క్రీడాభూమి

మను, సుమిత్‌కు బెస్టు ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మెక్సికో ఓపెన్ టోర్నమెంట్‌లో గ్రాండ్‌ప్రీ టైటిల్ సాధించి మంచి జోరుమీద ఉన్న భారత జోడీ మను అత్రి, బి.సుమిత్ రెడ్డి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్టు ర్యాంకును సాధించారు. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) శుక్రవారం తాజాగా ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో వీరు మూడు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకోగా, మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2వ స్థానంలోనూ, ‘తెలుగు తేజం’ పివి.సింధు 12వ స్థానంలోనూ, పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్.ప్రణయ్ వరుసగా 9, 15, 20 ర్యాంకుల్లో యధాతథంగా కొనసాగుతున్నారు. మను, సుమిత్ గత వారాంతం మెక్సికో ఓపెన్‌లో థాయిలాండ్‌కు చెందిన బోడిన్ ఇస్సార, నిపిట్పోన్ పువాంగ్ పువాపెచ్ జోడీని మట్టికరిపించడంతో పురుషుల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు మరింత మెరుగుపడ్డాయి. అయితే మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప ఒక స్థానం కిందికి దిగజారి 14వ ర్యాంకుకు పడిపోగా, మెక్సికో ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న అజయ్ జయరామ్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 21వ ర్యాంకుకు చేరుకున్నాడు.

రోమియో, మందర్‌లకు నోటీసులు
జాతీయ శిబిరానికి రాకపోవడంపై ఎఐఎఫ్‌ఎఫ్ ఆగ్రహం

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: డెంపో క్లబ్ జట్టుకు చెందిన రోమియో ఫెర్నాండెజ్, మందర్‌రావు దేశాయ్ జాతీయ శిబిరానికి హాజరు కాకపోవడంతో వారిద్దరికీ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఎఐఎఫ్‌ఎఫ్ స్పష్టం చేసింది. ‘జాతీయ శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందుకు మీపైన, మీ క్లబ్బులపైన ఆంక్షలు, జరిమానాలు విధించడానికి మందు వివరణ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాం’ అని రోమియో, మందర్‌రావులకు పంపిన షోకాజ్ నోటీసుల్లో ఎఐఎఫ్‌ఎఫ్ స్పష్టం చేసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నమెంట్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిద్దరి కాంట్రాక్టు ఈ నెల 20వ తేదీన ముగిసింది. ఐఎస్‌ఎల్ టోర్నీ ముగిసిన తర్వాత రోమియో, మందర్‌రావు ప్రస్తుతం కేరళలో కొనసాగుతున్న జాతీయ శిబిరంలో చేరుతారని భావించారు. అయితే ఐఎస్‌ఎల్ ఫైనల్‌లో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆది నుంచి చిట్టచివరి వరకూ ఆడిన వీరిద్దరూ జాతీయ శిబిరానికి రాలేదు. దీంతో వచ్చే వారంలోగా వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎఐఎఫ్‌ఎఫ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నేటి నుంచి దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ తొలి టెస్టు

డర్బన్, డిసెంబర్ 25: నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకోసం దక్షిణాప్రికా, ఇంగ్లండ్ జట్లు శనివారం ఇక్కడి కింగ్స్‌మేడ్ మైదానంలో తలపడనున్నాయి.కాగా, ఈ రెండు జట్లు కూడా విజయం కోసం తహతహలాడుతుండడంతో సమవుజ్జీలయిన ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది. దక్షిణాఫ్రికా ఇటీవల భారత్ చేతిలో 3-0 తేడాతో టెస్టు సిరీస్‌లో చిత్తయిన విషయం తెలిసిందే. 2012లో టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా నిలిచిన తర్వాత దక్షిణాఫ్రికా ఇంత ఘోరంగా పరాజయం పాలవడం ఇదే మొదటిసారి. ఇక యుఎఇలో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లోఇంగ్లండ్ సైతం పాకిస్తాన్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. కాలిపిక్క గాయం కారణంగా ప్రధాన బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆడలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ కాగా, డేల్ స్టెయిన్ గాయంనుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం దక్షిణాఫ్రికాకు కొత్త బలాన్ని చేకూర్చింది. అయితే టెస్టుకు ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌లలో మంచి ప్రతిభ కనబరిచిన ఇంగ్లండ్ ఈ టెస్టులోను అదే ఫామ్‌ను కొనసాగించగలమన్న నమ్మకంతో ఉంది. కాగా,్భరత్‌లో స్పిన్నర్ల ముందు ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఇప్పటికీ ఫామ్‌లోకి రాకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు ఎబి డెవిలియర్స్, పఫ్ డుప్లెసిస్‌లు విశ్రాంతి తీసుకోవడం ఆ జట్టును మరింత డీలా పడేలా చేసింది.
అయితే స్వింగ్ బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై తమ బౌలర్లు రాణిస్తారన్న నమ్మకంతో ఆ జట్టు ఉంది.