క్రీడాభూమి

సెరెనా కల నెరవేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 25: కెరీర్‌లో 24వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉన్న 37 ఏళ్ల సెరెనా విలియమ్స్ కల నెరవేరుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్‌లో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సెరెనా స్వదేశంలో టోర్నీ ఆడుతున్న కారణంగా వేలాది మంది అభిమానుల మద్దతు ఆమెకు లభించనుంది. అయితే, పూర్వ వైభవాన్ని కొనసాగించే సత్తా సెరెనాకు ఉందా అన్నదే అనుమానం. మహిళల విభాగంలో నవోమీ ఒసాకా, ఆష్లే బార్టీ, కరోలినా ప్లిస్కోవా వరుసగా మొదటి మూడు సీడింగ్స్‌ను సంపాదించారు. పురుషుల విభాగంలో నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ టాప్ త్రీ సీడ్స్‌గా పోరాటాన్ని కొనసాగిస్తారు. ఇలావుంటే, సెరెనా ఈసారి యూఎస్‌ను గెల్చుకోవడం అనుకున్నంత సులభసాధ్యం కాదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్‌ను సాధించిన సెరెనా ఆతర్వాత మరో ఐదు పర్యాయాలు (2002, 2008, 2012, 2013, 2014) ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఏడోసారి విజేతగా నిలవాలన్న ఆమె కల ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.
ఎన్నో ప్రత్యేకతలు..
ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న యూఎస్ ఓపెన్ ఈసారి కూడా అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే 139 యూఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో నొవాక్ జొకోవిచ్, మహిళల విభాగంలో నవోమీ ఒసాకా డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలో ఉన్నారు. గత ఏడాది పురుషుల ఫైనల్లో జొకోవిచ్ 6-3, 7-6, 6-3 తేడాతో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను ఓడించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాకా 6-2, 6-4 ఆధిక్యంతో సెరెనాపై విజయం సాధించింది. ఈసారి పోరు తీవ్రంగా ఉన్నందున, ఎవరు విజేతగాలు నిలుస్తారన్నది ఊహకు కూడా అందడం లేదు. యూఎస్ ఓపెన్ 1881లో మొదలైంది. ఆరంభంలో పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ టోర్నమెంట్‌లో 1887 నుంచి మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ 1891లో మొదలైంది. ఈ జాబితాలో అన్నిటికంటే ఆలస్యంగా మొదలైన గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్. 1905లో ఈ టోర్నీ ఆరంభమైంది. యూఎస్ ఓపెన్‌ను మొదట రోడ్స్ ఐలాండ్‌లోని న్యూపోర్ట్‌లో నిర్వహించారు.
తర్వాత ఈ టోర్నీ న్యూయార్క్‌లోని ఫారెస్ట్ హిల్స్ ప్రాంతానికి చేరింది. 1920 దశంలో మూడేళ్లు ఫిలడేల్ఫియా కేంద్రంగా మ్యాచ్‌లు కొనసాగినా ఆతర్వాత న్యూయార్క్ శాశ్వత వేదికైంది. యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్, సీనియర్స్, జూనియర్స్, ప్లేయర్స్ ఇన్ వీల్‌చైర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తారు. ఒక మ్యాచ్‌లో చివరి సెట్‌కు టైబ్రేక్‌ను అమలు చేసే ఏకైక గ్రాండ్ శ్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ కావడం విశేషం. మిగతా మూడింటిలో ఈ విధానం లేదు.మ్యాచ్ జరుగుతున్నప్పుడు రిప్లేను హాక్-ఐ కంప్యూర్ విధానం తర్వాత తక్షణమే ప్రసారం చేయడానికి వీలుంది. ఈ విధానాన్ని 2006లో మొదటిసారి యూఎస్ ఓపెన్‌లో ప్రవేశపెట్టారు. ఒక సెట్‌లో అత్యధికంగా మూడు పర్యాయాలు రిఫరీ నిర్ణయాన్ని క్రీడాకారులు సవాలు చేయవచ్చు. టైబ్రేక్ సమయంలో అప్పీల్ చేసుకోవడానికి అదనంగా మరో అవకాశాన్ని కల్పిస్తారు. యూఎస్ ఓపెన్ మొదలైన తర్వాత సుమారు 100 సంవత్సరాలు గ్రాస్ కోర్టులపైనే మ్యాచ్‌లు జరిగాయి. 1978లో గ్రాస్ కోర్టును తొలగించి ‘డెకో టర్ఫ్’ను ఏర్పాటు చేశారు. మిగతా హార్డ్ కోర్టులతో పోలిస్తే ఈ టర్ఫ్‌పై బంతుల వేగం తగ్గుతుంది. అంతేగాక, బౌన్స్ కూడా తక్కువగా ఉంటుంది. 1970 దశకం మధ్యలో మూడేళ్లపాటు టోర్నీని క్లే కోర్టులపై నిర్వహించారు. ఈ మూడు రకాలైన కోర్టులపై యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఏకైక క్రీడాకారుడు జిమీ కానర్స్.
సహజంగా ఏ టోర్నీలోనైనా సీడింగ్స్ ప్రకారం మెయిన్ డ్రాకు అర్హత కల్పిస్తారు. మిగతా వారు క్వాలిఫయర్స్ దశను నెగ్గుకొని మెయిన్ డ్రాకు చేరుకుంటారు. మొదటి రౌండ్ నుంచి సెమీస్ వరకూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్ చేరతారు.
అయితే, యూఎస్ ఓపెన్‌లో 1915 వరకూ నిరుటి విజేత నేరుగా ఫైనల్‌లో ఆడేవాడు. ఒక ఏడాది టైటిల్ సాధిస్తే, మరుసటి ఏడాది అతను ఒక్క రౌండ్ కూడా ఆడకుండానే ఫైనల్‌లో స్థానం సంపాదిస్తాడు. 1915లో ఈ విధానాన్ని రద్దు చేసి, మిగతా టోర్నీల్లో మాదిరిగానే, మెయిన్ డ్రాకు అర్హత పొందిన ప్రతి ఒక్కరూ అన్ని దశలను దాటి ఫైనల్ చేరాలనే విధానాన్ని ప్రవేశపెట్టారు.
భారీ ప్రైజ్ మనీ
యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఆరంభంలో తక్కువగా ఉండేది. 1968 నాటికి ఈ మొత్తం లక్ష డాలర్లకు చేరింది. ఇప్పుడు పురుషులు, మహిళల విభాగాల్లో సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరికీ 33,00,000 డాలర్లు లభిస్తున్నాయి. లక్ష డాలర్ల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన ప్రైజ్ మనీ ఇప్పుడు 4.22 కోట్ల డాలర్లకు చేరింది. ఇది సుమారు 254 కోట్ల రూపాయలకు సమానం. క్వాలిఫయర్స్‌లో ఆడిన వారికి కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది. మూడు దశల్లో జరిగే క్వాలిఫయర్స్‌లో వరుసగా 5,000, 10,000, 15,000 డాలర్లు చెల్లిస్తారు. ఫస్ట్ రౌండ్‌కు చేరితే 39,500, రెండో రౌండ్‌కు చేరితే 68,600, మూడో రౌండ్‌లోకి అడుగుపెడితే 1,20,200 డాలర్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ప్రీ క్వార్టర్స్‌లో చేరిన వారికి 2,13,575, క్వార్టర్ ఫైనల్స్‌లోకి వెళ్లిన వారికి 4,10,975 డాలర్లు లభిస్తాయి. సెమీ ఫైనల్స్ చేరితే 8,05,000, ఫైనల్ చేరితే 18,00,000 డాలర్లు సొంతమవుతాయి.
యూఎస్ ఓపెన్‌లో ఉపయోగించే ప్రతి బంతినీ నిశితంగా పరీక్షిస్తారు. సుమారు 100 అంగుళాల ఎత్తు నుంచి పడేసిన బంతి భూమికి తగిలి 53 నుంచి 58 అంగుళాల ఎత్తుకు ఎగిసినప్పుడే దానిని నాణ్యమైనదిగా గుర్తిస్తారు. అంతేగాక, ఆకారం నుంచి మన్నిక వరకూ అనేకానేక అంశాలను పరిగణలోకి తీసుకొని బంతులను తయారు చేస్తారు. ఆరంభంలో బంతులను చర్మంతో తయారు చేసి లోపలి భాగాన్ని ఊలు లేదా వెంట్రుకలతో నింపేవారు. అప్పట్లో ప్రత్యేకించి ఫలానా రంగులో ఉండాలన్న నిబంధన లేదు. ఇప్పుడు బంతులను లేత ఆకుపచ్చ లేదా గాఢమైన పసుపుపచ్చ రంగులో తయారు చేస్తున్నారు. శర వేగంతో దూసుకొచ్చే బంతులను ఆటగాళ్లు సులభంగా గుర్తించడానికి ఈ రంగును ఎంపిక చేశారు. 1986 సంవత్సరానికి ముందు వింబల్డన్‌లో తెల్ల బంతులను ఉపయోగించేవారు. టీవీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు ఆరంభమైన తర్వాత స్పష్టత కోసం పసుపు లేదా లేత ఆకుపచ్చ బంతులను వాడడం అలవాటైంది.
టెన్నిస్ ఆడేందుకు తొలి రోజుల్లో ర్యాకెట్లు ఉండేవికావు. ఆటగాళ్లు అరచేతులను ఉపయోగించి బంతులను కొట్టేవారు. తర్వాతి కాలంలో వెడల్పాటి చెక్కను వాడేవారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగానే ర్యాకెట్ల తయారీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చేతులే ర్యాకెట్లుగా టెన్నిస్ ఆడేవారంటే ఇప్పటి తరం నమ్మని పరిస్థితి.
యూఎస్ ఓపెన్‌కు సుమారు 80 మంది బాల్ బాయిస్, బాల్ గరల్స్‌గా సేవలు అందిస్తారు.
మొట్టమొదిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన ఆఫ్రికన్-అమెరికన్ అల్‌థియా గిబ్సన్.
యూఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో పీట్ సంప్రాస్ 19 సంవత్సరాల ఒక నెల వయసులో టైటిల్ సాధించాడు. మహిళల విభాగంలో ట్రాసీ ఆస్టిన్ టైటిల్ గెల్చుకున్నప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాల 8 నెలలు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన పిన్న వయస్కులుగా వీరు రికార్డు నెలకొల్పారు. కాగా, విలియమ్ లార్నెడ్ పురుషుల విభాగంలో టైటిల్ సాధించినప్పుడు అతని వయసు 38 సంవత్సరాల 8 నెలలు. మహిళల విభాగంలో మొలా జుర్డెట్ మలోరీ 42 సంవత్సరాల 5 నెలల వయసులో టైటిల్ అందుకుంది. పురుషులు, మహిళల విభాగాల్లో టైటిల్ సాధించిన ఎక్కువ వయస్కులుగా వీరి పేర్లు కూడా రికార్డు పుస్తకాల్లో చేరాయి.
చిత్రం... సెరెనా విలియమ్స్