క్రీడాభూమి

సిరీస్‌పై ధోనీ సేన ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 20: కెరీర్‌లో మొట్టమొదటి టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ బరీందర్ శరణ్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును సంపాదించుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా కూడా అతనికి తోడు కలవడంతో, రెండో టి-20లో జింబాబ్వేను వందకులోపే కట్టడి చేసిన టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేయలిగింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి టి-20ని రెండు పరుగుల తేడాతో చేజార్చుకున్న భారత్ రెండో మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని సాధించింది. దీనితో చివరి మ్యాచ్ అత్యంత కీలకంగా మారగా, ఇప్పటికే వనే్డ సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న భారత్ టి-20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకునే దిశగా అడుగు ముందుకేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఇన్నింగ్స్ దారుణంగా మొదలైంది. 14 పరుగుల స్కోరువద్ద చాము సిబాభా (10)ను అంబటి రాయుడు క్యాచ్ పట్టగా బరీందర్ శరణ్ అవుట్ చేశాడు. అతనికి ఇదే మొదటి టి-20 వికెట్. హామిల్టన్ మసకజా కూడా 10 పరుగులు చేసి శరణ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పీటర్ మూర్ నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా, మిడిల్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సికిందర్ రజా కేవలం ఒక పరుగు చేసి శరణ్ వేసిన అదే ఓవర్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాతి బంతికే టినొటెండా ముతుంబొజీ (0)ని శరణ్ ఎల్‌బిగా వెనక్కు పంపాడు. మొత్తం మీద ఆ ఒక్క ఓవర్‌లోనే శరణ్ మూడు వికెట్లు కూల్చాడు. మాల్కం వాలర్ 20 బంతులు ఎదుర్కొని, 14 పరుగులు చేసి యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు దొరికిపోయాడు. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే పీకల్లోతు కష్టాల్లో పడగా, 32 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు సాధించిన మూర్ కూడా వెనుదిరగడంతో భారీ స్కోరుపై జింబాబ్వే ఆశలకు తెరపడింది. బలమైన ఇన్నింగ్స్‌ను నిర్మించే దిశగా సాగుతున్న మూర్‌ను అక్షర్ పటేల్ క్యాచ్ అందుకోగా జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఎల్టన్ చిగుంబురా (8), కెప్టెన్ గ్రేమ్ క్రెమెర్ (4), నెవిల్లె మజీవా (1) వికెట్ల వద్ద నిలవలేక పెవిలియన్ చేరారు. జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 99 పరుగులు చేసింది. అప్పటికి డొనాల్డ్ తిరిపానో (11), తౌరయ్ ముజరంబానీ (0) నాటౌట్‌గా ఉన్నారు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చిన శరణ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా నాలుగు ఓవర్లలో 11 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. ధవళ్ కులకర్ణి, యుజువేంద్ర చాహల్ చెరొక వికెట్ కూల్చారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడికే ఈ ఇన్నింగ్స్‌లో వికెట్ లభించలేదు.
ఆడుతూ.. పాడుతూ..
కేవలం వదం పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు లోకేష్ రాహుల్, మన్దీప్ సింగ్ 13.1 ఓవర్లలోనే జట్టును లక్ష్యానికి చేర్చారు. ఇంకా 41 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రాహుల్ 40 బంతుల్లో 47 (రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), మన్దీప్ సింగ్ 40 బంతుల్లో 52 (ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. మూడు మ్యాచ్‌ల ఈ టి-20 సిరీస్‌లో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పుడు చెరొక విజయంతో సమవుజ్జీలుగా ఉండగా కీలకమైన మూడవ, చివరి మ్యాచ్ ఈనెల 22న జరుగుతుంది.

* బరీందర్ శరణ్ 10 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి, టి-20 ఫార్మెట్‌లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. అంతేగాక, ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్లలో రెండో వాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇలియాస్ సన్నీ (బంగ్లాదేశ్) తన తొలి టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. నాలుగు వికెట్లతో అజంతా మేండిస్ (శ్రీలంక, 4/15), దేవేంద్ర బిషూ (వెస్టిండీస్. 4/17), హర్వీన్ బైద్వాన్ (కెనడా, 4/19), కౌశల్య వీరరత్నే (శ్రీలంక, 4/19), అలెక్స్ కాసక్ (ఐర్లాండ్, 4/21), ప్రజ్ఞాన్ ఓఝా (్భరత్ 4/21), జాన్ లూయిస్ (ఇంగ్లాండ్, 4/24), మైఖేల్ కాస్ప్రోవిజ్ (ఆస్ట్రేలియా, 4/29) సరసన శరణ్ స్థానం సంపాదించాడు.
* టి-20 ఇంటర్నేషనల్ ఫార్మెట్‌లో భారత జట్టు తొలిసారి పది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. నిరుడు ఢాకాలో యుఎఇతో, అదే విధంగా విశాఖపట్నంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి, పది వికెట్ల ఆధిక్యంతో విజయభేరి మోగించింది.
* టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఒక ఇన్నింగ్స్‌లో రెండు లేదా అంతకు మించి పరుగులు సాధించిన భారత బౌలర్ల జాబితాలో శరణ్ రెండో వాడిగా చోటు సంపాదించాడు. 2012 ఆగస్టు 7న పల్లేకల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అశోక్ దిండా ఒకే ఓవర్‌లో దినేష్ చండీమల్, షామింద ఎరాంగ, లసిత్ మలింగ వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో శరణ్ ఒకే ఓవర్‌లో హామిల్టన్ మసకజా, సికందర్ రజా, ముతుంబాజీ వికెట్లు సాధించాడు.
* జట్టు పాల్గొన్న మొదటి టి-20 ఇంటర్నేషనల్‌ను మినహాయిస్తే, ఈ పార్మెట్‌లో భారత బౌలింగ్‌ను మొట్టమొదటిసారి ఇద్దరు కొత్త బౌలర్లు ఆరంభించడం విశేషం. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన బరీందర్ శరణ్, ధవళ్ కులకర్ణి కొత్త బంతిని పంచుకున్నారు.

స్కోరుబోర్డు

జింబాబ్వే ఇన్నింగ్స్: చాము చిబాభా సి అంబటి రాయుడు బి బరీందర్ శరణ్ 10, హామిల్టన్ మసకజా బి బరీందర్ శరణ్ 10, పీటర్ మూర్ సి అక్షర్ పటేల్ బి జస్‌ప్రీత్ బుమ్రా 31, సికిందర్ రజా సి లోకేష్ రాహుల్ బి బరీందర్ శరణ్ 1, టినొటెండా ముతుంబొజీ ఎల్‌బి బరీందర్ శరణ్ 0, మాల్కం వాలర్ సి అక్షర్ పటేల్ బి యుజువేంద్ర చాహల్ 14, ఎల్టన్ చిగుంబురా బి జస్‌ప్రీత్ బుమ్రా 8, గ్రేమ్ క్రెమెర్ సి అంబటి రాయుడు బి ధవళ్ కులకర్ణి 4, నెవిల్లె మజీవా బి జస్‌ప్రీత్ బుమ్రా 1, డొనాల్డ్ తిరిపానో నాటౌట్ 11, తౌరయ్ ముజరంబానీ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 99.
వికెట్ల పతనం: 1-14, 2-26, 3-28, 4-28, 5-57, 6-75, 7-81, 8-83, 9-91.
బౌలింగ్: బరీందర్ శరణ్ 4-0-10-4, ధవళ్ కులకర్ణి 4-0-32-1, అక్షర్ పటేల్ 4-0-23-0, యుజువేంద్ర చాహల్ 4-1-19-1, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-11-3.
భారత్ ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ 47 నాటౌట్, మన్దీప్ సింగ్ 52 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (13.1 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 103.
బౌలింగ్: డొనాల్డ్ తిరిపానో 3-0-11-0, నెవిల్లె మజీవా 2.1-0-19-0, తౌరయ్ ముజరంబానీ 2-0-17-0, గ్రేమ్ క్రెమెర్ 3-0-24-0, చాము చిబాభా 2-0-23-0, సికిందర్ రజా 1-0-9-0.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బరీందర్ శరణ్.

కెరీర్‌లో ఆడిన తొలి టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు కూల్చిన భారత బరీందర్ శరణ్