదించావు. నీకాయన ఖడ్గవిద్య నేర్పారు. నీ సహజ లలిత కళాకౌశలాన్ని ప్రభువు అభిమానించారు. ఇపుడు రాజయ్యాక పట్టమహిషి స్థానం కూడా నీకివ్వదలిచారు. అయినా రాయలు మరో వివాహం కూడా చేసుకోవాలి. దీనికి రాయల్ని నువ్వే అంగీకరింపజేయాలి’’ అభ్యర్థనగా అన్పిస్తున్నా ఆదేశం ధ్వనించిందా స్వరంలో.
‘‘నేనా’’ చిన్నాదేవి గొంతు జీరవోయింది. ఆమె హృదయవేగం పెరిగింది.
‘‘అవునమ్మా! శ్రీరంగ పట్టణానికి చెందిన వీర శ్యామల రాయల కుమార్తె తిరుమలదేవితో రాయల వివాహం చేయదలిచాను. ఇది ప్రభువుకు, రాజ్యానికి కల్యాణ కారణం అవుతుంది. రాయలు నా మాట కాదనడు. కానీ నీ ప్రేమ రాజ్యశ్రేయస్సుకు ప్రతిబంధం కాకూడదు కదా!’’ అర్థస్ఫురణతో అన్నాడు అమాత్యుడు.
‘‘అప్పాజీ! మీరు నాకు తండ్రిలాంటివారు. ప్రభువు ఉన్నతికోసం నేను ఏమైనా చేస్తాను. మీరు నిశ్చింతగా వివాహం ఏర్పాట్లు జరుపుకోండి’’ చిన్నాదేవి మాటల్లోని గంభీరతకు తిమ్మరసు మంత్రి ఆశ్చర్యపడ్డాడు. ఆమె మట్టిలో మాణిక్యమని గుర్తించాడు.
‘‘మేము నిన్ను కల్సిన సంగతి రహస్యం సుమా’’ అని హెచ్చరించి గడప దాటుతూ ‘మంజరి క్షేమమా’ అడిగాడు. చిన్నాదేవి తలూపింది.
అప్పాజీ అటు వెళ్ళగానే కూలబడింది చిన్నాదేవి. అశ్రుధారలతో ఆమె చెక్కిళ్ళు, చీర తడిసిపోయాయి.
- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి