డైలీ సీరియల్

బంగారుకల - 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమిటిది గోవిందా! ఈ తిమ్మరుసు బతికి ఉండగానే విజయనగర ప్రజలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారా! రాజ్యమంతా విప్లవిస్తోందా? ఇది నాకు ఆనందాన్ని కల్గిస్తుందనుకుంటున్నావా?’’ తండ్రిని కలవటానికి వచ్చిన గోవింద రాయలతో తిమ్మరుసు ఆవేదనను పంచుకొన్నారు.
‘‘వద్దు గోవిందా! నా మాటగా ప్రజలకు చెప్పు. రాయలకు అండదండగా నీవు నిలు నాయనా! తిరుగుబాటును అణచివేయాల్సిందిగా సేనాధిపతులకు చెప్పు. తక్షణ చర్యలు చేపట్టండి. నేను ప్రాణాలతో ఉండాలంటే నా రాయలకు మీరంతా జీవితకాలం విశ్వాసపాత్రులుగా మసలాలి’’ మళ్లీ వేదనగా అన్నాడు.
‘‘తండ్రీ! ఇదెక్కడి న్యాయం? చేయని తప్పుకు శిక్షననుభవిస్తూ ఇంకా ఆ రాయలపై ప్రేమ కురిస్తున్నారు’’ గోవింద రాయలు వాపోయాడు.
శిక్షాదినం ఉదయించింది. తిమ్మరుసు శిక్షించడానికి అంతా సిద్ధమైంది.
ప్రజలంతా కారాగారంలోకి చొచ్చుకువచ్చారు. ఎవరాపినా ఆగటం లేదు.. వారందరినీ ఉద్దేశించి తిమ్మరుసు వేడికోలు వాక్యాలు పలికారు.
‘‘మహాజనులారా! మీరు విజయనగర ప్రజలు. ఇలా ఇతరులలా ప్రవర్తించటం తగదు. నా మాట మీద గౌరవముంటే తక్షణం అంతా వెళ్లిపోండి. నా మీద ప్రేమాభిమానాలుంటే మన ప్రభువు శ్రీకృష్ణదేవరాయలువారిని ఇంతకు ముందువలెనే సేవించండి’’.
తిమ్మరుసు ప్రార్థన విని ప్రజలంతా ఆ మహనీయుని అపూర్వ రాజభక్తికి కరిగి నీరయి చేతులెత్తి నమస్కరించి కన్నీటితో వెళ్లిపోయారు.
‘‘అప్పాజీ! నన్ను క్షమించండి అప్పాజీ’’ కారాగారంలో కాపలాదారునిగా మారువేషంలో నిలబడిన కృష్ణరాయలు అప్పాజీ కాళ్ళపై పడ్డారు.
‘‘ఎవరు? రాయా! మీరా! ఏమిటీ పని. విజయనగర ప్రభువులకిది తగని పని’’ వారించారు తిమ్మరుసు. ‘‘అప్పాజీ! మీరీ హత్య చేయలేదని నా మనసు చెప్తోంది. అసలు దోషులెవరో మీకూ తెల్సు. వారి పేర్లు బయటపెట్టండి అప్పాజీ. నాకు మనశ్శాంతి ప్రసాదించండి’’ తిమ్మరుసు పాదాల వద్ద మోకాళ్ళపై కూలబడి రాయలు ఆక్రోశించారు.
‘‘ఏమిటీ బేలతనం రాయా! కర్తవ్య పాలనలో స్వపర భేదాలుండవు. మీ ధర్మపాలనకు నేను చాలా గర్వపడుతున్నాను. ధర్మపరిషత్తు తీర్పుకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రభువయిన మీరు ఇలా ప్రవర్తిస్తే లోకం హర్షిస్తుందా? మీరు విధించిన శిక్షను నేను అమలు చేసుకుంటున్నాను’’ అంటూ ఎర్రగా కాల్చి శిక్ష అమలుకు సిద్ధంగా ఉన్న ఇనుప కడ్డీలతో తన కళ్ళను తానే పొడుచుకున్నాడు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! ఎంత పనిచేశారు. జీవితాంతం నాకు శిక్ష వేశారు. నేనెంత పాపిష్టివాడిని’’ రాయలు రోదిస్తుండగా రామలింగ నాయకుడు ప్రవేశించాడు.
‘‘ప్రభూ! యువరాజువారిని విషప్రయోగంతో హత్య చేయటానికి రాజవైద్యులను ధనంతో ప్రలోభపెట్టి అకృత్యం చేసిన వీరేంద్రునీ, రాజవైద్యులను బంధించాను. వారు నేరాన్ని అంగీకరించారు ప్రభూ!’’
‘‘అయ్యో! ఒక్క ఘడియ ముందీ విషయం ఎందుకు తెలియలేదు? భగవంతుడా! ఎంతటి అరిష్టం జరిగిపోయింది. అప్పాజీ! మీరెంతటి దయా హృదయులు. ఇంత జరిగినా ఇంకా ఈ దురదృష్టవంతుడిపై దయచూపిస్తున్నారా!’’ రాయల వేదనకు అంతులేదు.
‘‘ప్రభూ! జాతస్య ధ్రువో మృత్యుః ఈ విజయనగర సామ్రాజ్యలక్ష్మిని పరిరక్షించే బాధ్యత పూర్తిగా ఇక మీదే!’’ కళ్ళు అగ్నిగోళాలుగా మండుతున్నా వినయంగా చెప్పారు తిమ్మరుసు.
‘‘అప్పాజీ! ‘రాయా’ అనే మీ పిలుపుకు దూరమైన నా జీవితం, ఈ సామ్రాజ్యమెందుకు?’’ రాయలు శోకం అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.
‘‘రామలింగ నాయకా! ఇంతటిఘోర కలికి బాధ్యులైన ఆ ముగ్గుర్నీ న్యాయ పరిషత్తు ముందు నిరూపించి వారికి మరణశిక్ష అమలు చేయండి. అప్పాజీ! మీరు నాకెప్పుడూ పూజ్యులే! నా వెంట మీరు లేకపోతే నేను ప్రాణం లేని శిలనే! రండి అప్పాజీ! నన్ను క్షమించగలరా అప్పాజీ’’ రాయలు అప్పాజీ కాళ్ళు పట్టుకున్నారు. అప్పాజీని స్వహస్తాలతో నడిపించుకుంటూ కారాగారంలోంచి బయటికి తీసుకువస్తున్న కృష్ణరాయలు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అక్కడున్నవారందరికీ రాయల్ని చూస్తుంటే సానుభూతితోపాటు గౌరవమూ పెరిగింది.
‘‘జై శ్రీకృష్ణదేవరాయలకూ! జై మహామంత్రి తిమ్మరుసులవారికీ!’’ జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి.
***
తిమ్మరుసు మహామంత్రి ఇప్పుడు మునుపటిలా రాచకార్యాల్లో ఎక్కువగా నిమగ్నం కావటం లేదు కారాగారం నుంచి విముక్తులై. మంజరీ, చంద్రప్పలు కళాకారులుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విఠల దేవాలయ పరిసరాల్లో ఆ ప్రశాంత వాతావరణంలో ఇరువురు తలపులు కలబోసుకుంటున్నారు.
‘‘చంద్రా! మన కారాగారవాసం మంచికే జరిగింది. విరహంలో ప్రేమ మరింత పెరుగుతుంది కదూ’’ నిండు మనసుతో అంది.
‘‘నాకైతే దినమొక యుగంగా గడిచింది. రాజ్యం కోసం కాకపోతే బతికి ప్రయోజనమేముంది? నువ్వు కూడా నాకు ఎంతో సహకారమందించావు సుమా!’’ ప్రశంసించాడు.
‘‘చంద్రా! ఈ చల్లని వెనె్నల రేయి నా మనసుకి శాంతినిచ్చేలా ఓ పాట పాడవూ..’’ అతని కన్నులోకి చూస్తూ గోముగా అడిగింది.
‘‘దేవిగారి కోరిక కాదనగలనా’’ చంద్రప్ప మధుర స్వరంతో గానం చేశాడు.
‘‘ఎంత బాగా పాడావు. నీ గొంతులోనే వెనె్నల జాలువారుతోంది సుమా!’’
మంజరి మాటలకి చంద్రప్ప ప్రేమగా ఆమె ఒడిలోకి చేరాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి