ఓ చిన్నమాట!

ఆజ్ పహెలీ తారీఖ్ హై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లకి నెలలోని మొదటి తారీఖులో జీతం ఇచ్చేవాళ్లు. ఆ రోజు ఓ పెద్ద కార్యక్రమంలా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మా అక్క దగ్గర ఉండి డిగ్రీ చదువు చదివాను. మా బావ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. మొదటి తారీఖు రోజు వాతావరణం కొత్తగా కన్పించేది. అది టేప్‌రికార్డర్‌లు, టీవీలు, కంప్యూటర్లు, ఐపాడ్, స్మార్ట్ ఫోన్లు లేని కాలం. కావాలని అనుకున్నప్పుడు పాటలు వినే పరిస్థితి లేదు.
ఆ కాలంలో సిలోన్ స్టేషన్‌లో తరచూ హిందీ పాటలు వచ్చేవి. అప్పుడప్పుడు తెలుగు పాటలు వచ్చేవి. ప్రతి బుధవారం ‘బినాక’ గీత్‌మాల హిందీ పాటల కార్యక్రమం వచ్చేది. అదో ప్రపంచం. ఫస్ట్ తారీకున తప్పనిసరిగా ఉదయంపూట ఆ స్టేషన్‌లో ఓ పాటని ప్రసారం చేసేవాళ్లు. అది - ఆజ్ పహెలీ తారీఖ్ హై ఆజ్ పహెలీ తారీఖ్ హై (ఈ రోజు నెలలోని మొదటిరోజు) అన్న పాట. ఆ పాటని ఉదయం ఏడున్నర ప్రాంతంలో ప్రసారం చేసేవాళ్లు. అది ప్రతి నెలలో మొదటి తేదీన మా అక్క వాళ్లింట్లో మ్రోగేది. మా బావే కాదు మేము కూడా ఆనందంతో ఊగేవాళ్లం. జీతంతోపాటూ సాయంత్రంపూట స్వీట్ పాకెట్ కూడా ఇంటికి వచ్చేది. ఇదే పరిస్థితి తమ ఇంట్లో కూడా వుండేదని మా ఆవిడ చెప్పేది. మా బాపు డాక్టర్, నేను మొదట్లో న్యాయవాది. ఈ పరిస్థితి మా అనుభవంలో లేదు. మా బాపుకి రోజు డబ్బులు చేతికి వచ్చేవి. నాకు రోజు కాదు కాని వారంలో రెండు మూడుసార్లు వచ్చేవి. కాలక్రమంలో నేనూ ఉద్యోగంలో చేరాను. ఫస్ట్ తారీఖు నా జీవితంలోకి వచ్చింది. మొదటి తారీఖున మా కోర్టు సూపర్నెంట్ చాలా హడావిడిగా ఉండేవాడు. మధ్యాహ్నం ట్రెజరీ ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఎవరి జీతం డబ్బులు వాళ్లకి ఇవ్వడం. సంతకాలు తీసుకోవడం. ఆ ముప్పై రోజుల సంతోషం ఆ రోజు ఆయన ముఖంలో కన్పించేది. నాకు ఓ కవర్లో పెట్టి ఇచ్చేవాడు. లెక్క పెట్టుకొమ్మని చెప్పేవాడు. సంతకం తీసుకొని వెళ్లిపోయేవాడు. ఆ కవర్‌ని చేతిలోకి తీసుకోగానే ఏదో గొప్ప ఆనందం కలిగేది. అప్పుడు వచ్చే జీతం చాలా తక్కువే. కానీ జీతం కవర్ చేతికి రాగానే కలిగే సంతోషం మాత్రం వెలకట్టలేనిది. ‘ఆజ్ పహెలీ తారీఖ్ హై’ అన్న మాట నా మనసులో మారుమ్రోగేది.
కొంతకాలం తరువాత పరిస్థితులు మారాయి. జీతాలు చాలా పెరిగాయి. కానీ నేరుగా జీతాలని బ్యాంక్‌లో వేయడం మొదలైంది. ఒక్కోసారి జీతం డబ్బులు నా అకౌంట్‌లో పడ్డాయని మెసేజీ వచ్చేది. ఒక్కోసారి రాకపొయ్యేది. ముప్పైరోజులు కష్టపడినందుకు నాకు జీతం ఇచ్చారు అన్న అనుభూతి లేకుండా పోయింది. ఆజ్ పహెలీ తారీఖ్ హై అన్న పాట వినాల్సిన అవసరం కూడా పోయింది. ఆ రోజు మొదటి తేదీ అని ఉత్సాహపరిచే పాట విన్పించకుండా పోయింది.
జీతం డబ్బులు ఇంటికి తీసుకెళ్లడంలో వుండే ఇబ్బందులు లేకపోవచ్చు. దార్లో ఎవరైనా కొట్టివేసే ప్రమాదం లేకపోవచ్చు. మన జీతం డబ్బులు క్షేమంగా మన అకౌంట్లో వుండవచ్చు. కానీ ఆ రోజు మొదటి తారీఖు అన్న ఊపు మాత్రం లేకుండా పోయింది. ప్రతి ఆఫీసులో పండుగ వాతావరణం కన్పించకుండా పోయింది.
ఓ డాక్టర్‌లా, ఓ న్యాయవాదిలా పరిస్థితి మారిపోయింది. అవసరం వున్నప్పుడు బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు.
పరిస్థితి గతంలో మాదిరిగానే కానీ అనుభూతిలోనే మార్పు. మన మనస్సుని మార్చుకుంటే అనుభూతి మారుతుందేమో.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు e.mail : bhoomisunday@deccanmail.comకు కూడా పంపించవచ్చు.

-జింబో