AADIVAVRAM - Others
చెప్పుడు మాటలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒక ఊళ్లో రామమ్మ, సూరమ్మ అనే ఇద్దరు పేద స్ర్తిలు ఊరి చివర చిన్న గుడిసెల్లో ఉండేవారు. వారికి నా అనేవారు ఎవరూ లేరు. ఏదో కూలిపని చేసుకొని పొట్ట నింపుకునేవారు. అయితే వారికి రోజూ కూలిపని దొరికేది కాదు. తిండిలేక పస్తులు ఉండాల్సి వచ్చేది. వారిద్దరూ కూడబలుక్కుని ‘మనం ఇద్దరం ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నారు. ఏ వ్యాపారం చేయాలో బాగా ఆలోచించుకున్నారు.
‘పేలాలు, మరమరాలు (మురీలు) బెల్లంతో ఉండలు చేసి అమ్మితే బాగుంటుంది. పిల్లలు వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని తయారుచేయడం నాకు బాగా వచ్చు. పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం లేదు’ అంది రామమ్మ.
‘నేను వాటిని ఊళ్లో నాలుగు వీధులు తిరిగి అమ్ముకొని వస్తాను’ అంది సూరమ్మ. ఇద్దరూ వారి వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో పేలాలు, మరమరాలు, బెల్లం కొని ఉండలు చేశారు.
సూరమ్మ బజారుకి వెళ్లి తన చెవి పోగులు అమ్మి ఆ డబ్బుతో పాత సామానులు అమ్మే కొట్లో అద్దాల పెట్టె ఒకటి కొంది. అందులో మధ్యన అట్టముక్కతో రెండు అరలు చేసి ఒక దానిలో పేలాల ఉండలు, మరొక దానిలో మరమరాల ఉండలు పెట్టుకొని ఊళ్లోని బడి వద్దకు వెళ్లింది. బడి పిల్లలంతా వాటిని కొనుక్కున్నారు. సరుకులంతా చిటికెలో చెల్లుబడి అయిపోయింది. తమ పెట్టుబడికి మూడింతలు లాభం రావడంతో సూరమ్మ, రామమ్మ ఎంతో సంతోషించారు. నెల తిరిగేసరికి వారు ఆర్థికంగా బలపడ్డారు. వారు వేరుసెనగ పలుకులు, బెల్లం ఉండలు కూడా చేసి అమ్మడం మొదలుపెట్టారు. వారు ఆర్థికంగా బలపడటం చూసి ఇరుగు పొరుగు వారు ఓర్వలేకపోయారు.
వారు రామమ్మను ఒంటరిగా కలిసి ‘రామమ్మా! నువ్వు పొద్దస్తమానం కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని సరుకు తయారుచేస్తే ఆ సూరమ్మ టిక్కుటిక్కు అని రెండు వీధులు తిరిగొస్తోంది. శ్రమంతా నీది ఫలితం ఆమెదీని. లాభంలో రెండొంతులు నువ్వు తీసుకో’ అన్నారు.
అదే విధంగా వారు సూరమ్మను కూడా ఒంటరిగా కలిసి
‘ఉదయం నుండి నువ్వు ఎండలో ఊరంతా తిరిగి సరుకు అమ్ముకొని వస్తున్నావు. రామమ్మ ఇంటి వద్ద నీడ పట్టున ఉండి సరుకు తయారుచేస్తోంది. సరుకు గంటలో తయారై పోతుంది. ఆమెకు తరువాతంతా విశ్రాంతే! నీకు శ్రమ ఎక్కువ అందుచేత వచ్చిన లాభంలో రెండొంతులు నీకు ఇమ్మని’ చెప్పమన్నారు. చెప్పుడు మాటలు రామమ్మకు, సూరమ్మకి బాగా తలకెక్కాయి. ఇరువురూ వాదించుకుని పోట్లాడుకుని విడిపోయారు. ఎవరికి వారే సరుకు తయారుచేసుకొని అమ్ముకోవాలనుకున్నారు.
అయితే రామమ్మకి సరుకు చేయడం వచ్చు కానీ ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో తెలియలేదు. పైగా ఆమె వద్ద సరుకు తీసుకొని వెళ్లడానికి అద్దాల పెట్టె లేదు. పాత సామాన్లు అమ్మే అంగడిలో మరొకటి లేదు. కొత్తది చేయించడానికి బోలెడు సొమ్ము అవుతుంది. అందుచేత సరుకు గోనెసంచిలో వేసుకొని వెళ్లింది. దానిని చూసి ఎవరూ కొనలేదు. సూరమ్మకి సరుకు తయారుచేయడం రాలేదు. పాకం కుదరక సరుకు పాడైపోయింది. ఇరువురూ చెప్పుడు మాటలు విని నష్టపోయారు.
***********************************
ప్రపంచ శాస్తవ్రేత్తలు
-పి.వి.రమణకుమార్
న్యూటన్
ఇంగ్లండ్‌లోని లింకన్ షైర్ పరిసరాల్లో వూల్స్‌తార్ప్ అనే చిన్న గ్రామంలో 1642 డిసెంబర్ 25న సరిగ్గా క్రిస్మస్ పర్వదినాన న్యూటన్ మహాశయుడు జన్మించాడు. దురదృష్టవశాత్తు న్యూటన్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే విడిపోయారు. అమ్మమ్మ గారింట్లో పెరుగుతున్న న్యూటన్‌పై అనేక విషాద సంఘటనల ప్రభావం పడింది. పాఠశాలలో విద్యార్థులు అనే సూటిపోటి మాటలు భరించలేనంతగా ఉండేవి. అయినా అతను అన్నీ దిగమింగి తన చదువు సాగించేవాడు.
చదువులో పైకి ఎదగాలన్న ఆసక్తితో న్యూటన్ అర్ధరాత్రి లేచి గుడ్డిదీపం పెట్టుకుని, తన పుస్తకాలను తిరగేస్తుండేవాడు. అతనికి చదువుమీద గల అపారమైన ఆసక్తిని కనిపెట్టిన మేనమామ, న్యూటన్‌ను 1660లో కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో చేర్పించాడు. న్యూటన్ తన ప్రతిభాపాటవాలను ఉపాధ్యాయులకు చూపి ప్రశంస లందుకున్నాడు.
1665లో చదువు పూర్తి చేసి గణిత, భౌతిక శాస్త్రాలలో ప్రయోగాలు చేసి, ఫలితాలు సాధిస్తూ 1669లో తను చదివిన ట్రినిటీ కాలేజీలోనే గణితంలో లెక్చరర్‌గా చేరాడు. రాయల్ సొసైటీలోని రాబర్ట్ హుక్ అనే శాస్తజ్ఞ్రుడి సహకారంతో చక్కని శాస్తజ్ఞ్రుడిగా ప్రతిష్ఠలు పొంది, ఆ రాయల్ సొసైటీకే అధ్యక్షుడిగా ఇరవై ఐదేళ్ల పాటు వరుసగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా న్యూటన్ కనిపెట్టిన ‘్భమ్యాకర్షణ సిద్ధాంతం’ తర్వాతి తరం శాస్తవ్రేత్తలకు ఎంతో స్ఫూర్తినివ్వడమే కాకుండా అనేక నూతన ప్రయోగాలకు దోహదం చేసింది. ‘ఒక ఆపిల్ చెట్టుకున్న పండు ఊడితే నేల మీదే ఎందుకు పడాలి? ఆకాశం మీదకు ఎందుకు ఎగరకూడదు?’ అనే విషయం న్యూటన్‌కు తట్టేవరకూ మరెవరికీ తట్టలేదు. తన చిన్నతనంలో పొలాల్లో గడిపిన మధుర క్షణాల్లోని అనుభవాలే తనను ఆ సిద్ధాంతం కనిపెట్టడానికి ప్రేరణనిచ్చాయని తరువాత న్యూటన్ తెలియజేశాడు. ఖాళీ సమయాలను తన పెంపుడు జంతువుల కోసం కేటాయించిన మహా శాస్తవ్రేత్త సర్ ఐజాక్ న్యూటన్ తీవ్రమైన అనారోగ్యం వలన 1727 మార్చి 20న తన 85వ ఏట కెన్సింగ్‌టన్‌లో మరణించాడు.
****************************************
మట్టి ముద్దలు
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
మహంత్ చదివే స్కూలుకి మట్టి కుండలని తయారుచేసే కుమ్మరిని పిలిపించారు. అతను పిల్లలకి పాటరీ క్లాస్‌ని తీసుకున్నాడు. మట్టితో కుండని ఎలా చేయాలో అతను ఒకటికి రెండుసార్లు చూపించాడు. తర్వాత ఒకో విద్యార్థి వచ్చి తను చూసినట్లుగా కుండలని చేయసాగాడు. తన వంతు రాగానే మహంత్ కూడా ఓ కుండని తయారుచేశాడు.
ఇంటికి వచ్చాక మహంత్ క్లాస్‌లో జరిగింది తల్లిదండ్రులకి వివరించి చెప్పాడు.
‘నేనూ ఆ మట్టి ముద్దలాంటి వాడినే. గుల్షన్, గిరిధారి చేసిన కుండలని చూసి అంతా మెచ్చుకున్నారు. బహుశా వాటిని స్కూల్లో పూలని ఉంచడానికి వాడతారు. నేను చేసిన కుండ అంత బాగా గుండ్రంగా రాలేదు. నేనూ ఆ మట్టి ముద్ద లాంటివాడినే’
వాడిలోని విచారాన్ని గమనించిన తండ్రి ఓదార్పుగా చెప్పాడు.
‘నువ్వు మరి కొన్ని కుండలని తయారుచేస్తే, నువ్వూ మంచి కుండలని చేయగలవేమో?!’
‘కానీ, గుల్షన్, గిరిధారి నాలాగా ఒక్కసారి చూశాక మంచి కుండలని తయారుచేశారు. మరి నేనెందుకు చేయలేక పోయాను?’
కొడుకులోని బాధని గమనించిన తల్లి చెప్పింది.
‘హష్‌ముఖ్ వౌత్ ఆర్గన్ బాగా వాయిస్తాడు. హేమ్‌రాజ్ క్రికెట్ బాగా ఆడతాడు. గిరిధారి, గుల్షన్‌లు కుండలు బాగా చేస్తారు. ఒక్కొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉంటుంది. నిజానికి మనం కూడా ఆ మట్టిముద్దల్లాంటి వాళ్లమే’
మహంత్ తల్లి వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
‘మనంతట మనంగా ఏమీ చేయలేం. పరమాత్మ మన కుమ్మరి. ఆయన ఎంతో నైపుణ్యంతో మట్టి ముద్దలాంటి మనల్ని ఉపయోగకరమైన వారిగా మలుస్తాడు. అందుకు మనం చేయాల్సిందల్లా ఆ మట్టిలా మనల్ని తీర్చిదిద్దే చేతులకి అణిగిమణిగి ఉండడమే’
‘అంటే?’ మహంత్ ప్రశ్నించాడు.
‘అంటే, మృదువుగా మలచడానికి తేలిగ్గా ఉండాలి. మట్టి ముద్ద గట్టిపడితే మలచడం కష్టం. మనం పట్టుదలగా, మన హృదయాలు కఠినంగా ఉంటే, పరమాత్మ మనని అందమైన మనిషిగా తీర్చిదిద్దలేడు. నువ్వు మురికి మట్టిముద్దవి కాదు. సహనంగా ఉంటే, కొద్దికొద్దిగా పరమాత్మ నిన్ను తీర్చిదిద్దుతాడు. అందుకు ఆయన బోధనలని వినాలి’ తల్లి వివరించింది.