క్రీడాభూమి

తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన కివీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 12: కెరీర్‌లో ఆఖరి పోరాటం సాగిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ తన వందో టెస్టు మ్యాచ్‌లో విజృంభించడం ఖాయమని అందరూ భావిస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితి ఉత్పన్నమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వులో శుక్రవారం ప్రారంభమై తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరైన నిర్ణయాలు తీసుకుని మొదటి రోజే పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్నాడు. టాస్ గెలిచిన స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆతిథ్య న్యూజిలాండ్ తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించింది. దీంతో అక్కడ సీమ్, స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న గ్రీన్ పిచ్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుని ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా జోష్ హాజెల్‌వుడ్ (4/42), పీటర్ సిడిల్ (3/37), నాథన్ లియోన్ (3/32) నిప్పలు చెరిగే బౌలింగ్‌తో కివీస్‌కు చుక్కలు చూపించాడు. వీరి జోరును ప్రతిఘటించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (18), టామ్ లాథమ్ (6)లతో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కాన్ విలియమ్‌సన్ (16), హెన్రీ నికోలస్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా, బ్రెండన్ మెక్‌కలమ్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కొరీ జె.ఆండర్సన్ (38), మార్క్ క్రెయిగ్ (41-నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 183 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు జో బర్న్స్ (0), డేవిడ్ వార్నర్ (5)లను టిమ్ సౌథీ ఆదిలోనే పెవిలియన్‌కు చేర్చడంతో కంగారూలు 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. ఈ తరుణంలో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థిమితంగా ఆడి న్యూజిలాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. చక్కటి సమన్వయంతో చూడముచ్చటగా ఆడిన వీరు చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే మార్క్ క్రెయిగ్ బౌలింగ్‌లో స్మిత్ (71) రిటర్న్ క్యాచి ఇచ్చి నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖ్వాజా (57), ఆడమ్ ఓగ్స్ (7) అజేయంగా మరో 16 పరుగులు జోడించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు నష్టపోయి 147 పరుగులు సాధించిన కంగారూలు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉన్నారు.